- January 17, 2022
Karthika Deepam నేటి ఎపిసోడ్.. వంటలక్క కష్టాలు తీరనున్నాయ్.. సౌందర్య ఎంట్రీతో రుద్రాణి ఖతం

కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే జనవరి 17 సోమవారం నాటి Karthika Deepam Episode 1251 ధారావాహికలో మంచి ఎమోషనల్ సీన్లు పడ్డాయి. అప్పి గాడు కుళ్లు జోకులు, మోనిత కపట నాటకాలు కామన్‌గా వచ్చాయి. రుద్రాణి మనుషులు స్కూల్‌కు వెళ్తే పిల్లలు ఝలక్ ఇస్తారు. ఇక ప్రకృతి వైద్యశాలకు డాక్టర్ బాబు మొదటి సారిగా వెళ్తాడు. అక్కడ తన తల్లిదండ్రులను చూసి షాక్ అవుతాడు. అలా మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.
రుద్రాణి పన్నాగం దీపకు అర్థమైంది. ఎలాగైనా సరే అప్పు తీర్చనివ్వకుండా చేయాలని, పిల్లల మీద కన్నేసిందని తెలుసకుంది. అప్పు ఎలా తీర్చాలి.. డాక్టర్ బాబు ఏదో పనిలో చేరాను అని అన్నారు.. కానీ ఏ పనో తెలీదు.. అడిగితే బాధపడతారు అని అడగలేదు.. అని దీప అనుకుంటూ ఉంటుంది. ఇందులో ఆనంద్ ఏడుస్తుంటాడు. పాలు తీసుకొస్తానురా ఉండు.. అని దీప వెళ్తుంది. అయ్యో ఇంట్లో గ్యాస్ అయిపోయింది.. ఆ విషయమే మరిచిపోయాను.. హోటల్‌లో అప్పారావుని అడిగితే ఇస్తాడేమో.. అని దీప బయల్దేరుతుంది.
ఇది రుద్రాణక్కకి.. అది ప్రకృతి వైద్యశాలకు.. అని అప్పిగాడు ఆర్డర్‌ల గురించి చెబుతాడు. రుద్రాణి పేరు వినడంతో షాక్ అవుతాడు. ఏంటి రుద్రాణితో గొడవలు లేవు కదా?.. ఆ రుద్రాణక్క చాలా డేంజర్. జాగ్రత్త.. వెళ్లామా? వచ్చామా? అంతే.. రుద్రాణక్క గురించి మరోసారి తీరిగ్గా ఉన్నప్పుడు చెబుతాను.. రుద్రాణి చేసినవన్నీ తలుచుకుంటాడు కార్తీక్..
నువ్ హీరోలా ఉంటావ్ బావా.. రుద్రాణికి పార్శిల్ తీసుకెళ్తావ్ కదా? జాగ్రత్త బావ.. కొత్త సినిమా కబుర్లేంటి.. అని అప్పుగాడు అడిగితే.. గ్యాస్ కావాలి అప్పు అని కార్తీక్ అడిగేస్తాడు. గ్యాస్ సిలిండర్ ఉంది కదా? నేను గ్యాస్ అరేంజ్ చేస్తానులే అని అప్పిగాడు అంటాడు. అలా కార్తీక్ వెళ్తాడు.. ఇంతలో దీప కూడా వస్తుంది. ఏంటక్క ఇలా వచ్చావ్ అని అప్పిగాడు అంటే.. అప్పారావ్ చిన్న పని ఉంది అని దీప అంటుంది. ఏంటో అడుగు అక్క ఈ అప్పిగాడు అందరివాడు అందరి బందువు, తగ్గేదేలే అని బిల్డప్ ఇస్తాడు. గ్యాస్ కావాలని అడిగితే రెండు నిమిషాల క్రితం అడిగితే బాగుండేది.. ఇంతకు ముందే నా బావకు మాటిచ్చాను..అని అప్పిగాడు అంటాడు. ఈ రోజుకు ఎలాగోలా అడ్జస్ట్ అవ్వు అక్క.. రేపు అడిగిస్తాను అని అంటాడు.
మరోవైపు విన్నికి తన వీరప్రేమ గాథను తన కోణంలోంచే మోనిత వివరించి ఉంటుంది. ఎన్నో ప్రేమ కథలు, లవ్ స్టోరీలు విన్నాను.. కానీ ఇలాంటిది మాత్రం వినలేదు.. మీరు ఆర్డినరి అనుకున్నాను.. ఎక్స్ట్రా ఆర్డనరీ.. పెళ్లి కాకుండానే తల్లి అయ్యారు.. బాబు కోసం నిలబడ్డారు.. లవ్ స్టోరీలో నెంబర్ వన్ లవ్ స్టోరీ.. అని విన్ని ఏడ్చేస్తుంది. థ్యాంక్స్ విన్ని అని మోనిత అంటుంది.. ఇలాంటి ప్రేమ కథ ఉందని, ఎవ్వరికీ తెలియదు.. కానీ ఉంది.. అని మోనిత తన గురించి తాను గొప్పగా చెబుతుంది. మీరు దైర్యంగా ఉండండి అని విన్ని అంటుంది.. నా ప్రేమ కథను మెచ్చుకున్నావ్.. తెలివైన దానిలా ఉన్నావ్.. నిన్ను వదులుకోను విన్ని.. అని మోనిత లోలోపల అనుకుంటూ ఉంటుంది.
