• October 13, 2022

మెగాస్టార్ చిరంజీవిని అభినందించిన టి.ఎఫ్.జె.ఎ. కార్యవర్గం!

మెగాస్టార్ చిరంజీవిని అభినందించిన టి.ఎఫ్.జె.ఎ. కార్యవర్గం!

    మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ విజయవంతంగా ప్రదర్శితమౌతున్న సందర్భంగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టి.ఎఫ్.జె.ఎ.) కార్యవర్గ సభ్యులు, టీవీ ఛానెల్స్ ప్రతినిధులు గురువారం ఆయనను నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో తేనీటి విందులో పాల్గొన్న చిరంజీవి తన చిత్రాలను గురించి సవివరంగా ముచ్చటించారు. ‘ఆచార్య’ మూవీ తదనానంతర పరిణామాలను మనసు విప్పి చెప్పారు. అలానే ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ తర్వాత తనను కలిసి హర్షాన్ని వ్యక్తం చేస్తున్న వారిని కలుసుకోవడం తన కర్తవ్యంగా భావించానని అన్నారు. ‘ఆచార్య’ పరాజయానికి తాను కృంగిపోలేదని, ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ విజయానికి పొంగి పోవడం లేదని, అలాంటి స్థితప్రజ్ఞతను సాధించానని చెప్పారు. ‘లూసిఫర్’ ను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచన దర్శకుడు సుకుమార్, రామ్ చరణ్ లో బలంగా కలిగించాడని, అతనికి దర్శకత్వం వహించే తీరిక లేకపోవడంతో వేరెవరితో అయినా ఆ ప్రాజెక్ట్ ను ప్రారంభించమని సలహా ఇచ్చాడని అన్నారు. ఒకానొక సమయంలో ఆ చిత్రం రీమేక్ ఆలోచన విరమించుకున్నానని, అయితే రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ కు దర్శకుడు మోహన రాజా ను ఎంపిక చేయడంతో మళ్లీ పట్టాలు ఎక్కిందని, అతని బృందం ‘లూసిఫర్’ మూవీని తన ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసిందని, అది వర్కౌట్ అయ్యిందని చిరంజీవి అన్నారు. ఈ సినిమా సాధించిన విజయంతో తెలుగు రచయితలూ తన కోసం వైవిధ్యమైన కథలు చేస్తారనే నమ్మకం కలిగిందని, కరోనా సమయంలో ప్రేక్షకులలో వచ్చిన మార్పు కారణంగానే తానూ ‘లూసిఫర్’ లాంటి విభిన్న చిత్రాన్ని ధైర్యంతో చేశానని చిరంజీవి చెప్పారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సత్యదేవ్ ను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. అలానే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న దర్శకుడు బాబీ ‘వాల్తేరు వీరయ్య’, మెహర్ రమేశ్ ‘భోళా శంకర్’ చిత్రాల విశేషాలనూ చిరంజీవి అసోసియేషన్ ప్రతినిధులకు తెలిపారు.

     

    ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తో తనకున్న చిరకాల అనుబంధాన్ని చిరంజీవి మరోసారి గుర్తు చేసుకున్నారు. ఫిల్మ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కార్యవర్గ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. హెల్త్ కార్డుల పంపిణీ సమయంలో అందరినీ కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భంగా కలవడం సంతోషంగా ఉందని అన్నారు. ‘గాడ్ ఫాదర్’ లాంటి విజయవంతమైన చిత్రాలు మరిన్ని చేయాలని, ఆ రకంగా తామంతా మళ్ళీ మళ్ళీ కలిసే ఆస్కారం ఏర్పడుతుందని టి.ఎఫ్.జె.ఎ. అధ్యక్ష కార్యదర్శులు వి. లక్ష్మీ నారాయణ, వై. జె. రాంబాబు తెలిపారు. అయితే… సినిమాలతో సంబంధం లేకుండానే తనను కలుసుకోవాలని తాను కోరుకుంటానని, ఇలాంటి ఆత్మీయ కలయికతో తనకు గూస్ బంబ్స్ వస్తాయని చిరంజీవి బదులిచ్చారు.