• August 10, 2025

 ‘ఏలుమలై’ నుంచి మంగ్లీ ఆలపించిన ‘కాపాడు దేవా’ పాట విడుదల

 ‘ఏలుమలై’ నుంచి మంగ్లీ ఆలపించిన ‘కాపాడు దేవా’ పాట విడుదల

    హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్నా హీరోగా పరిచయం కాబోతోన్నారు. రాన్నా హీరోగా ప్రియాంక ఆచార్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తరుణ్ కిషోర్ సుధీర్ నిర్మాణంలో పునీత్ రంగస్వామి తెరకెక్కించిన చిత్రం ‘ఏలుమలై’. నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి రచన, మాటలు, దర్శకత్వం పునీత్ రంగస్వామి వహించారు. ఇప్పటి వరకు ‘ఏలుమలై’ నుంచి వచ్చిన టైటిల్ టీజర్, పోస్టర్, పాటలు ఇలా అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి గుండెల్ని మెలిపెట్టి, మనసుల్ని కదిలించే పాటను విడుదల చేశారు.

    సింగర్ మంగ్లీ ఆలపించిన ‘కాపాడు దేవా’ అనే పాట శ్రోతల మనసుల్ని కదిలించేలా ఉంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటకు డి. ఇమ్మాన్ బాణీ బాగుంది. ఈ పాటను కంపోజ్ చేసిన తీరు, లిరిక్స్‌ను గమనిస్తే.. ఓ ప్రేమ జంట, విడిపోయే క్షణాలు, ఆ దేవుడు ఆడే ఆటని చూపించినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే సిధ్ శ్రీరామ్ ఆలపించిన ‘రా చిలకా’ అనే పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.

    కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్, సేలం, ఈరోడ్ వంటి వివిధ ప్రదేశాలలో ఈ మూవీని చిత్రీకరించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.