• January 6, 2022

Karthika Deepam నేటి ఎపిసోడ్.. భర్త ఎన్ని చేసినా భరించేస్తోంది.. డాక్టర్ బాబుపై వంటలక్కకు ఎనలేని ప్రేమ

Karthika Deepam నేటి ఎపిసోడ్.. భర్త ఎన్ని చేసినా భరించేస్తోంది.. డాక్టర్ బాబుపై వంటలక్కకు ఎనలేని ప్రేమ

    కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ అంటే గురువారం నాటి Karthika Deepam Episode 1242 ధారావాహికలో మొత్తం డాక్టర్ బాబు, వంటలక్క చుట్టే తిరిగింది. రుద్రాణి పెట్టిన కండీషన్ గురించి ఇన్నాళ్లు బాధపడుతూ వచ్చిన కార్తీక్.. ఆ నిజాన్ని ఎట్టకేలకు దీపకు చెబుతాడు. దీంతో దీపకు కళ్లుతిరిగినట్టు అవుతుంది. ఎందుకు ఇలాంటి పనులు చేస్తారంటూ కార్తీక్‌ను దీప అడుగుతుంది. అలా మొత్తానికి కార్తీక దీపం నేటి ఎపిసోడ్‌లో భార్యాభర్తల ఎమోషన్ సాగింది.

    రుద్రాణి అలా ఎందుకు చేస్తోందంటూ పిల్లలు పదే పదే ప్రశ్నిస్తాడు. అసలు ఆవిడ గురించి ఆలోచించకండి..అని దీప చెబుతుంది. ఇక డాక్టర్ బాబు ఒంటరిగా అన్నీ ఆలోచించుకుంటూ బాధపడతాడు. ఇంట్లో ఎంత సంతోషంగా ఉండేవాళ్లం.. అందరికీ దూరమై నేను ఏం సాధించాను.. మధ్యలో ఆ రుద్రాణి తలనొప్పి అంటూ అన్నీ తలుచుకుంటూ బాధపడతాడు..

    ఏం ఆలోచిస్తున్నారు.. అని దీప అడుగుతూ.. మీ బలం, గొప్పదనం ఏంటో మీకు తెలీదు.. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది.. రుద్రాణి అప్పు గురించి బాధపడుతున్నారా? అని అంటుంది. అప్పు మాత్రమే కాదని, మన బిడ్డల్లోంచి ఒకరిని తీసుకెళ్తోందని నీకు ఎలా చెప్పాలి దీప అని డాక్టర్ బాబు తనలో తానే కుమిలిపోతాడు..

    మన పిల్లల మీద రుద్రాణికి సడెన్‌గా ప్రేమ ఎందుకు కలిగింది.. అప్పుడోసారి వచ్చినప్పుడు మీతో ఏదో చిన్నగా మాట్లాడింది.. అదేంటి?.. అంత ఆస్థిని వదిలేసి వచ్చారు.. ఏదైనా విషయం నా దగ్గర దాస్తున్నారా? దీప.. మీరు ఏదోలా కనిపిస్తున్నారండి.. నిజం చెప్పండి.. నా మీద ఒట్టేసి చెప్పండి.. ఏం దాస్తున్నారు.. మీరెందుకు ఇంత నలిగి పోతోన్నారు.. చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే.. అని దీప అనడంతో కార్తీక్ అసలు విషయాన్ని చెప్పేస్తాడు.

    పిల్లల్లో ఒకరిని తీసుకెళ్లిపోతానంది.. అని కార్తీక్ చెప్పడంతో.. దీప షాక్ అవుతుంది. ఏంటి అని దీప అడిగితే..అవును దీప.. గడువులోగా ఒప్పుకున్న బాకీ సొమ్ము తీర్చకపోతే.. ఒకరిని తీసుకెళ్తానంది.. అని కార్తీక్ చెబుతాడు. అలా ఎలా ఒప్పుకున్నారు మీరు.. మాట కోసం బిడ్డను ఇచ్చేస్తారా?.. నా బతుకింతేనా?.. ఎప్పుడూ బిడ్డలను దూరం చేసుకుని బతకాలా?.. ఏం చేస్తున్నారు డాక్టర్ బాబు మీరు.. అని దీప ఏడ్చేస్తుంది.

