• July 12, 2025

నరివేట్ట రివ్యూ.. ఊహకందేలా సాగే కథనం

నరివేట్ట రివ్యూ.. ఊహకందేలా సాగే కథనం

    టోవినో థామస్ చిత్రాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంటుంది. ఇక ఈ క్రమంలో ఆయన హీరోగా నరివేట్ట అనే ఓ చిత్రం వచ్చింది. అనురాజ్ మనోహర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కోలీవుడ్‌లో బాగానే ఆడింది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. సోనీ లీవ్‌లో వచ్చిన ఈ మూవీ తెలుగు భాషలోనూ అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ కథ ఏంటి? ఈ చిత్రం ఎలా ఉంది? అన్నది ఓ సారి చూద్దాం.

    వర్గిస్ (టోవినో థామస్) ఓ మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటాడు. కానీ ప్రేయసి కోసం, పేదరికంలో ఉన్న అమ్మ కోసం ఇష్టం లేకపోయినా కూడా కానిస్టేబుల్ జాబ్‌ను చేస్తుంటాడు. అక్కడ బషీర్ (సూరజ్ వెంజరమూడు) వర్గీస్‌కు మంచి స్నేహితుడు అవుతారు. ఈ క్రమంలో విధి నిర్వహణ నిమిత్తం వర్గిస్, బషీర్ బెటాలియన్ వయనాడుకు వెళ్తుంది. అక్కడ ఆదివాసీలు తమ సొంత ఇంటి, స్థలం కోసం పోరాటం చేస్తుంటారు. ఈ పోరాటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుంది.ఈ ఆపరేషన్‌కు డీఐజీ కేశవదాస్ (చేరన్) లీడ్‌గా ఉంటారు. ఇక పోలీసులు చేసిన కుట్రలు ఏంటి? ఆ ఆదివాసిల పోరాటాన్ని ఎలా అణగదొక్కారు? పోలీసులు డిపార్ట్మెంట్ చేసిన అకృత్యాల్ని వర్గీస్ ఎలా బయటపెట్టాడు? అన్నదే కథ.

    నరివేట్ట సినిమాను చూస్తున్నంత సేపు పోలీసు డిపార్ట్మెంట్, ఆదివాసీ, ప్రభుత్వాల తీరు వంటి వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటాం. ఆదివాసీలకంటూ గుర్తింపు ఉండదు. వారికి కనీసం గౌరవం కూడా దక్కదు. ఆదివాసీలు తమ ఆత్మ గౌరవం, హక్కుల కోసం పోరాడటాన్ని బాగా చూపించారు. ఇలాంటి విషయంలో పోలీసు డిపార్ట్మెంట్ ఎలా వ్యవహరించాలి? ఎలా వ్యవహరించకూడదు? అన్నట్టుగా చూపించారు. అంతే కాకుండా ఈ కథలో చూపించిన ప్రేమ కథ కూడా బాగుంటుంది. మిడిల్ క్లాస్ లైఫులు, అప్పులతో బతికే బతుకులు ఎలా ఉంటాయో వర్గీస్ అమ్మ పాత్రతో చూపించారు.

    సినిమా ప్రారంభంలో ఎత్తుకున్న సీన్.. హీరోని వెంటాడే ఓ టీం.. అసలు ఏమై ఉంటుందా? అన్న ఇంట్రెస్ట్ కలిగించేలానే కథను ఆరంభించాడు. కానీ ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్‌గా, అక్కడక్కడే తిరిగినట్టుగా అనిపిస్తుంది. వర్గీస్ పరిచయం, ప్రేమ, కుటుంబం, ఫ్యామిలీ కష్టాలు, ఉద్యోగ ప్రయత్నాలు అంటూ సాదాసీదాగా సాగుతుంది. ఇక సెకండాఫ్ అంతా కూడా వయనాడ్ అడవుల్లోనే సాగుతుంది. అక్కడా ఏమంత ఇంట్రెస్టింగ్‌గా కథనం సాగదు. విలన్ ఎవరు? బషీర్‌కు ఏమైంది? ఎవరు చంపి ఉంటారు? అన్నది చూసే ఆడియెన్స్‌కు తెలిసిపోతుంది. అలా కథలో ఎంగేజింగ్ పాయింట్ మిస్ అయినట్టుగా కనిపిస్తుంది.

    ఆదివాసీల పాయింట్‌ను బాగా చూపించాడు. క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది. టెక్నికల్‌గా ఈ మూవీ ఆకట్టుకుంటుంది. విజువల్స్ ఎంతో సహజంగా అనిపిస్తాయి. బీజీఎం కూడా బాగుంటుంది. లవ్ సాంగ్, ఆదివాసీల పాట బాగుంటుంది. ఎడిటింగ్ కాస్త షార్ప్‌గా ఉంటే బాగుండేది. ప్రతీ సీన్ నిదానంగా, సాగదీసినట్టుగా అనిపిస్తుంది.

    నటీనటుల విషయానికి వస్తే టొవినో థామస్ మెప్పిస్తాడు. కొన్ని సీన్లలో అతని యాక్టింగ్ చూస్తే.. అతని చేష్టలు చూస్తే ఆడియెన్స్‌కి కూడా కోపం వస్తుంది. చేరన్ చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. బషీర్ పాత్రలో సూరజ్ కనిపించేది కొద్ది సేపే అయినా మెప్పిస్తారు. హీరోయిన్ నేచురల్ లుక్స్, యాక్టింగ్ బాగుంటుంది. ఆదివాసీలుగా నటించిన ఆర్టిస్టులు అందరినీ ఆకట్టుకుంటారు.

    నరివేట్ట.. కాస్త ఓపికతో ఓ సారి చూసేయొచ్చు

    రేటింగ్ 2.75