• November 19, 2021

Guppedantha Manasu Episode 299 : కొత్త రాగమెత్తుకున్న రిషి.. వసుతో ఉన్న రిలేషన్ అదేనట

Guppedantha Manasu Episode 299 : కొత్త రాగమెత్తుకున్న రిషి.. వసుతో ఉన్న రిలేషన్ అదేనట

    గుప్పెడంత మనసు సీరియల్‌లో వసు, రిషి ట్రాక్ ఇప్పుడు పట్టాలెక్కేట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో గురువారం నాటి ఎపిసోడ్‌లో వసు వర్షంలో తడవడం, జరగబోయేది వసు శిరీష్ పెళ్లి కాదని రిషి తెలుసుకోవడం వంటివి జరిగాయి. ఇక శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో రిషి తన మనసులో మాటను మహేంద్రకు చెప్పడు. వసు మీదున్న అభిప్రాయం ఏంటో చెప్పమని సూటిగా అడిగినా కూడా తప్పించుకుంటాడు. అలా మొత్తానికి రిషి వసు ట్రాక్ ఇప్పుడు మారిపోయేట్టు కనిపిస్తోంది. శుక్రవారం నాడు ఏం జరుగుతుందో ఓ సారి చూద్దాం.

    వసు మాటలను తలుచుకుంటూ తన రూంలో ఉంటాడు రిషి. రూంలోకి వచ్చేందుకు ఎప్పుడూ పర్మిషన్ అడిగే తన తండ్రి అడక్కుండా లోపలకు రావడంపై ప్రశ్నిస్తాడు. ఎప్పుడూ అడిగే లోపలకి వస్తారు కదా?అని మహేంద్రను అడుగుతాడు రిషి.. ఇప్పుడు ఎందుకో అడగాలని అనిపించలేదు.. అందుకే అడగలేదు.. ఎదుటి వాళ్లు ఏంచేస్తుంటారో అని ఆలోచిస్తాం.. కానీ మన మనసే ఏం చేస్తుందో తెలీదు కదా? అని అందుకే అడగలేదు అని అంటాడు.

    మనసు.పొద్దుపొద్దున్నే మంచి టాపిక్ తీశారు అని రిషి కౌంటర్లు వేస్తాడు. ఎలా ఉన్నావ్ రిషి.. అని మహేంద్ర అడుగుతాడు. నేను కాదు వసు ఎలా ఉందో కనుక్కోండి..అని రిషి అంటాడు మీ ఫ్యాకల్టీ హెడ్‌కి ఫోన్ చేయండి.. అని అంటాడు. అంతలో మహేంద్ర తన ఫోన్ తీసుకుని కాల్ చేసేందుకు రెడీ అవుతాడు. మీ ఫోన్‌లోంచి కాదు.. నా ఫోన్ లోంచి అడగండి అని అంటాడు. రెంటికి పెద్ద తేడా ఏంటి అని మహేంద్రకు అనుమానం వచ్చి అడుగతాడు..

    మీ ఫోన్‌లోంచి చేస్తే మీరు అడిగినట్టు..నా ఫోన్‌లోంచి చేస్తే నేను తెలుసుకున్నట్టు.. అని రిషి వింత లాజిక్ తీస్తాడు. మరి నువ్వే అడగొచ్చు కదా?.. అని మహేంద్ర రివర్స్ కౌంటర్ వేస్తాడు. ఆమె నా ఫ్యాకల్టీ హెడ్డు తను.. మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్.. మీకు ఆ మాత్రం ఆ బాధ్యత లేదా? అని అంటాడు. అసలు వసుధారకు ఏం జరిగిందో తెలుసుకోవచ్చా?..అని మహేంద్ర అడుగుతాడు. వసు వర్షంలో తడిసి వచ్చింది..నేను తీసుకొచ్చాను.. అని సింపుల్‌గా చెప్పేస్తాడు రిషి.

