- August 8, 2025
సు ఫ్రమ్ సో రివ్యూ.. కామెడీతో మంచి మెసెజ్ ఇచ్చిన చిత్రం

కన్నడలో విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విచిత్రమైన అతీంద్రియ హాస్య చిత్రం ‘సు ఫ్రమ్ సో’ తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది . మైత్రీ మూవీ మేకర్స్ ఆగస్టు 8న గ్రాండ్ రిలీజ్ చేసింది. జెపి తుమినాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షనీల్ గౌతమ్, జెపి తుమినాడ్, సంధ్య అరకెరె, ప్రకాష్ కె తుమినాడు, దీపక్ రాయ్ పనాజే, మైమ్ రాందాస్ వంటి వారు నటించారు. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
సు ఫ్రమ్ సో అనే కథ అంతా కూడా ఓ ఊరిలో జరుగుతుంది. ఆ ఊరిలో రవన్న (షనీల్ గౌతమ్) అనే వ్యక్తి అందరికీ తల్లో నాలుకలా ఉంటాడు. ఎవరికి ఏ అవసరం ఉన్నా, పని కావాలన్నా, సలహా కావాలన్నా కూడా అంతా రవన్ననే సంప్రదిస్తుంటారు. ఇక ఆ ఊరికి పెద్ద పోటుగాడు రవన్న అని అంతా అనుకుంటున్నారు. అసలు రవన్న మీద చేయి వేసే మగాడు ఊర్లోనే లేడని అనుకుంటారు. అలాంటి రవన్న ఏజ్ మీద పడుతున్నా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. ఇక రవన్న క్రేజ్ చూసి కొందరికి కడుపు మంటగా ఉంటుంది. అందులో అశోక్ (జెపి తుమినాడ్) అనే వాడు కూడా ఉంటాడు. దెయ్యం పట్టిందని నాటకం ఆడి రవన్నని కొట్టేస్తాడు. ఆ దెయ్యం పట్టిందని ఆడిన నాటకం ఎంత వరకు వెళ్లింది? రవన్న చివరకు ఏం చేస్తాడు? రవన్న పెళ్లి చివరకు జరుగుతుందా? ఊర్లో దెయ్యం ఉందని దాన్ని పోగొట్టేందుకు ఎక్కడి నుంచో వచ్చిన గురూజీ కరుణాకర్ (రాజ్ బి శెట్టి) ఏం చేస్తాడు? అన్నదే కథ.
ఓ ఊర్లో రకరకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులుంటారు. అన్నింటికీ ముందు పడే ఓ వ్యక్తి.. అన్నీ నాకే తెలుసు అని బిల్డప్ ఇచ్చే వ్యక్తి.. వాడే గొప్పేంటి? వాడి కంటే నేను గొప్ప అని అనుకునే వ్యక్తులుంటారు. ఇలా ఒక్కో రకమైన వ్యక్తిని ఈ సూ ఫ్రమ్ సో చిత్రంలో మనం చూడొచ్చు. రవన్న పాత్ర చుట్టూ ఈ కథను తిప్పాడు దర్శకుడు. అయితే అశోక్ అనే పాత్రతో ఇవ్వాల్సిన మెసెజ్ ఇచ్చేశాడు.
ఎలాంటి సిట్యువేషన్‌లో అయినా కామెడీని క్రియేట్ చేస్తూ నవ్వించే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయినట్టుగానే కనిపిస్తోంది. కానీ చాలా చోట్ల చిరాగ్గా అనిపించే ఛాన్స్ ఉంటుంది. ఇది కామెడీనా? ఇప్పుడు నవ్వాలా? అన్నట్టుగా కనిపిస్తుంది. ఇక తెరపై పూర్తిగా కన్నడ ఆర్టిస్టులే ఉండటం, మనకు ఎక్కువగా తెలిసిన మొహాలు ఉండకపోవడంతో ఎక్కువగా కనెక్ట్ కాలేకపోతామేమో.
ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలా సో సోగా సాగుతూ ఉంటుంది. కథ ఎప్పటికీ ముందుకు సాగదు. రవన్న, అశోక్, దెయ్యం పట్టినట్టుగా నటించడం, సులోచన అంటూ ఇలా అక్కడక్కడే తిరుగుతుంది. ఇక సెకండాఫ్‌లో అయినా కథలో ఏమైనా వేగం పుంజుకుంటుందా? ఆసక్తికరంగా మారుతుందా? అని అనుకుంటే అక్కడా నిరాశే కలుగుతుంది. ఎంతకీ అసలు పాయింట్‌లోకి రాడనిపిస్తుంది.
అశోక్ మార్పు చెందే సీన్లు, ఒంటరి అమ్మాయి ఎదుర్కొనే కష్టాలు, మృగాళ్ల మాదిరి పీడించే మగాళ్లు అంటూ ప్రస్తుతం జరుగుతున్నట్టుగానే సీన్లను చూపించారు. ఓ మహిళను సమాజం ఎంత చిన్న చూపుగా చూస్తుంది? మూఢ నమ్మకాల పేరిట జనాల్ని ఎలా బురిడి కొట్టిస్తారు? పిచ్చి జనాలు గొర్రెల్లా ఎలా మారిపోతారు? అన్నది ఇందులో చూపించారు.
ఆర్టిస్టులుగా అయితే రవన్న, అశోక్, గురూజీ పాత్రలు బాగుంటాయి. ఆటో డ్రైవర్, తాగుబోతు కారెక్టర్స్ కూడా మెప్పిస్తాయి. ఇలా దాదాపు అందరూ తమ తమ పాత్రల్లో ఓకే అనిపిస్తుంటారు. టెక్నికల్‌గా సు ఫ్రమ్ సో బాగానే ఉంటుంది. మ్యూజిక్, విజువల్స్ సహజంగా ఉంటాయి. ఒకే ఊరిలో, రెండు, మూడు లొకేషన్స్‌తోనే షూటింగ్ మొత్తాన్ని కానిచ్చినట్టుగా అనిపిస్తుంది. ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలానే సు ఫ్రమ్ సో ఉంటుంది. కొన్ని చోట్ల బోరింగ్.. ఇంకొన్ని చోట్ల నవ్వులు అన్నట్టుగా సినిమా సాగుతుంది.
రేటింగ్ 2.75