ఇక్కడ ఇలాంటిది ఒకటి ఉందని నాకు ఇప్పటి వరకు తెలీదే.. అని ప్రకృతి వైద్యశాలను చూసి డాక్టర్ బాబు ఆశ్చర్యపోతాడు. అక్కడ ఆనంద్ రావుని చూసి కార్తీక్ ఆశ్చర్యపోతాడు. డాడీ ఇక్కడకు ఎందుకు వచ్చారు.. అన్నీ వదిలేసి ఇక్కడకు చేరారా? నేను ఎంత రాక్షసుడిలా మారాను.. ఈ ఇంతటికి నేనే కారణం.. అని బాధపడతాడు. ఇక ఆ పార్సిల్ చూసిన సౌందర్య.. ఎవరోగానీ కరెక్ట్ టైంకి తెచ్చాడు అని అనుకుంటుంది.
తినడానికి కూడా ఫుడ్ ఆర్డర్ తీసుకునే స్థితికి తీసుకొచ్చాను అని కార్తీక్ బాధపడతాడు. భోజనం ప్లేట్లుతో తెస్తాను అని సౌందర్య అంటే.. ఆకలేయడం లేదు. భోజనం చేస్తుంటే.. పెద్దోడే గుర్తుకు వస్తున్నాడు.. రుచికరమైన భోజనం తింటూ.. నీడ పట్టునే ఇంట్లో హాయిగా ఉన్నాం.. ప్రతీ ముద్ద తినబోతోన్నప్పుడల్లా నా కొడుకు తిన్నాడో లేదో.. అయ్యో నా మనవరాళ్లు తిన్నారో లేదో.. అయ్యో దీప తిందో లేదో అని నాకు అనిపిస్తోంది సౌందర్య..
అందుకే భోజనం కూడా సరిగ్గా చేయలేకపోతోన్నాను.. ఏంటి సౌందర్య మన జీవితాలు ఇలా అయ్యాయ్.. పెద్దోడు ఇంత పని చేస్తాడని అనుకోలేదు.. వెళ్లాడే అనుకో.. నాకు ఇక్కడ ఉండాలని లేదు.. వెళ్లొస్తాను అని చెబితే బాగుండేది.. అని ఆనంద్ రావు బాధపడుతుంటాడు. ఆ మాటలు వింటూ కార్తీక్ కంటతడి పెట్టేసుకుంటాడు. పెద్దోడు త్వరలోనే వస్తాడు అని సౌందర్య ధైర్యం చెబుతుంది.. నాకు నమ్మకంపోతోంది.. చూస్తానో లేదో కూడా తెలీదు.. నేను చూస్తానో లేదో పక్కన పెడితే.. నా ప్రాణాలు పోతే.. కనీసం చివరి కర్మలకు అయినా వస్తాడో లేదో.. అని ఆనంద్ రావు కుమిలిపోతాడు. అది చూసి కార్తీక్ మరింత బాధపడతాడు.
ఇక రుద్రాణి మనుషులు పిల్లలకు భోజనం పెట్టేందుకు స్కూల్‌కు వస్తారు.. ఎలాగైనా పిల్లలకు భోజనం పెట్టాలి.. తినిపించాలి.. అక్కని సంతోష పెట్టాలి.. అని అనుకుంటారు. కానీ తిరిగి పిల్లలకు వారికే షాక్ ఇస్తారు. వారు తెచ్చిన భోజనాన్ని మిగతా పిల్లలకు వడ్డిస్తారు. అలా వారినుంచి తప్పించుకుని ఇంటికి పరిగెత్తుకుని వస్తారు. ఏమైంది స్కూల్ అయిపోయిందా ఇలా వచ్చారు అని దీప అడిగితే.. రుద్రాణి మనుషులు స్కూల్‌కు వచ్చారు.. అని చెబుతుంది. రుద్రాణి ఆగడాలు ఎక్కువైపోయాయ్ అని దీప అనుకుంటూ ఉంటుంది. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే రేపటి ఎపిసోడ్‌లో రుద్రాణి చెంపను సౌందర్య వాయించేస్తుందట. రుద్రాణిని కొట్టిన మహానుభావురాలిని కచ్చితంగా చూడాలని దీప ప్రకృతి వైద్యశాలకు వస్తుంది. అక్కడ సౌందర్య, ఆనంద్ రావులను చూసి దీప చలించిపోతుంది. మరి తరువాత ఏం జరుగుతుందో చూడాలి.