    వసు ఎందుకంత బాధపడుతుంది.. అని మహేంద్ర అంటే.. నాకేం తెలుసు డాడీ అని రిషి అంటాడు… మనసులో ఒకటి పెట్టుకుని ఇంకొరిని బాధపెట్టొద్దు..అని మహేంద్ర పరోక్షంగా మాట్లాడుతుంటే.. ఏం అడగాలని అనుకుంటున్నారో అది అడగండి డాడీ అని రిషి అంటాడు.. నువ్ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టావా? లేదా? అని మహేంద్ర అడిగేస్తాడు. పెట్టాను డాడ్ అని అంటాడు రిషి.. వసు మీద నీకున్న అభిప్రాయం ఏంటి? అని నేరుగా అడిగేస్తాడు మహేంద్ర.

    తను నాకు ఒక ప్రత్యేకమని రిషి అంటే.. ప్రత్యేకం అంటే ఏంటి? అని మహేంద్ర తిరిగి ప్రశ్నిస్తాడు. మీ జగతి మేడం వసుకు ఎందుకు ఆశ్రయం ఇచ్చింది..అని తిరిగి ప్రశ్నిస్తాడు రిషి. తన స్టూడెంట్ కాబట్టి, ఇష్టం కాబట్టి.. అని అంటాడు మహేంద్ర. నాకు కూడా అంతే.. ప్రత్యేకమైన స్టూడెంట్.. అంత మంది స్టూడెంట్లుండగగా.. వసుకు మాత్రమే ఎందుకు ఇచ్చింది అని రిషి కొత్త రాగమెత్తుకుంటాడు. మాటలతో గెలిచినట్టుగా మనసులను గెలవలేం రిషి అని మహేంద్ర అంటాడు. వసు మీద నీ అభిప్రాయం ఏంటని మళ్లీ మహేంద్ర అడుగుతాడు.. ఓ ప్రత్యేకమైన స్టూడెంట్ అని సమాధానం ఇస్తాడు రిషి..

    మీ ఇద్దరి మధ్య ఫోన్‌లు, రాయభారానికి నేను కావాలా? అని మహేంద్ర అంటాడు. ఈ రాయబారాలు ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్టుగా.. మీ స్టూడెంట్ హెల్ద్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా?. ఆ బాధ్యత లేదా? ఫోన్ చేయండి.. అని రిషి అంటాడు. ఇక జగతికి రిషి ఫోన్‌లోంచి మహేంద్ర కాల్ చేస్తాడు. ఇదేంటి రిషి కాల్ చేస్తున్నాడు అని జగతి ఆశ్చర్యపోతుంది. కాల్ లిఫ్ట్ చేసిన జగతి. గుడ్ మార్నింగ్ రిషి సర్.. అని అంటుంది. మేడం నేను మహేంద్ర భూషన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌ను మాట్లాడుతున్నాను అని అంటాదడు.

    చెప్పండి సర్ అని జగతి అంటుంది. మా ఎండీ గారు.. తన ప్రత్యేకమైన స్టూడెంట్ హెల్త్ గురించి అడిగి తెలుసుకోమన్నారని మహేంద్ర అంటాదడు. తన ఆరోగ్యం బాగా లేనందుకు ఈ రోజు కాలేజ్‌కు రావడం లేదని చెప్పండి సర్ అని జగతి అంటుంది. అలా జగతి మాట్లాడుతుంటే.. మహేంద్ర నుంచి ఫోన్ లాగేసుకుంటాడు. పూర్తిగా వినవా? అని మహేంద్ర అంటాడు. నాకు వినిపించింది. అర్థమైంది అని రిషి అంటాడు. అదెలా? అని మహేంద్ర అంటాడు. నా మనసుకు అర్థమైంది. స్టూడెంట్ మీద ప్రత్యేక శ్రద్ద ఉన్న వాళ్లకి మాత్రమే అర్థమవుతుంది.. అని రిషి అంటాడు. దీంతో మహేంద్ర ఆశ్చర్యపోతాడు. మీరు నేరుగా కాలేజ్‌కు వెళ్లండి నేను వస్తాను అని రిషి అంటాడు. ప్రత్యేకమైన శ్రద్దా? అని మహేంద్ర అనుకుంటూ వెళ్తాడు.

