• May 24, 2024

‘డర్టీ ఫెల్లో’ రివ్యూ.. ఆకట్టుకునే మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీ

‘డర్టీ ఫెల్లో’ రివ్యూ.. ఆకట్టుకునే మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీ

    ఇండియన్ నేవీ నుంచి సినిమాల్లోకి వచ్చేశాడు శాంతి చంద్ర. అక్కడ సోల్జర్‌గా పని చేసిన శాంతి చంద్ర డర్టీ ఫెల్లోతో ఇక్కడ హీరోగా మారిపోయాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దీంతో ‘డర్టీ ఫెలో’పై హైప్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచనాలతో నేడు(మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    కథ
    మాఫియా డాన్‌ జేపీ (నాగినీడు), శంకర్ నారాయణ (సత్య ప్రకాష్) ఇద్దరు మంచి స్నేహితులు. జేపీని తప్పిస్తే తనే మాఫీయా డాన్‌గా ఉండొచ్చని శంకర్‌ నారాయణ కుట్ర చేస్తాడు. జేపీని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో శంకర్‌ నారాయణ కొడుకు చనిపోతాడు. దీంతో శంకర్‌ నారాయణ జేపీపై పగ పెంచుకుంటాడు. ఎప్పటికైనా నీ కొడుకు శత్రు అలియాస్‌ డర్టీ ఫెలో(శాంతి చంద్ర)ని తానే చంపుతానని జేపీకి వార్నింగ్‌ ఇస్తాడు. కట్‌ చేస్తే.. సిద్దు (శాంతి చంద్ర) ఓ గూడెంలోని పూజరి ఇంట్లో ఉంటూ.. అక్కడి పిల్లలకు చదువు చెబుతుంటాడు.

    పూజారి కూతురు రాగ (దీపికా సింగ్) సిద్దుని చూసి ఇష్టపడుతుంది. అదే గ్రామానికి సేంద్రియ వ్యవసాయ పరిశోధన మీద చిత్ర (సిమ్రితి) వస్తుంది. ఆ గూడెం, ఆ అటవీ ప్రాంతాన్ని శంకర్ నారాయణ మనిషి పోతురాజు తన గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు. అలాంటి పోతురాజుని సిద్దు హతమార్చేస్తాడు. దీంతో సిద్దు, డర్టీ ఫెల్లో ఒక్కరే అని శంకర్ నారాయణ తెలుసుకుంటాడు? మరో వైపు సిద్దుని చిత్ర షూట్ చేస్తుంది? ఆ తరువాత ఏం జరుగుతుంది? అసలు డర్టీ ఫెల్లో, సిద్దు ఒకరేనా? చిత్ర ఎందుకు షూట్ చేసింది? శంకర్ నారాయణ చివరకు ఏం చేస్తాడు? అన్నది తెరపై చూడాల్సిందే.

    నటీనటులు
    సిద్దు, డర్టీ ఫెలొ పాత్రల్లో శాంతి చంద్ర చక్కగా నటించాడు. రెండు కారెక్టర్ల మధ్య వేరియేషన్స్‌ను చూపించాడు. యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ అదరగొట్టేశాడు. స్టైల్‌, యాక్షన్‌ తో మాస్‌ ఆడియన్స్‌ మెప్పించాడు. ఇక నాగి నీడు చాలా రోజుల తరువాత అందరినీ లెంగ్తీ పాత్రతో మెప్పించాడు. సత్య ప్రకాష్ విలనిజం చాలా రోజులకు మళ్లీ తెరపై కనిపించింది. పోతురాజు పాత్ర బాగుంది. దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ ముగ్గురూ కూడా తెరపై అందంగా కనిపించారు. ఈ మూడు పాత్రలకు మంచి ప్రాధాన్యం లభించింది. అన్ని పాత్రలకు ప్రాముఖ్యత ఉంది. అందరూ తమ పరిధి మేరకు నటించారు.

    విశ్లేషణ
    మాఫియా నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. డర్టీ ఫెలో కూడా అలాంటి సినిమానే. కానీ ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా యాడ్‌ చేయడంతో కాస్త కొత్తగా అనిపిస్తుంది. సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయి. ఎక్కడా ల్యాగ్ ఉండదు. మూవీ బిగినింగ్ నుంచి అలా వెళ్తూ ఉంటుంది. యాక్షన్‌, ఎమోషన్స్‌, రొమాన్స్‌తో ఫస్టాఫ్‌లో కథనం చాలా ఫాస్ట్‌గా సాగుతుంది. హీరో ఎంట్రీ.. టైటిల్‌ సాంగ్‌… హీరోయిన్లతో రొమాన్స్‌ అన్ని యూత్‌ని ఆకట్టుకుంటాయి.

    సినిమా ప్రారంభంలోనే డర్టీఫెలోని పరిచయం చేసి.. ఆ తర్వాత సిద్దు పాత్ర చుట్టు కథను నడించాడు దర్శకుడు. దీంతో అసలు సిద్దు, డర్టీఫెలో ఒకరేనా కాదా? అనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో కలిగేలా చేశాడు. అలాగే చిత్ర పాత్రను కూడా విభిన్నంగా తీర్చి దిద్దాడు. ఇంటర్వెల్‌ ముందు ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో మాఫియా డాన్‌ ‘డర్టిఫెలో’ చుట్టే కథనం సాగుతుంది. స్విమింగ్‌ ఫూల్‌ సీన్‌ అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో జేపీ ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. మాఫియా నేపథ్యంలో వచ్చే సినిమాల్లో డర్టీఫెలో ఓ డిఫరెంట్‌ మూవీ. స్క్రీన్‌ప్లేని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.

    సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. డాక్టర్‌. సతీష్‌ కుమార్‌.పి సంగీతం బాగుంది. టైటిల్‌ సాంగ్‌ సినిమాకే హైలెట్‌. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకి ప్రాణం పోశాడు సతీష్‌ కుమార్‌. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా ఎక్కువగా ఔట్‌డోర్స్‌లోనే షూట్‌ చేశారు. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను చాలా రిచ్‌గా తీర్చిదిద్దారు.

    రేటింగ్‌ 3