    ఆవేశంలో సంతకం పెట్టేశాను.. అందులో తను అలా రాసుకుందని తరువాత తెలిసింది.. అని కార్తీక్ చెబుతాడు. మీరు సంతకం పెడితే తను తీసుకెళ్తుందా? నా బిడ్డను తను ఎలా తీసుకెళ్తుందట.. అంతా మీ ఇష్టమేనా?.. నా ఇష్టం లేదా? ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదు.. తప్పుల మీద తప్పులు జరుగుతున్నాయ్.. దేవుడా నీకు నా మీద ఇంకా కోపం పోలేదా? దేవుడా..

    కడుపును పుట్టిన దాని కోసం కళ్లు కాయలు కాసేలా.. గుండెలవిసి పోయేలా ఏడ్చాను.. హిమ కోసం పిచ్చిదానిలా తిరిగాను.. తీరా కనిపించాక.. నీ కన్న తల్లిని నేనేనమ్మా అని చెప్పుకోలేని ధౌర్భాగ్య స్థితిలో ఎన్ని రోజులు ఏడ్చానో తెలుసా? ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా?.. పడరాని మాటలు పడ్డాను .నిందలు విన్నాను.. అన్నీ పోయి.. అందరం కలిశామంటే.. ఇల్లు, ఊరు వదిలి.. పరాయి పంచన చేరాం..

    డబ్బు ఆస్తి పోయినా కూడా మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు.. అందరం కలిసి ఉంటే చాలని అనుకున్నాం..ఇక్కడేదో పని చేసుకుంటుంటే.. రుద్రాణికి నా బిడ్డల మీద కన్ను పడిందా.. నన్ను ఏం చేద్దామని అనుకుంటున్నారు.. ఏ స్థితికి తీసుకొచ్చారు.. భగవంతుడా? నీకు ఎందుకు అంత కక్ష.. ఎంత పని చేశారు.. డాక్టర్ బాబు.. అని దీప తల్లడిల్లిపోతోంది. ఇక డాక్టర్ బాబు ఆ రుద్రాణి వద్దకు వెళ్తాడు.

    డబ్బులు అడిగావ్ కదరా గడ్డం.. అని రుద్రాణి తన మనుషులతో మాట్లాడుతుంది. నువ్వెదో టెన్షన్‌లో ఉన్నావ్ అని అడగలేదు అక్కా అని అలా మాట్లాడుకుంటూ ఉండగా కార్తీక్ వస్తాడు. ఏంటి సారు ఈ టైంలో దారి తప్పి వచ్చావ్.. అని రుద్రాణి.. మీరు చేస్తోంది తప్పు అని కార్తీక్ అంటాడు. పెత్తనం చేయడం తప్పా? అని రుద్రాణి అంటే.. పెత్తనం చేస్తారో.. అధికారం చెలాయిస్తారో మీ ఇష్టం.. మా పిల్లల జోలికి రాకండి.. బాకీ తీరుస్తాను.. అంతటితో లావాదేవీలు ముగుస్తాయి. మీరెవరు అసలు మా పిల్లలకు కారేజ్ పంపడానికి.. అని కార్తీక్ నిలదీస్తాడు.

    నా అప్పు తీర్చరని నాకు తెలుసు.. అందుకే కూతుళ్లలో ఒకరిని పెంచుకోవడం, తెచ్చుకోవడం కాయం.. జరగబోయేది నాకు తెలుసు.. ఇప్పటి నుంచే మచ్చిక చేసుకుంటున్నా.. అని రుద్రాణి అంటుంది. నా పిల్లల గురించి ఆలోచించకండి.. మంచిది కాదు.. ఏం చేసినా ఊరుకుంటానేమో గానీ.. పిల్లల మీద కన్నేస్తే మాత్రం ఊరుకోను.. అని కార్తీక్ వెళ్లిపోతాడు. అరిస్తే అప్పులు తీరుతాయా?.. జరిగేదేదో నా కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది అని రుద్రాణి అంటుంది.