    అక్కడ సీన్ కట్ చేస్తే కాలేజ్‌లో జగతి అడుగు పెడుతుంది. రిషి, వసు, మహేంద్ర మాటలను తలుచుకుంటూ ఉంటుంది. ఇంతలో పుష్ప ఎదురై వసు గురించి అడుగుతుంది. ఎందుకు రాలేదని ప్రశ్నిస్తుంది. ఆ తరువాత తన రూంలోకి వెళ్లి జగతి ఆలోచనల్లో పడుతుంది. ఇంతలో మహేంద్ర వచ్చి.. గుడ్ మార్నింగ్ అంటాడు. ప్రతీ మార్నింగ్.. గుడ్ మార్నింగ్ అవ్వాలని లేదు.. అని జగతి అంటుంది. కానీ ట్రై చేస్తే ప్రతీ మార్నింగ్‌ను గుడ్ మార్నింగ్‌లా మార్చుకోవచ్చు కదా? అని మహేంద్ర అంటాడు.

    వసు ఎలా ఉంది? అని మహేంద్ర అడిగితే.. రిషి ఎందుకంత అపార్థం చేసుకుంటున్నాడు అని జగతి ప్రశ్నిస్తుంది. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదని మహేంద్ర అంటే.. ఒక్కొసారి ఒక్క ప్రశ్నకు ఇంకో ప్రశ్నే సమాధానం అవుతుందని జగతి కౌంటర్ వేస్తుంది. రిషి కూడా ఇంచు మించు అలానే ఉన్నాడు.. ఇద్దరి మధ్య ఏదో చిన్న మిస్ అండర్ స్టాండింగ్.. అని మహేంద్ర అంటాడు. అది చిన్న మిస్ అండర్ స్టాండిగగ్ కాదు.. అందులో మీ పాత్ర ఏంటి? అని జగతి అడుగుతుంది.

    వసు, శిరీష్‌ల పెళ్లి అని రిషి అనుకున్నాడు అది వాడి తప్పు.. అని మహేంద్ర అంటాడు. రిషి ఏంటో నువ్వేంటో నాకు తెలీదా?.. నువ్వే ఏదో ప్రయోగం చేసి ఉంటావ్.. అని జగతి అంటుంది. నాక్కూడా అలా అనుకుంటున్నాడని తరువాతే తెలిసిందని మహేంద్ర అంటాడు. జీవితాలతో ప్రయోగాలు చేయకూడదు అని జగతి సూచిస్తుంది.. వాడు బయటపడతాడు అని ఆలోచించాను.. వాడు బయటపడటం లేదు..అది మన మంచి కోసమే చేశాను కదా? అని మహేంద్ర తనలో తాను అనుకుంటాడు.

    మన జీవితాల్లో నువ్వొక సారి సరైన నిర్ణయం తీసుకోలేదు.. దానికి మనతో పాటు రిషికి కూడా శిక్ష పడింది.. రిషితో ఉంటావ్ కదా? ఆ అనుమానాన్ని క్లియర్‌ చేయాలి కదా? అని జగతి అంటుంది. అప్పటికి రిషిని శిరీష్‌తో కలిసేలా చేశాను.. వాడు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయను అని మహేంద్ర అంటాడు.. వాడేంత బాధపడి ఉంటాడో.. వారిద్దరి బాధ నువ్ అర్థం చేసుకున్నావా? రిషి ఏముందో నీకు తెలుసు, నాకు తెలుసు.. నువ్వేమైనా రిషిని తప్పుదారి పట్టించావా? ఒక వేళ నువ్వు చేయకపోతే.. నువ్ కరెక్ట్ చెప్పాలి.. కదా?. కరెక్ట్‌గా అర్థం చేసుకున్నావా?.. అని మహేంద్రను నిలదీస్తుంది జగతి.

    సరిగ్గా అదే సమయంలో రిషి ఎంట్రీ ఇస్తాడు. ఎవరిని అర్థం చేసుకోవాలి మేడం.. అని రిషి అంటాడు. నా మాటలు రిషి విన్నాడా? ఏంటి?. అని జగతి కంగారు పడుతుంది. ఏంటి మేడం మాట్లాడారు.. పొద్దున్నే అర్థం చేసుకోవడాలు ఏంటి? ఎవరి గురించో తెలుసుకోవచ్చా?.. అని మరోసారి ప్రశ్నిస్తాడు రిషి.ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నాయ్ కదా? స్టూడెంట్స్ మనసు, భయాలు గురించి అర్థం చేసుకున్నారా? అని అడుగుతుందని మహేంద్ర కవర్ చేస్తాడు

    ఇది నిజమని అనుకోను. ఇదే నిజమైతే కాన్ఫరెన్స్ హాల్‌లో మాట్లాడుకోండి.. ఎలాగూ మీటింగే కదా?.. అని రిషి అనడంతో.. జగతి కాస్త టెన్షన్ ఫ్రీ అవుతుంది. ఆ మాటలేవి వినలేదని మనసు తేలిక పర్చుకుంటుంది. వసుధారకు ఎలా ఉంది.. మేడం.. అని రిషి అడుగుతాడు. తనకి కొంచెం రెస్ట్ కావాలి.. అని జగతి అనడంతోనే.. బయటకు వెళ్తున్నాను డాడీ అని రిషి వెళ్లిపోతాడు. బయటకు ఏంటి అని అడిగేలోపు రిషి వెళ్లిపోతాడు.

    రిషి మాటలను తలుచుకుంటూ వసు తెగ ఆలోచిస్తుంది.. రిషి సార్‌కు ఏమైంది.. అలా ఎలా అనుకున్నారు.. మనసులో అంత భారాన్ని ఎందుకు మోశారు.. ఎందుకు బాధపడ్డారు.. నన్ను ఎందుకు అంత బాధపెట్టారు.. అందుకే అంత మారిపోయారు.. రిషి సర్ మనసులో అసలు ఏముంది.. అని వసు ఓ పక్క ఆలోచిస్తుంటుంది. మరో పక్క వసు కోసం బయల్దేరిన రిషి ఇంకోలా ఆలోచిస్తుంటాడు. ఇందులో ఎవరిది తప్పు.. నేను ఎక్కువగా బాధపెట్టాను. చెప్పకపోవడం తన తప్పా? అడగక పోవడం నా తప్పా? అయినా ఎక్కువగా బాధ పడింది నేను. కానీ నా వల్లే వర్షంలో ఎక్కువగా తడిసింది.. ఫోన్ చేయాలా? ఏం మాట్లాడాలి?.. అపార్థం చేసుకుంది నేను. బాధపెట్టింది నేను.. వసు అంతగా వర్షంలో తడిసింది.. నా వల్లే కదా?. అయినా అందులో నాది ఎలా తప్పు అవుతుంది.. నా మొహం చూసి, నన్ను చూసి నా బాధను అర్థంచేసుకోలేదా?..నాకు ముందే చెప్పాలి కదా అంటూ రిషి ఎప్పటిలానే తన మనసులో వేల ప్రశ్నలు వేసుకున్నాడు. ఇక రేపు వసు గాఢంగా హత్తుకోవడం, రిషి కూడా చలించినట్టు కనిపిస్తోంది. కని ఇది కల? నిజమా? అన్నది చూడాలి.

    Leave a Reply