- October 26, 2021
ఇండస్ట్రీలో లేకుండా చేస్తా.. షోలో సహనం కోల్పోయిన శ్రీముఖి

శ్రీముఖి బుల్లితెరపై ఎంతలా రచ్చ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. ఆమె యాంకరింగ్ ఎంత సరదాగా సాగుతుందో, అందరినీ ఎలా కలుపుకుంటూ పోతుందో అందరికీ తెలిసిందే. తన మీద సెటైర్లు వేసినా కూడా అంతగా పట్టించుకోదు. పైగా వాటిని ఎంతో ఎంజాయ్ చేస్తుంటుంది. తాజాగా శ్రీముఖి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన విష్ణుప్రియతో కలిసి మాయాద్వీపం షోలో పార్టిసిపేట్ చేసింది. ఓంకార్ నిర్వహిస్తోన్న మాయాద్వీపం షో గురించి అందరికీ తెలిసిందే.
ఒకప్పుడు ఓంకార్ తన క్రియేటివిటీతో చేసిన ఎన్నో షోలు ఇప్పటికీ ట్రెండ్ సెట్టింగ్ వంటివే. ఆట షో, మాయాద్వీపం, చాలెంజ్ ఇలా ఎన్నెన్నో షోలు ఓంకార్‌ను బుల్లితెరపై స్టార్‌గా నిలబెట్టేశాయి. మధ్యలో సినిమా ఆఫర్లు రావడంతో అటు వైపు వెళ్లాడు. అక్కడ మంచి హిట్లు తీశాడు. కానీ ఈ మధ్య అంతగా వర్కవుట్ అవ్వడం లేదు అని మళ్లీ బుల్లితెర మీద ఫోకస్ పెట్టేశాడు. అందుకే స్టార్ మాలో కామెడీ స్టార్స్, డ్యాన్స్ ప్లస్ వంటి షోలు చేస్తున్నాడు. ఇక జీతెలుగు కోసం మాయాద్వీపం అనే షోను మళ్లీ ప్రారంభించాడు.
ఇందులో శ్రీముఖి విష్ణుప్రియను, సోహెల్ మెహబూబ్‌ను గెస్టులుగా పిలిచాడు. అయితే శ్రీముఖిని అక్కడి వింత మనుషులు, రాక్షసుల రూపంలో ఉన్న కమెడియన్లు తెగ హింసించారు. దీంతో శ్రీముఖికి చిర్రెత్తుకొచ్చింది. తన టాస్కును పూర్తి చేయకుండా అడ్డు పడుతుండటంతో వారి మీద విరుచుకపడింది. మీ మేకప్పులు తీసేయండి.. మిమ్మల్ని ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను అంటూ శ్రీముఖి వారిని హెచ్చరించింది. దీంతో ఓంకార్, విష్ణుప్రియ, సోహెల్ తెగ నవ్వేశారు.