- November 15, 2022
Super Star Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ మరణం.. నిన్నటి నుంచి జరిగిందిదే.. వైద్యులు ముందే హింట్ ఇచ్చారా?

Super Star Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యానికి సంబంధించిన విషయాలు సోమవారం నాడు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. సోమవారం తెల్లవారు ఝామున రెండు గంటల ప్రాంతంలో కృష్ణను ఆయన కుటుంబ సభ్యులు కాంటినెంటల్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. ముందుగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఆయనకు అంత సీరియస్‌గా లేదని, ఇరవై నాలుగు గంటల్లో డిశ్చార్జ్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ తరువాత తరువాత పరిస్థితి మారిపోయింది.
ముందు ఆయన శ్వాస కోశ సంబంధిత వ్యాధితో బాధపడ్డారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారంటూ వైద్యులు ప్రకటించారు. ఇరవై నిమిషాల పాటుగా సీపీఆర్ నిర్వహించామని, గుండెపోటు ప్రమాదం తప్పిందని, కానీ ఇతర సమస్యలు వెంటాడుతున్నాయని, ఆయన శరీరం సహకరిస్తుందో లేదో తెలియడం లేదని, ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని, గడిచే ప్రతీ గంటా కీలకమేనని, అందరూ ఆయన కోసం ప్రార్థించండని వైద్యులు తెలిపారు.
ఇదంతా చూసి ఘట్టమనేని అభిమానులు కంగారు పడ్డారు. ఆందోళన చెందారు. చివరకు వారు ఆందోళన చెందినట్టుగానే కృష్ణ మరణించిన వార్తను మంగళవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ప్రకటించారు. దీంతో కృష్ణ మరణ వార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఘట్టమనేని ఇంట్లో ఈ ఏడాది వరుసగా విషాదాలు నెలకొంటూనే ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో రమేష్ బాబు మరణించారు. సెప్టెంబర్‌లో ఇందిరాదేవీ, ఇప్పుడు కృష్ణ మరణించారు. మహేష్ బాబుకు మాత్రం తీరని శోకం మిగిలింది.