- December 1, 2021
Sirivennella Seetharamasastry : దటీజ్ సిరి వెన్నెల.. సిగరెట్ ప్యాకెట్ మీదే సారాన్ని రాసిచ్చేశాడు!

Ardha Shathabdapu Song From Sindhuram సిరివెన్నెల సీతారామశాస్త్రి పదాలు, ప్రయోగాలు, సాహిత్యం గురించి ఎన్ని చెప్పినా, ఎంత గొప్పగా చెప్పినా తక్కువే అవుతుంది. సిరివెన్నెల గురించి చెప్పడం అంటే ఆకాశాన్ని అరచేతితో పట్టేసుకోవడం వంటిది. ఎవరెస్ట్ శిఖరానికే ఎత్తు గురించి మాటలు చెప్పినట్టుంటుంది. అలా సిరివెన్నల వాడని, పదం లేదు. తెలుగు నిఘంటవులోని ఎన్నో పదాలను కొత్తగా వాడుకలోకి తీసుకొచ్చారు.
సినిమా సారాన్ని అంతా కూడా ఒకే పాటలో చెప్పడం ఆయనకే చెల్లుతుంది. అది కూడా అప్పటికప్పుడు రాసివ్వడం అంటే మామూలు విషయం కాదు. అలా ఓ సారి జరిగిందట. కృష్ణవంశీ తెరకెక్కించిన సింధూరం సినిమా అంతా ఒకెత్తు అయితే.. అందులోని అర్దశతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా? స్వర్ణోత్సవాలు చేద్దామా? అంటూ ఈ సమాజాన్ని ప్రశ్నించాడు సిరివెన్నెల.
అది ఒక విచిత్రం సందర్భమట. సింధూరం ప్రివ్యూను సిరివెన్నెలకు చూపించాడట కృష్ణవంశీ. ఏదో తెలియని అసంతృప్తి ఉందని అన్నాడట. సినిమాలోని క్లైమాక్స్ కూడా అలానే ఉంటుంది. ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేది చెప్పరు. అది జనాలే నిర్ణయించుకోవాలన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి విషయాన్ని, అంత తేలిగ్గా చెప్పడం కంటే కాస్త బలంగా పాట రూపంలో చెప్పాలని అప్పటికప్పుడు పాటను రెడీ చేసేశారట సిరివెన్నెల.
అంత టైం లేదు కదా గురువు గారు కృష్ణవంశీ అంటే.. అక్కడే పడి ఉన్న సిగరెట్ ప్యాకెట్ మీద అర్ద శతాబ్దపు అంటూ అలా పాట మొత్తం రాసుకుంటూ వెళ్లిపోయారట. వెంటనే ట్యూన్ కట్టేసి, పాట రెడీ చేసి పెట్టేశారట. ఇక సినిమా విడుదలైన తరువాత అంతటా ఈ పాటే మార్మోగిపోయింది. ఇప్పటికీ ఎప్పటికీ ఈ పాట సమాజాన్ని వెంటాడుతూనే ఉంటుంది. అందులోని ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు.