- November 9, 2021
కామెడీ స్టార్స్‌లో కనిపించని శేఖర్ మాస్టర్.. కారణం అదేనా?

బుల్లితెరపై శేఖర్ మాస్టర్ ఎంతలా క్రేజ్ సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు కేవలం డ్యాన్స్ మాస్టర్‌గా తెర వెనుకాల ఉండేవాడు. కానీ ఇప్పుడు తెరపై హీరో రేంజ్‌లో ఫేమస్ అయ్యాడు. దానంతటికి కారణం బుల్లితెరపై పలు షోలకు జడ్జ్‌గా వ్యవహరించడమే. ఢీ షోలో జడ్జ్‌గా మొదలైన శేఖర్ మాస్టర్ ప్రయాణం.. జబర్దస్త్ స్కిట్లతో దుమ్ములేపేశాడు. పలు ఈవెంట్లకు శేఖర్ మాస్టర్ వచ్చి స్కిట్లు వేయడంతో మరింత హల్చల్ చేశాడు. అలా శేఖర్ మాస్టర్ బుల్లితెరపై మంచి ఆదరణను దక్కించుకున్నాడు.
అయితే శేఖర్ మాస్టర్ ఈటీవికి దూరంగా వెళ్లిపోయాడు. ఢీ నుంచి శేఖర్ మాస్టర్ ఎందుకు బయటకు వెళ్లాడో ఎవ్వరికీ తెలియదు. కానీ శేఖర్ మాస్టర్ స్థానంలో గణేష్ మాస్టర్ వచ్చాడు. అందరినీ మెప్పిస్తున్నాడు. ఆ మధ్య ఓ డ్యాన్సర్ కష్టాలు విని స్టేజ్ మీదే నాలుగు లక్షల చెక్కు ఇచ్చేస్తానని ప్రకటించాడు. దీంతో శేఖర్ మాస్టర్ మీద ట్రోల్స్ మొదలయ్యాయి. అలా ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు అయింది. మొత్తానికి శేఖర్ మాస్టర్ మాత్రం ఢీ నుంచి కామెడీ స్టార్స్‌కు మారిపోయాడు.
కామెడీ స్టార్స్ షోకు శేఖర్ మాస్టర్, శ్రీదేవీ విజయ్ కుమార్ కలిసి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ శ్రీదేవిని జడ్జ్‌గా ఎవ్వరూ అంగీకరించలేకపోతోన్నారు. అషూ, హరి, అవినాష్ వల్ల అంతో ఇంతో షో నడుస్తోంది. ఇక శేఖర్ మాస్టర్ ఉన్నాడా? అంటే ఉన్నాడు? అనే వరకు వెళ్లిపోయింది. అయితే వచ్చే వారం మాత్రం శేఖర్ మాస్టర్ మాత్రం కామెడీ స్టార్స్ షోలో కనిపించేలా లేడు.
వచ్చే ఆదివారం కామెడీ స్టార్స్ షోలో ఆలీ అతిథిగా వచ్చేశాడు. శేఖర్ మాస్టర్ కనిపించకపోవడంతో అందరూ ఏదేదో ఊహించుకుంటున్నారు. కామెడీ స్టార్స్ నుంచి కూడా బయటకు వెళ్లిపోయాడా? అని అనుకుంటున్నారు. కానీ కారణం వేరే ఉందట. శేఖర్ మాస్టర్ గత కొన్ని రోజుల క్రితం సర్కారు వారి పాట సాంగ్ షూటింగ్ కోసం స్పెయిన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అందుకే అప్పుడు జరిగిన కామెడీ స్టార్స్ షూటింగ్‌లో శేఖర్ మాస్టర్ పాల్గొనలేకపోయాడు. అదే ఎపిసోడ్ వచ్చే ఆదివారం ప్రసారం కాబోతోందట. అందుకే అందులో శేఖర్ మాస్టర్‌కు బదులుగా ఆలీ కనిపించాడు.