Drushyam 2 Movie Review : దృశ్యం 2 రివ్యూ.. ఊహించని క్లైమాక్స్

Drushyam 2 Movie Review : దృశ్యం 2 రివ్యూ.. ఊహించని క్లైమాక్స్

    మళయాలంలో వచ్చిన దృశ్యం 2 సినిమాకు రీమేక్‌గా తెలుగు దృశ్యం 2 సినిమా వచ్చింది. దృశ్యం సినిమాతో వెంకటేష్, మీనా ఆకట్టుకున్నారు. తన ఫ్యామిలీ కోసం రాంబాబు న్యాయం, చట్టాలతో ఎలా ఆడుకున్నాడో అందరికీ తెలిసిందే. మరోసారి రాంబాబు తన ఫ్యామిలీ కోసం ఎలాంటి స్కెచ్‌లు వేశాడో ఓ సారి చూద్దాం.

    కథ
    దృశ్యం కథ ఎక్కడ ముగిసిందో.. పార్ట్ 2 అక్కడే మొదలవుతుంది. వరుణ్ శవం దొరక్క పోవడంతో కేసు నిలిచిపోతుంది. కాలక్రమేణ ఆరేళ్లు గడుస్తుంది. ఇంతలోపు రాం బాబు ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు. థియేటర్ ఓనర్ అవుతాడు. సినిమా పిచ్చితో ఓ కథ అనుకుంటాడు. ఫేమస్ రైటర్ వినయ్ చంద్ర (తణికెళ్ల భరణి)తో ఓ కథను రాయిస్తాడు. రాంబాబు ఇలా సినిమా ప్రయత్నాల్లో ఉంటే.. పోలీసులు మాత్రం రాంబాబు మీద ఓ కన్నేసి ఉంచుతారు. ఇంటి చుట్టూ నిఘా ఉంటుంది. సరిత, సంజయ్ పాత్రలతో పోలీసు తమ తెలివి చూపిస్తే.. రాంబాబు మాత్రం ముందుచూపుతో పోలీసులను బోల్తా కొట్టిస్తాడు. అసలు ఆ శవం ఎక్కడుంది? పోలీస్ స్టేషన్‌లో దొరికిన శవం ఎవరిది? సినిమా తీసేందుకు రాం బాబు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించాడు? చివరకు రాంబాబు ఎలా తప్పించుకున్నాడు? అనేదే కథ.

    నటీనటులు
    మొదటి పార్ట్‌లో ఉన్న పాత్రలే దాదాపుగా రెండో పార్ట్‌లోనూ ఉంటాయి. కొత్తగా ఐజీ గౌతమ్ సాహు (సంపత్), సరిత (సుజ వరుణీ), సంజయ్ (సత్యం రాజేష్), వినయ్ చంద్ర (తణికెళ్ల భరణి) పాత్రలు ఎంట్రీ ఇస్తాయి. ఈ నాలుగు పాత్రలతోనే కథలో ఎన్నో ట్విస్టులు వస్తాయి. ఇక రాం బాబు పాత్రలో వెంకటేష్ అద్భుతంగా నటించాడు. జ్యోతిగా మీనా, అంజు పాత్రలో కృతిక, అనుగా ఏస్తర్ అనిల్, ప్రభాకర్ పాత్రలో నరేష్, గీత కారెక్టర్‌లో నదియా ఇలా అందరూ మొదటి పార్ట్‌లో ఉన్నవారే కనపిస్తారు. ప్రతీ ఒక్క పాత్రకే ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరూ అద్బుతంగా నటించేశారు.

    విశ్లేషణ
    దృశ్యం సినిమాలోనే ఎన్నో ట్విస్టులుంటాయి. ఇక అంతకు మించి అనేలా దృశ్యం 2లో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. రాం బాబు రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టడం, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసుకునే పనిలోనే ఉంటాడు. కానీ పోలీసులు మాత్రం రాంబాబు కంటే వెనకే ఉంటారు. ఆలోచనల్లో రాంబాబు చాలా ముందుండటంతో, దానికి తగ్గట్టు ప్రిపరేషన్స్ చేసుకోవడంతో మరోసారి పోలీసులు బోల్తా పడతారు.

    జీతూ జోసెఫ్ ఎంత పకడ్భంధీగా కథను రాశాడో సినిమాను చూస్తుంటే వచ్చే ఉత్కంఠే చెబుతుంది. క్షణక్షణానికి ఏమవుతుందా? అనే ఆసక్తితో ప్రేక్షకులు చూస్తుంటారు. శవం ఎక్కడుంది? తరువాత ఏం జరుగుతుంది? రాంబాబు చట్టం ముందు నిర్దోశిగా నిలబడతాడా?అనే విషయాన్ని చూసే ప్రేక్షకుల్లో కలిగించాడు. అదే సమయంలో తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు.. ఎప్పుడో సారి దొరకాల్సిందేన విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు.

    కానీ చట్టం, న్యాయం వేసే శిక్షల కంటే పెద్దది ఉంటుందిన, చస్తూ బతకడం కంటే పెద్ద శిక్ష ఏమీ లేదని చివర్లో చెప్పేశాడు. దాన్ని బట్టి దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పేశాడు. ఇది ప్రారంభం అంటూ చివర్లో హింట్ ఇచ్చాడు. కానీ మరో పార్ట్ కూడా ఉంటుందా? అనే సందేహాన్ని లేవనెత్తేశాడు. కుటుంబం కోసం ఎంతకైనా సిద్దపడ్డవాడు.. వాన్ని మనం గెలవలేం.. మనం వాడి మీద కన్నేస్తామని తెలిసి.. దానికి ఏం చేయాలో ఇప్పటి నుంచే ఆలోచించుకుంటూ ఉంటాడు.. వాడికి ఇంతకన్న పెద్ద శిక్ష ఏముంటుందని చివర్లో డైలాగ్ ఐజీ పాత్రలో సంపత్ చేత చెప్పిస్తారు.

    అలా మొత్తానికి జీతూ జోసెఫ్ రాసుకున్న కథ, అందులోని ట్విస్టులు మాత్రం అందరినీ మెప్పిస్తాయి. ఎవ్వరూ ఊహించని క్లైమాక్స్ చివర్లో ఉంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. రాం బాబు చేసే చిన్న పని వెనకాల కూడా ఎంతో అర్థముందని చివరకి ప్రేక్షకుడి అర్థమవుతుంది.

    Leave a Reply