• August 5, 2022

Sita Ramam Review : సీతారామం రివ్యూ.. స్వచ్చమైన ప్రేమకావ్యం

Sita Ramam Review : సీతారామం రివ్యూ.. స్వచ్చమైన ప్రేమకావ్యం

    Sita Ramam Review అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచే మనసు ఇలా ప్రేమ కథలను ఎంతో అందంగా చూపించాడు హను రాఘవపూడి. ఆయన తీసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడకపోయినా.. ప్రేమ కథను చూపించే విధానం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. అలా ఇప్పుడు హను రాఘవపూడి సీతారామం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ ఏ మేరకు మెప్పించారో చూద్దాం.

    కథ
    సీతారామం చిత్రం నిజానికి 1985లో జరుగుతుంది. అయితే దాని నేపథ్యం మాత్రం 1965లో ఉంటుంది. కాశ్మీర్ అల్లర్లు, మత ఘర్షణలు, యుద్ద వాతావరణం.. అందులోంచి ఓ ప్రేమ కథ. ప్రేమకు ఆ యుద్దానికి లింక్ ఏంటి? లెఫ్టినెంట్ రామ్ (దుల్కర్ సల్మాన్)‌కు సీత (మృణాల్ ఠాకుర్)కు పరిచయం ఎలా ఏర్పడింది? రామ్‌కి సీత ఎందుకు ఉత్తరాలు రాయడం మొదలుపెట్టింది? ఆ తరువాత రామ్ ఏం చేశాడు? అసలు సీత నేపథ్యం ఏంటి? సీత కోసం రామ్ రాసిన ఉత్తరానికి అఫ్రిన్(రష్మిక మందన)కు ఉన్న సంబంధం ఏంటి? ఆ ఉత్తరంలో ఏముంది? ఈ కథను విష్ణు శర్మ (సుమంత్) ఎలా మలుపు తిప్పాడు? అనేది కథ.

    రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ తప్ప ఇంకొకరిని ఊహించుకోలేం. రామ్ కారెక్టర్లోని నిజాయితీ, ప్రేమ, దేశభక్తి అన్నీ కూడా దుల్కర్ కంట్లోనే కనిపిస్తుంటుంది. రామ్ పాత్రుక దుల్కర్‌ను తీసుకోవడం వంద శాతం కరెక్ట్ అనిపిస్తుంది. ఇక మృణాల్ చాయిస్ ఎంత కరెక్ట్ అన్నది సినిమా చూస్తే అర్తమవుతుంది. సీత పాత్రలో మృణాలిని అందరినీ కట్టిపడేస్తుంది. ఆ హావభావాలు, తుంటరితనం, ప్రేమ కోసం పరితపించే అమ్మాయిగా మృణాల్ అందరినీ మెప్పిస్తుంది. వీరిద్దరి ప్రజెన్స్ స్క్రీన్ మీద మ్యాజిక్ అనిపిస్తుంది.

    విశ్వ శర్మ పాత్రలోని షేడ్స్, వేరియేషన్స్ సుమంత్ బాగా పలికించాడు. ఈ పాత్రలో సుమంత్ కొత్తగా కనిపిస్తాడు. కాస్త నెగెటివ్ షేడ్స్ కనిపిస్తాయి. ఇక రష్మిక పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. సారీ చెప్పేందుకు ఒప్పుకోని అఫ్రిన్.. చివరకు సారీ చెప్పకపోతే చచ్చిపోతానేమో అని అనుకునే స్థాయి వరకు వెళ్లే పాత్రలో రష్మిక మెప్పించింది. బాలాజీగా తరుణ్ భాస్కర్ నవ్వించే ప్రయత్నం చేశాడు. సునీల్, వెన్నెల కిషోర్ కామెడీ పండించారు. మురళీ శర్మ కనిపించినంత సేపు ఆకట్టుకుంటాడు. ఇక సచిన్ ఖేదెకర్, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ అందరూ మెప్పిస్తారు.

