- November 24, 2023
మాధవే మధుసూదన రివ్యూ.. ఎమోషనల్ లవ్ డ్రామా

ప్రేమను ఫీల్ అవ్వని మనిషంటూ ఉండడు. ప్రేమ కథలకు కదలని వ్యక్తి అంటూ ఉండరు. అందుకే తెరపై ఎక్కువగా సినిమాల్లో ప్రేమకథలను చూపిస్తుంటారు. ప్రేమ కథలు ఎన్ని వచ్చినా.. ఎన్ని వస్తున్నా.. ఇంకా వస్తూనే ఉంటాయి. ప్రేమ అంటే అనంతమైంది. తాజాగా ఓ అందమైన ప్రేమ కథా చిత్రమే వచ్చింది. అదే మాధవే మధుసూదన. ఈ చిత్రంలో తేజ్ బొమ్మదేవర హీరోగా, బొమ్మదేవర రామచంద్ర రావు దర్శక నిర్మాత నటుడిగా పరిచయం అయ్యారు. ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
శివ (శివ) కొడుకు స్కూల్‌లో చెప్పిన ముంతాజ్ షాజహాన్ ప్రేమ కథకు చప్పట్లు రావడంతో మురిసిపోతాడు. కానీ చరిత్రలో ఇంకా ఎన్నో గొప్ప ప్రేమ కథలున్నాయని శివ తన ఫ్రెండ్ మాధవ్ (తేజ్ బొమ్మదేవర) కథ చెబుతుంటాడు. మాధవ్ కథలోకి మధుసూదన్ ఎలా వచ్చాడు? రంగనాయకి కాస్త ఆరాధ్య (రిషికి లొక్రేని) ఎలా మారుతుంది? అసలు వీరిద్దరి ప్రేమ కథ ఎలా మొదలైంది.. ఎందుకు విషాదం వైపు నడించింది? ప్రేమ కోసం ఒకరొకొకరు చేసుకున్న త్యాగాలు ఏంటి? అన్నదే కథ.
నటీనటులు
తేజ్ బొమ్మదేవరకు మొదటి సినిమానే.. అయినా చక్కగా నటించాడు. తెరపై మొదటి సారి నటిస్తున్నట్టుగా అనిపించదు. ఎంతో సహజంగా, నేచురల్‌గా, అవలీలగా చేసినట్టు అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకుంటాడు. కొన్ని చోట్ల నవ్విస్తాడు. అలా టోటల్‌గా హీరోగా ఆకట్టుకుంటాడు. డ్యాన్సులు, డైలాగ్ డెలివరీలో మంచి ఈజ్ కనబర్చాడు. ఇక హీరోయిన్‌గా కనిపించిన రిషికి అందరినీ ఆకట్టుకుంటుంది. తెరపై చలాకీగా కనిపించింది. అందంగానూ కనిపించింది. హీరోయిన్ తండ్రిగా కనిపించిన బొమ్మదేవర రామచంద్ర రావు ఎమోషనల్ సీన్లతో ఏడిపిస్తాడు. ఫ్రెండ్స్ పాత్రలు బాగున్నాయి. హీరో తల్లిదండ్రుల పాత్రలు మెప్పిస్తాయి. ఫ్లాష్ బ్యాక్‌లో కనిపించే సుమన్ ఎపిసోడ్ కూడా ఓకే అనిపిస్తుంది.
విశ్లేషణ
మాధవే మధుసూదన టైటిల్ చూస్తే సినిమా కథ అర్థం కాదు. కానీ సినిమా చూశాక.. ఈ సినిమాకు ఈ టైటిల్ మాత్రమే సరిపోతుందని అంతా అనుకోవాల్సిందే. మాధవే.. మధుసూదనుడు అని చెప్పేస్తాడు దర్శకుడు. ఇంత జస్టిఫై చేసే టైటిల్ ఈ మధ్య కాలంలో రాలేదు. ఇంత మంచి టైటిల్‌కు మంచి కథ, కథనాలు ఇంకా బాగా రాసుకుంటే బాగుండేది. తీసుకున్న పాయింట్ కొత్తదేమీ కాదు.. కానీ ఎమోషనల్‌గా అనిపిస్తుంది.
ఎక్కడా అసభ్యకరమై, అభ్యంతరకరమైన సన్నివేశాలను పెట్టలేదు. చాలా వరకు క్లీన్‌గానే తీసినట్టుగా అనిపిస్తుంది. అన్ని ప్రేమ కథలు ఒకేలా ఉండవు. ప్రతీ ప్రేమ కథలో అమ్మానాన్నలు విలన్లుగా ఉంటారు. ఈ సినిమాలో విలన్ అంటూ ప్రత్యేకంగా ఉండడు. విధి విలన్‌గా కనిపిస్తుంది. ప్రేయసికి ఇచ్చిన మాట కోసం ప్రియుడు ఏం చేశాడు? ఏం చేయగలడు.. ప్రియుడు లేకుండా ప్రేయసి ఎలా ఉంటుంది? అనేది చక్కగా చూపించారు.
ప్రథమార్దం కాస్త జాలీగా సాగుతుంది. ఎక్కడా బోర్ కొట్టించకుండా నడిపించినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ మాత్రం చాలా నీరసంగా, నిదానంగా సాగినట్టు కనిపిస్తుంది. సెకండాఫ్ కాస్త తగ్గించినా బాగుండేది. నిడివి సమస్య కూడా అక్కడే వచ్చినట్టుగా అనిపిస్తుంది. పాటలు వినడానికి, చూడటానికి బాగున్నాయి. మాటలు కొన్ని చోట్ల గుండెల్ని తాకేలా ఉన్నాయి. విజువల్స్ అందంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
బాటమ్ లైన్ మాధవే మధుసూదన.. మంచి ప్రేమ కథా చిత్రం
రేటింగ్ 3