- October 17, 2021
ప్రసంగంలో పేర్లు మరిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్

రాజకీయ ప్రసంగాలు వేరు. సినిమా ఈవెంట్లలో ఇచ్చే స్పీచులు వేరుంటాయి. కానీ రాజకీయ నాయకుల్లో కొందరు ఎక్కడకు వెళ్లినా కూడా తమ పద్దతి మార్చుకోరు. అలా మొత్తానికి తలసాని శ్రీనివాస్ యాదవ్.. శనివారం జరిగిన మా అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నాడు. అక్కడ తన స్టైల్లో స్పీచును దంచి కొట్టేశాడు. మోహన్ బాబును ఆకాశానికెత్తేశాడు.
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం రాజకీయ నాయకులకు అలవాటే. ఏ ఫంక్షన్‌కు వెళ్తే అక్కడి వారి ప్రశంసలతో ముంచెత్తడం అందరికీ అలవాటే. అలా నిన్న తలసాని ఇచ్చిన స్పీచులో అన్నా అంటూ మోహన్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించాడు. అందరూ మోహన్ బాబుకు కోపం, ఆవేశం అని అంటారు కానీ దాని వల్ల ఇతరులకు ఎప్పుడు హాని జరగలేదు.. ఆయనే ఎంతో నష్టపోయాడు అని చెప్పుకొచ్చాడు.
ఇక సినీ పరిశ్రమలోని హీరోల గురించి చెబుతూ.. ఎన్టీఆర్, ఏఎన్నార్ దగ్గరి నుంచి మొదలుపెట్టాడు. ఎన్టీఆర్ ఏఎన్నార్.. ఆ తరువాత శోభన్ బాబు, కృష్ణంరాజు, మోహన్ బాబు.. ఆ తరువాత చిరంజీవి, బాలకృష్ణ.. ఆ తరువాత పవన్ కళ్యాణ్ అని ఇలా తనకు తెలిసిన వరుస క్రమాన్ని చెప్పేశాడు. అయితే ఇందులో మోహన్ బాబు కాస్త ముందు తరంలోకి వేసేశాడు.
అయితే తలసాని చెప్పిన పేర్లలో సూపర్ స్టార్ కృష్ణ పేరు మరిచిపోయాడు. అది అక్కడి వారు బాగానే గమనించి పసిగట్టారు. స్పీచ్ ఇచ్చి వెళ్లిపోయిన తలసానికి అది గుర్తు చేసి మరీ స్టేజ్ మీదకు రప్పించారు. సూపర్ స్టార్ కృష్ణ ఖ్యాతిని చెప్పించారు. ఆ తరువాత వెళ్లిపోతోన్న తలసాని మళ్లీ వెనక్కి వచ్చాడు. మహేష్ బాబు, ఎన్టీఆర్ అంటూ ఇలా అందరి గురించి ప్రస్థావించాడు. స్పీచ్ మధ్యలో హీరోల పేర్లు గుర్తుండవు కదా? ఎవరినైనా మరిచిపోతే క్షమించండి అంటూ దండం పెట్టేసి వెళ్లిపోయాడు.