    ప్రస్తుతం సినిమాలు అంటే ఎలా ఉంటున్నాయి.. విచ్చలవిడిగా అందాలను ప్రదర్శించాలి.. హద్దులు దాటేలా శృంగార సన్నివేశాలు చూపెట్టాలి.. అలాంటి సీన్లు లేకపోతే అసలు సినిమానే కాదు.. హీరోల పిచ్చిగెంతులు, డైలాగ్స్, భారీ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండాలి. పేరుకు భారీ తనం అని అంటుంది.. కానీ సినిమా కథలో ఉండాల్సిన మినిమం ఎమోషన్స్ కూడా ఉండవు.

    అలాంటి సినిమాలు వస్తున్న ఈ తరుణంలో సీతారామం అనే అందమైన ప్రేమ కావ్యం వచ్చింది. సీతారామం అనే పేరులోనే ఎంతో పవిత్రత ఉంది. ఎంతో ప్రేమ, త్యాగం, భక్తిభావం అన్నీ దాగి ఉన్నాయి. పేరుకు తగ్గట్టే ఈ సినిమా ఎంతో గొప్పగా ఉంది. ఆ పేర్లను నిలబెట్టేలా, ఆ పేర్లకు ఉన్న తాత్పర్యం ఉట్టిపడేలా పాత్రలు, కథనం ఉంటుంది.

    ఎక్కడా అశ్లీలతకు అసభ్యతకు తావివ్వకుండా తెరకెక్కించాడు హను. ఏ ఒక్క చోట కూడా హద్దులు దాటలేదు. ప్రేమ కథ కదా? అని శృంగార సన్నివేశాలు కూడా పెట్టలేదు. కేవలం స్పర్శతోనే ప్రేమలోనే భావాన్ని పలికించాడు. లంకలో ఉన్న సీత కోసం రాముడు పరితపిస్తే.. ఇక్కడ పాకిస్థాన్ జైల్లో ఉన్న రాముడి కోసం సీత పరితపిస్తుంది.

    సీత పాత్రను ఎంతో గొప్పంగా చూపించాడు. స్వచ్చమైన ప్రేమకు ప్రతీకగా చూపిస్తాడు. మహారాణిని అయిన తనను మహారాణిలా చూసుకుంటాను అని చెబితే.. సీత ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ ఎంతో గొప్పగా అనిపిస్తాయి. ఏం వదులుకుని వెళ్తున్నావో నీకు తెలుస్తుందా? అని సీతను ప్రశ్నిస్తే.. ఎవరి కోసం వెళ్తున్నానో తెలిస్తే ఇలా అనవు అంటూ చెప్పే సీన్, డైలాగ్ అద్భుతంగా ఉంటుంది.

    రామ్, సీత పాత్రలకు కలిపిన విధానం, చివర్లో రామ్ తన ప్రేమను చెప్పే తీరు, సీత అసలు రూపాన్ని తెలుసుకున్న రామ్ చెప్పే చివరి డైలాగ్ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమాలోని ప్రతీ సీన్, ప్రతీ ఫ్రేమ్ ఎంతో రిచ్‌గా అనిపిస్తుంది. ఇక పాటలు అయితే ఈ స్థాయిలో ఆకట్టుకున్నవి ఈ మధ్యకాలంలో రాలేదు. అంత కవిత్వం, అంత భావం, అంతకు మించి తెరకెక్కించిన విధానం మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్‌గా ఉంటుంది. విజువల్స్ కోసం ఎన్నిసార్లైనా ఈ సినిమాను చూడొచ్చనేలా ఉంటుంది. డైలాగ్స్, పాటలు, బ్యాక్ గ్రౌండ్ ఇలా అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి.

    సీతారామం చక్కని ప్రేమాయణం

     

    సీతారామం మూవీ రివ్యూ, రేటింగ్ – 3.5/5