• August 5, 2025

కథానాయకుడు టైపులో రజినీకాంత్ రియల్ స్టోరీ.. స్నేహితురాలిని ఇంకా కలవని సూపర్ స్టార్

కథానాయకుడు టైపులో రజినీకాంత్ రియల్ స్టోరీ.. స్నేహితురాలిని ఇంకా కలవని సూపర్ స్టార్

    సూపర్ స్టార్ రజినీకాంత్, జగపతి బాబు కలిసి నటించిన కథా నాయకుడు సినిమా కథ అందరికీ తెలిసిందే. స్నేహితుడి ప్రోత్సాహం, స్నేహితుడు ఇచ్చిన డబ్బుతోనే ఇండస్ట్రీలోకి వెళ్లి ఓ వ్యక్తి సూపర్ స్టార్ అవుతాడు. కానీ సాయం చేసిన స్నేహితుడు మాత్రం ఎక్కడో మారుమూలన జీవిస్తుంటాడు. ఫ్రెండ్ సూపర్ స్టార్ అయ్యాడని తెలిసినా కూడా దగ్గరకు వెళ్లలేకపోతాడు ఆ వ్యక్తి. ఆ కథ నిజంగానే రజినీకాంత్ జీవితంలో జరిగినట్టుగా ఉంది. కాకపోతే ఆ ఫ్రెండ్ మాత్రం కేవలం ఫ్రెండ్ అని అనిపించడం లేదు. రజినీకాంత్ కండక్టర్‌గా ఉన్న టైంలో పరిచయమైన ఆ అమ్మాయి మీద ప్రేమను కూడా పెంచుకున్నట్టుగా కనిపిస్తోంది. కాకపోతే ఇంత వరకు కూడా ఆ అమ్మాయిని రజినీ మళ్లీ కలవలేకపోయారట. ఈ మేరకు రజినీకాంత్ స్నేహితుడు చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

    ఇరవై ఏళ్ళ క్రితం ఇద్దరు నటుల మధ్య జరిగిన సంభాషణ.

    “ఇంత పెద్ద సూపర్ స్టార్ అయ్యావు, కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. అయినా ఒక్కోసారి ఏదో పోగొట్టుకున్న వాడిలా కనిపిస్తావ్!”

    కొన్ని సెకన్ల మౌనం తరువాత..

    “నువ్వన్నది నిజమే. నిజంగానే పోగొట్టుకున్నాను”

    “అంటే!?”

    “నేను కండక్టర్‌గా జాబ్ చేస్తున్న సమయంలో ఒకమ్మాయితో బస్‌లో చిన్న గొడవ జరిగింది. తరువాత మెల్లగా మేం ఫ్రెండ్స్ అయ్యాం. ఓ రోజు నేను తనతో “సాయంత్రం ఆర్ట్ & కల్చరల్ థియేటర్‌లో నా డ్రామా ఉంది. వస్తావా?” అని అడిగాను. తను ఆశ్చర్యపోతూ “నువ్వు యాక్టింగ్ కూడా చేస్తావా?” అని అడిగింది. అవును అన్నట్టు నిలువుగా తలూపాను. ఆ రోజు నాటకం హడావిడిలో పడి తను వచ్చిందో లేదో నేను గమనించలేదు. మరుసటి రోజు నా షిఫ్ట్ అయిపోయాక తన ఆఫీస్ దగ్గరకు వెళ్ళి కలిసాను. “పది నిమిషాలు వెయిట్ చేయ్. పర్మిషన్ తీసుకుని వచ్చేస్తాను” అని హడావుడిగా మళ్ళీ ఆఫీస్‌లోకి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత తను తిరిగి వచ్చింది. ఇద్దరం కబ్బన్ పార్క్‌లో సిమెంట్ బెంచ్ పై కూర్చున్నాం. “నువ్వు చాలా మంచి నటుడివి. సినిమాల్లో ప్రయత్నించు” అంది. నా ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాను. తన హ్యాండ్‌బ్యాగ్ లోంచి కొన్ని కరెన్సీ నోట్లు నా జేబులో ఉంచి “మంచి ఫొటోలు తీసుకో, ప్రొఫైల్ తయారు చేసుకో. వీలున్నప్పుడల్లా ప్రొడక్షన్ ఆఫీసులకు వెళ్ళి నిన్ను నువ్వు పరిచయం చేసుకో. నీ దగ్గర మ్యాజిక్ ఉంది, అదే స్క్రీన్ ప్రెజెన్స్. నన్ను నమ్ము ఖచ్చితంగా నువ్వు గొప్ప నటుడివి అవుతావు” అని వాచీ చూసుకుని “నేను వెళ్ళాలి. కానీ నేను చెప్పింది మర్చిపోకు” అని వెళ్ళిపోయింది” అని ఆ నటుడు మాట్లాడటం ఆపి మౌనంగా ఉండి పోయాడు. “ఆ తరువాత?” అని ఉత్కంఠగా అడిగాడు మరో నటుడు. “ఆ తరువాత కూడా తను నాకు చాలా సార్లు ఆర్థికంగా సాయం చేసింది, నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చింది. కానీ నేను యాక్టర్ అయ్యాక తను నాకు మళ్ళీ కనిపించలేదు. తన కోసం వెతకని చోటు లేదు” అని కళ్ళలోంచి ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకున్నాడు. “నా విజయాన్ని అందరి కంటే ముందే తను చూసింది. నేను ఇప్పటికీ బ్రతికి ఉన్నానంటే కారణం తనే. ఒక్కసారైనా తను నాకు కనిపిస్తుందన్న ఆశ ఇంకా మిగిలే ఉంది” అన్నాడు. ఇంతలో “సార్, షాట్ రెడీ” అని అసిస్టెంట్ డైరెక్టర్ పిలవగానే కెమెరా ముందుకు వెళ్ళిపోయాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇలా ఈ కథనంతా కూడా హరీష్ మీనన్ అని ఓ వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.