- July 13, 2025
ప్రేక్షకుల గుండెల్లో కోట కట్టుకున్న నటుడు ‘కోట’ కన్నుమూత

Kota Srinivas Rao Death టాలీవుడ్ సీనియర్, ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారు ఝామున ఆయన తుది శ్వాస విడిచారు (Kota Srinivas Rao Passed Away). కంకిపాడు గ్రామంలో ఆయన 1942లో జన్మించారు. కోట పోషించని పాత్రలంటూ లేవు. నవ్వించడంలో అయినా, ఏడిపించడంలో అయినా, భయపెట్టడంలో అయినా కోటకు సాటిలేరెవ్వరు. అయితే కోట ఆన్ స్క్రీన్‌లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ అంతే నిక్కచ్చిగా ఉంటారు. తెలుగు నటీనటులు,వారి హక్కుల కోసం పోరాడారు. ఇతర భాషల నుంచి ఆర్టిస్టుల్ని ఎక్కువగా తీసుకు వస్తుండటంపైనా ఆయన గళం విప్పి పోరాటం చేశారు. ఇక ఈ మధ్య కాలంలో అంటే ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్ అంటూ ఆయన మాట్లాడిన మాటలు వివాదాలకు దారి తీశాయి. మెగా ఫ్యాన్స్ ఎక్కువగా కోట మీద ఆగ్రహంతో ఉంటారు. నాగబాబు సైతం కోట మీద కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే.
90వ దశకంలో అయితే కోట శ్రీనివాసరావు లేకుండా సినిమాలు వచ్చేవి కావు. కామెడీ పాత్రలకైనా, భయంకరమైన విలనిజాన్ని ప్రదర్శించాలన్నా కూడా కోట శ్రీనివాసరావు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు. ఇప్పటికీ ఆయన కామెడీ సీన్లు, విలన్ వేషాల్లో చెప్పిన డైలాగ్స్, చేసిన యాక్టింగ్ రీల్స్, మీమ్స్, ట్రోల్స్‌లో ట్రెండ్ అవుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక ఆయనకు దాదాపుగా 9 నందులు వచ్చాయి. పద్మ శ్రీతో కేంద్రం ఆయన్ను గౌరవించింది. ఆయన దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించినట్టుగా తెలుస్తోంది.
మామగారు అంటూ నవ్వించినా, గణేష్ అంటూ భయపెట్టినా, హలో బ్రదర్ అంటూ కితకితలు పెట్టినా కోట శ్రీనివాసరావు నటనకు తెలుగు ప్రేక్షకులు తమ గుండెల్లో స్థానంలో ఇచ్చారు. తెలుగు వారికి కోట అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కోట గారి మరణ వార్త విన్న, తెలుసుకున్న సినీ ప్రేమికులు, సెలెబ్రిటీలు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
లెజెండరీ యాక్టర్ , బహుముఖ ప్రజ్ఞా శాలి శ్రీ కోట శ్రీనివాస రావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది. ‘ప్రాణం ఖరీదు’ చిత్రం తో ఆయన నేను ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలి తో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు శ్రీ కోట . కామెడీ విలన్, అయినా సీరియస్ విలన్ అయినా, సపోర్టింగ్ క్యారక్టర్ అయినా, ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా నటించారు. రీసెంట్ గా ఆయన కుటుంబం లో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కుంగదీసింది. శ్రీ కోట శ్రీనివాస రావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమ కి, సినీ ప్రేమికులకి ఎన్నటికీ తీరనిది.ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి , నా ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నాను అని చిరంజీవి పోస్ట్ వేశారు.