    ఎక్కడికి వెళ్ళారు.. తలుచుకుంటే కడుపు మండిపోతోంది.. మనం ఇప్పుడు ఆవేశ పడే స్థితిలో లేం.. ఆ రుద్రాణిని మాటిమాటికి కలిస్తే ఇంకా రెచ్చిపోతోంది.. మనం జాగ్రత్తగా ఉండాలి.. మన పిల్లల మీద కన్నేసింది.. అవసరానికి మించి ఆవేశ పడకండి.. ఎలాగైనా అప్పు తీర్చేద్దామండి.. అని దీప అంటుంది. గడువులోగా అప్పు తీర్చకపోతే.. బిడ్డను ఇచ్చేస్తాను అని రాసిచ్చిన గొప్ప తండ్రిని కదా? అని కార్తీక్ బాధపడుతుంటాడు.

    తెలిసి చేశారా? అని దీప అంటే.. తెలిసి చేసినా తెలియక కోసినా నెత్తురు వస్తుంది అని కార్తీక్ అంటాడు.. మమ్మల్ని తాకట్టు పెట్టావా? అని పిల్లలు అడిగితే ఏం చెప్పను.. అని కార్తీక్ బాధపడతాడు. మీరు తెలిసి ఏం తప్పూ చేయలేదు.. ఆ అప్పు తీర్చేద్దామండి.. అని దీప అంటుంది. నేను ఎన్ని తప్పులు చేసినా.. నువ్ గట్టిగా ఎందుకు అరవవు.. కోప్పడ్డవు.. నీ మంచితనం, ఓపిక నన్ను కుంచిచుకుపోయేలా చేస్తోంది..

    నాపై అరువు, తిట్టు, కాలర్ పట్టుకుని నిలదీయ్.. కోపంరావట్లేదా? అప్పుడేమో నా అనుమానంతో దూరం పెట్టాను.. పదకొండేళ్లు భూమాతలా భరించావ్.. ఉన్నదంతా వేరే వాళ్లకు ఇచ్చేసి రోడ్డు మీద నిలబెట్టాను.. అయినా అదే చిరు నవ్వుతో మాట్లాడుతున్నావ్.. నీ మంచితనం భరించలేనంతగా మారుతోంది.. నీ కోపం పోయేలా ఒక రోజంతా నన్ను తిట్టు.. చేసినా తప్పులను ఎత్తి చూపించి తిట్టు దీప.. అని కార్తీక్ తన బాధనంతా బయటపెట్టేస్తాడు.

    తెలిసి మీరు ఏ తప్పూ చేయరు.. అది నా నమ్మకం.. తెలిసీ సంతకం చేయలేదు.. అప్పు కోసం అలా రాసుకుని ఉంటుంది.. పిల్లలకు తెలీదు కదా? ఈ విషయాలన్నీ.. మనం అప్పు తీర్చేద్దాం.. ఓ చీటి వేసి అప్పు తీర్చేద్దాం డాక్టర్ బాబు.. మీరు అవునన్నా కాదన్నా.. మీరు నా డాక్టర్ బాబు.. బయటకు ఎలా పిలిచినా మనసు మాత్రం డాక్టర్ బాబు అనే పిలుస్తుంది.. అని దీప అనడంతో అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో వంటలక్కకు మరిన్ని కష్టాలు రానున్నాయి. వంటలక్క పిండి వంటలను ఎవ్వరూ కొనరు. రుద్రాణి పిండి వంటలు అని ముందే అందరికీ పంచేస్తుంది రుద్రాణి. ఇక రోడ్డు మీద పిచ్చివాడిలా కార్తీక్ అరిచేస్తుంటాడు. ఇలా వంటలక్కకు లేనిపోనీ కష్టాలన్నీ రానున్నాయి.

    Leave a Reply