- May 24, 2024
Big Brother Review : బిగ్ బ్రదర్ రివ్యూ.. కట్టిపడేసే ఎమోషనల్ డ్రామా
Big Brother Movie Review శివ కంఠమనేని ఎప్పుడూ ఏదో ఒక కొత్త పాయింట్‌తో సినిమా తీస్తుంటాడు. ఇప్పుడు వరుస చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. చివరగా మధురపూడి గ్రామం అనే నేను మూవీతో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు బిగ్ బ్రదర్ అనే మూవీతో అందరికీ పలకరించేందుకు ముందుకు వచ్చారు. గోసంగి సుబ్బారావు చాలా విరామం తర్వాత తెలుగులో డైరెక్టర్‌గా రీ-ఎంట్రీ ఇస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.ఎస్.శంకర్ రావు, ఆర్.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
శివ (శివ కంఠమనేని) తన తమ్ముడు సూర్య (శ్రీ సూర్య) అంటే ప్రాణంగా ఉంటాడు. తమ్ముడి కోసం ఏం చేయడానికైనా సిద్దం అవుతాడు. అలాంటి తమ్ముడి మీద ఓ సారి అటాక్ జరుగుతుంది. తమ్ముడ్ని కాపాడేందుకు శివ వీరోచితంగా పోరాడతాడు. పాత గొడవలు, కక్షల కారణంగా తమ్ముడికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని, ఇంట్లోనే ఉండమని, బయటకు వెళ్లొద్దని చెబుతాడు. కానీ సూర్య మాత్రం తన వదిన గౌరి (ప్రియ హెగ్డే)కి కాకమ్మ కబుర్లు చెప్పి, మస్కా కొట్టేసి అలా బయటకు వెళ్లి జాలీగా తిరుగుతూ పూజ (ప్రీతి) ప్రేమలో పడతాడు. సూర్య, ప్రీతిల మీద ఓ సారి అటాక్ జరుగుతుంది. ఆ అటాక్‌ను శివ, సూర్య ఇద్దరూ కలిసి తిప్పి కొడతారు. పూజ ఎవరు? ఆమె ఫ్లాష్ బ్యాక్ ఏంటి? సూర్యకు, పూజకు ఎప్పుడు పరిచయం ఏర్పడుతుంది? ఎంగేజ్మెంట్ జరిగినా పదేళ్లు పెళ్లి చేసుకోకుండా శివ ఎందుకు దూరంగా ఉంటాడు? అన్నది తెరపై చూడాల్సిందే.
నటీనటులు
ఈ చిత్రంలో శివ పాత్రలో శివ కంఠమనేని కనిపిస్తాడు. అన్నగా అందరినీ మెప్పిస్తాడు. శివ కారెక్టర్‌లో శివ కంఠమనేని చూపించాల్సిన ప్రేమ, కోపం ఇలా అన్ని ఎమోషన్స్‌ను చూపించాడు. మరీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో ఫుల్ ఎనర్జీతో కనిపించి మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడు. శివ పాత్ర తరువాత ఈ చిత్రంలో సూర్య కారెక్టర్ హైలెట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్‌లో భయస్తుడిలా, సెకండాఫ్‌లో కాలేజీ కుర్రాడిలా, అల్లరి పాత్రలో మెప్పించాడు. గౌరి పాత్రలో ప్రియ హెగ్డే అందంగా కనిపిస్తుంది. పూజ కారెక్టర్‌లో ప్రీతి గ్లామరస్‌గా మెప్పిస్తుంది. భవానీ, దేవ్, మంత్రి పాత్రలు విలనిజాన్ని చూపించాయి. నానమ్మ పాత్ర అక్కడక్కడా నవ్వులు పూయించింది.
విశ్లేషణ
ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా బిగ్ బ్రదర్ కథను అన్ని యాంగిల్స్‌లో చక్కగా రాసుకున్నాడు. చక్కటి మాస్ ఫ్యామిలీ కమర్షియల్ సినిమాను చూసినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫ్యామిలీ, వదిన మరిది, నాయనమ్మ అల్లరి చుట్టూ తిరుగుతుంది. అన్నా తమ్ముళ్ల రిలేషన్, వదిన ప్రేమ, నానమ్మ అల్లరి ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను జోడించి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా రాసుకున్నాడు. కామెడీ కూడా బాగానే పండింది. ఫైట్స్, పాటలకు కరెక్ట్ ప్లేస్ మెంట్ దొరికింది. ఇక ఫస్ట్ హాఫ్ చూస్తేనే ఫుల్ మీల్స్ అన్నట్టుగా కనిపిస్తుంది. ఇంటర్వెల్ హీరోలిద్దరూ కలిసి చేసే ఫైట్ బాగుంటుంది.
సెకండాఫ్‌లో కథ ఎక్కువగా ఫ్లాష్ బ్యాక్‌లో సాగుతుంది. కాలేజ్ సీన్స్ బాగుంటాయి. ఆ ఎపిసోడ్స్ అన్నీ కూడా యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య టామ్ అండ్ జెర్రీ వార్, ర్యాగింగ్ చేసుకోవడం, ప్రేమ పుట్టడం, హీరోయిన్ తండ్రి నుంచి వచ్చిన సమస్యలు.. ఇలా ప్రీ క్లైమాక్స్ వరకు కథ బాగా వెళ్తుంది. ఇక శివ ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అక్కడ నటీనటులు ఎమోషనల్ యాక్టింగ్ అందరినీ కదిలిస్తుంది. బ్రదర్ సెంటిమెంట్ బాగా పండుతుంది. క్లైమాక్స్‌లో తమ్ముడి ప్రేమను గెలిపించేందుకు అన్న చేసే పోరాటం, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అన్నీ బాగుంటాయి. చివరకు కథ సుఖాంతం అవుతుంది.
బిగ్ బ్రదర్ మూవీకి సంగీతం ఓకే అనిపిస్తుంది. పాటలు వినడానికి, చూడటానికి బాగుంటాయి. సినిమాటోగ్రఫీ నేచురల్‌గా ఉంటుంది. నిడివి తక్కువగానే ఉండటం ప్లస్. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. పెట్టిన ఖర్చుకు తగ్గ ఫలితం వచ్చినట్టుగా అనిసిస్తుంది. ఈ మూవీ కమర్షియల్‌గానూ వర్కౌట్ అవుతుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
రేటింగ్ : 3