• July 2, 2025

23 (ఇరవై మూడు) రివ్యూ.. కదిలించే కథ, వెంటాడే వ్యథ

23 (ఇరవై మూడు) రివ్యూ.. కదిలించే కథ, వెంటాడే వ్యథ

    చిలకలూరి పేట బస్సు దహనం కేసు గురించి అందరికీ తెలిసిందే. 90వ దశకంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా 23 (ఇరవై మూడు) అనే సినిమాని తీశారు. చుండూరు ఘటన, చిలకలూరిపేట బస్సు ఘటన, జూబ్లిహిల్స్ బాంబ్ పేలుళ్ల ఘటనల్ని చూపిస్తూ రాజ్ ఆర్ తీసిన ఈ చిత్రం రీసెంట్‌గానే ఓటీటీలోకి వచ్చింది. ఈ రియల్ ఇన్సిడెంట్‌లను బేస్ చేసుకుని తీసిన చిత్రం ఎలా ఉందంటే?

    కథ
    చుండూరు ఘటనతో కథ మొదలవుతుంది. ఆ తరువాత సాగర్ (తేజ) మీదకు కథ షిఫ్ట్ అవుతుంది. సాగర్ పదో తరగతి వరకు చదువుతాడు. ఊర్లోనే ఇడ్లీ కొట్టు పెట్టుకుని వ్యాపారం చేసుకుందామని అనుకుంటాడు. అదే ఊర్లో సుశీల (తన్మయి)ని సాగర్ ప్రేమిస్తాడు. వ్యాపారం పెట్టుకుని సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామని వారిద్దరూ అనుకుంటారు. కానీ సాగర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అవుతూనే ఉంటాడు. లోన్ కోసం తిప్పించుకుని గవర్నమెంట్ ఆఫీసర్ మోసం చేస్తాడు. ఇంతలో సుశీల గర్భవతి అన్న సంగతి సాగర్‌కు తెలుస్తుంది. ఎలాగైనా తన భార్య, బిడ్డను పోషించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో దాస్ సాయంతో బస్సులో దొంగతనం చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో అనుకోకుండా బస్సు మంటల్లో చిక్కుకుంటుంది. ఈ ఘటనలో 23 మంది చనిపోతారు. ఈ కేసులో సాగర్, దాస్‌లకు ఉరి శిక్ష పడుతుంది? సాగర్ కోసం సుశీల ఏం చేస్తుంది? చివరకు ఈ ఉరి శిక్ష నుంచి సాగర్ తప్పించుకుంటాడా? బయటకు వస్తాడా? అన్నది కథ.

    తమిళం, మలయాళంలోనే రా అండ్ రస్టిక్ చిత్రాలు వస్తాయని, అక్కడ మాత్రమే మట్టి వాసనతో సహజమైన చిత్రాలు వస్తాయని అనుకుంటారు. వాటిని మనం చూసి మెచ్చుకుంటాం. ఆహా, ఓహో అని కీర్తిస్తాం. తెలుగులో ఇలాంటి చిత్రాలు రావు అని తిట్టుకుంటాం. అయితే తెలుగులో ఇలాంటి సహజ చిత్రాలు వచ్చినప్పుడు, రియాల్టీని చూపించే చిత్రాలు వచ్చినప్పుడు మాత్రం అస్సలు పట్టించుకోం. అసలు అలాంటి చిత్రాలు వచ్చాయన్న సంగతి కూడా తెలీకుండా పోతుంది.

    23 సినిమా అలాంటి ఓ నేచురల్ రియలిస్టిక్ చిత్రం. ఎలివేషన్స్ ఉండవు.. మాస్ సాంగ్స్ ఉండవు.. అశ్లీల సన్నివేశాలు ఉండవు.. ఓ బస్సుని ఇద్దరు దుండగులు తగలబెట్టారు.. 23 మంది చనిపోయారు.. అన్న వార్త వింటే.. వెంటనే ఎవ్వరికైనా ఈ ఇద్దరిని చంపేయాలన్నంత కోపం, కసి పుట్టుకొస్తుంది. కానీ ఒక్కసారి వారి స్థానంలో ఉండి చూస్తే.. అసలు జరిగిన విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే వారిపై ఉండే ద్వేషం, కోపం కాస్త అయినా తగ్గుతుందేమో.

    తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే.. ఆ తప్పు వల్ల పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు.. అలా అని ప్రాణానికి ప్రాణమే బదులా? అంటే కూడా చెప్పలేం. అలాంటి ఓ సంగ్ధితతే ఈ చిత్రంలో ఉంటుంది. ఇప్పటికీ ఆ ఇద్దరు జైల్లోనే ఉన్నారట. తన ప్రియుడ్ని కలుసుకునేందుకు సుశీల నిత్యం వెళ్తూనే ఉంటారట. ఎప్పటికైనా బయటకు వస్తారని ఎదురుచూస్తూనే ఉన్నారట.

    అసలు ఈ దేశంలో అందరికీ ఒకేలా న్యాయం దొరకదు. ఉన్న వారికి ఒకలా.. లేని వారికి ఒకలా.. న్యాయం అందుతుంటుంది. ఎంతో పెద్ద పెద్ద నేరాలు చేసినా.. జైలుకి వెళ్లి.. మరుసటి రోజే బయటకు వస్తుంటారు.. అదంతా అధికారం, డబ్బు, పవర్ ఉంటేనే జరుగుతుంది. ఇక లేని వాడి గతి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఏ నేరం చేయకపోయినా కూడా జీవితం మొత్తం చీకట్లోనే మగ్గిపోవాల్సి ఉంటుంది.

    శిక్షలు వేసేదే పరివర్తన కోసం.. మంచిగా మారి మళ్లీ కొత్త జీవితం ప్రారంభిస్తారని. కానీ అలాంటిది ఈ కేసులో జరగలేదు. అణచివేత ఎలా ఉంటుంది.. కోర్టుల్లో అయినా సరే వివక్ష ఎలా ఉంటుంది.. చట్టం, న్యాయం అనేది పేద వాడి విషయంలో ఎలా పని చేస్తాయి.. అన్నది ఈ చిత్రంలో చూపించారు. మేకింగ్ పరంగా ఈ చిత్రం ఎంతో సహజంగా ఉంటుంది. ఆర్టిస్టులు సైతం ఎంతో నేచురల్‌గా నటించారు. ఇక మాటలు కొన్ని చోట్ల గుండెల్ని తాకుతాయి.

    ఇరవై మూడు చిత్రం చట్టాలకు, న్యాయ వ్యవస్థకు కనువిప్పులా మారి.. అందరికీ ఒకేలా న్యాయం అందించే రోజు వస్తుందేమో చూడాలి.