Chandramukhi 2 Telugu Movie Review : చంద్రముఖి 2 రివ్యూ.. దర్శకుడు పి.వాసు, నిర్మాతకు పెద్ద లాసు

Chandramukhi 2 Telugu Movie Review : చంద్రముఖి 2 రివ్యూ.. దర్శకుడు పి.వాసు, నిర్మాతకు పెద్ద లాసు

    Chandramukhi 2 Movie Review రజినీకాంత్, జ్యోతిక కలిసి చంద్రముఖి సినిమాలో చేసిన మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవ్వదు. రిపీట్ చేయాలని అనుకోవడం కూడా సాహసమే అవుతుంది. అప్పట్లో నాగవల్లి అంటూ వెంకటేష్ చేతులు కాల్చుకున్నాడు. చంద్రముఖిలానే నాగవల్లిని తీశాడు. ఇప్పుడు చంద్రముఖి 2ని కూడా అలానే తీశాడు. అదెదో సినిమాలో బ్రహ్మానందం ట్యూన్ పాడి.. ఇదెలా ఉందని పక్కనఉన్నోడిని అడిగితే.యాజ్ ఇటీజ్‌గా ఉందని అంటాడే.. అలానే ఇప్పుడు చంద్రముఖి 2 కూడా ఉంది. అసలు ఇది చంద్రముఖి సినిమాకు రీమేకా? డబ్బింగ్? సీక్వెలా? అన్నది అర్థమే కాదు. మరీ నాసిరకంగా ఉంది. అసలు కథ ఏంటో ఓ సారి చూద్దాం.

    చంద్రముఖి కథలో గంగను విడిచి దెయ్యం పోతుంది. ఆ ఇంట్లో నుంచి పాము కూడా వెళ్లిపోతుంది. పదిహేడేళ్ల తరువాత అన్నట్టుగానే ఈ కథ సాగుతుంది. ఆ ఇంటిని బసవయ్యకు ఇచ్చి ఈశ్వర్ ఎటో వెళ్లిపోయాడన్నట్టుగా సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఇక ఆ ఇంట్లోకి రంగనాయకి (రాధిక) ఫ్యామిలీ వస్తుంది. వారి కుల దైవాన్ని పట్టించుకోకపోవడంతో కుటుంబంలో సమస్యలు వచ్చాయని రంగనాయకి తెలుసుకుంటుంది.

    ఆ గుడిని, కుల దేవతను పూజించేందుకు ఆ కుటుంబం ముందుకు వస్తుంది.కానీ ఆ పూజలు చేసేందుకు చంద్రముఖి ఒప్పుకోదు. అడ్డు పడుతుంటుంది. వేట్టయ్య కోసం చంద్రముఖి ఎదురుచూస్తుంటుంది? అసలు ఈ వేట్టయ్య ఎవరు? చంద్రముఖికి వేట్టయ్య మధ్య జరిగిన కథ ఏంటి? మదన్, వేటయ్య, సింగోటయ్యగా లారెన్స్ పాత్ర ఏంటి? అన్నదే కథ

    చంద్రముఖి 2 కథ ఏ మాత్రం కొత్తగా సాగదు. చాలా చెత్త కథ,కథనాలతో తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది. అవుట్ డేటెడ్ కథతో,మరీ అవుట్ డెటెడ్ స్క్రీన్ ప్లేతో వాసు రాసుకున్న ఈ స్టోరీ ప్రేక్షకులకు తలపోటు తెప్పిస్తుంది. కథలో ఓ ఫ్లో అంటూ కనిపించదు. ఏ పాత్రకు ఏ పాత్ర ఏమవుతుందో కూడా అంత క్లారిటీగా అనిపించదు.

    ఏ కారెక్టర్‌ను పూర్తిగా వాడుకున్నట్టు అనిపించదు. ఏ ఎమోషన్‌ను ప్రేక్షకుడికి కనెక్ట్ చేసినట్టుగా కనిపించదు. కనీసం పిల్లలతో ఏదైనా లైన్ రాసుకున్నా బాగుండేదేమో అనిపిస్తుంది. ఆ పిల్లలకు హీరోకు ఎందుకు అంత బాండింగ్ అన్నది కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. అసలు ఇలా చెప్పుకుంటూ పోతే ఏ సీన్‌లోనూ లాజిక్ గానీ మ్యాజిక్ గానీ ఉండదు.

    ఫ్లాష్ బ్యాక్ సీన్, రాజా గెటప్ ఓకే అనిపిస్తుంది. కానీ అందులోనూ అతి అనిపిస్తుంది. కంగనాను అయితే చంద్రముఖిగా అస్సలు ఊహించుకోలేం.నడుం పట్టేసుకున్నట్టుగా ఆ నడక ఒకటి చిరాగ్గా అనిపిస్తుంది. నృత్యం చేస్తున్న ఫీలింగ్ కూడా రాదు. అదేదో పిచ్చిగెంతుల్లా అనిపిస్తాయి. జ్యోతిక ఆకాశంలో ఉంటే కంగనా పాతాళంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. జ్యోతిక నటన గానీ, డ్యాన్స్ గానీ అందరినీ ఇప్పటికీ వెంటాడుతాయి. కానీ కంగనా మాత్రం థియేటర్లోంచి ప్రేక్షకుల్ని పరిగెత్తేలా వెంటపడతాయి.

    లారెన్స్ అతి కూడా బోర్ కొట్టిస్తుంది. వడివేలుని చూస్తే నవ్వు కాదు కదా.. జాలి వేస్తుంది. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకుని కూడా వేస్టే. వీటన్నంటిలోకెల్లా కాస్త ఉపశమనం కలిగించేది ఏదైనా ఉందంటే.. కంగనా, లారెన్స్ కత్తి యుద్దం. చివర్లో ఈ ఇద్దరూ పోటాపోటీగా కత్తి తిప్పారు.

    కీరవాణి సంగీతం, ఆయన పాటలు ప్రేక్షకుడికి సహన పరీక్షలా అనిపిస్తాయి. మొదటి పార్టులో ఎంత మంచి పాటలున్నాయో.. ఈ సినిమాలో అంత పరమ చెత్త పాటలున్నాయి. ఏ ఒక్కటీ వినసొంపుగా ఉండదు. ఆర్ఆర్ కూడా అద్భుతంగా అనిపించదు. విజువల్స్ ఓకే అనిపిస్తాయి. గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ అయితే అమీర్ పేట్‌లోనే బాగా చేస్తారనిపించింది. ఆ కుక్కలను మరీ దారుణంగా చూపించారు. టెక్నికల్ ఈ సినిమా అథమస్థాయిలో ఉందనిపిస్తుంది. ఈ మూవీతో నిర్మాతకు భారీ లాస్ వచ్చేలానే ఉంది.

    చివరగా.. చంద్రముఖి టూ(2).. బాక్సాఫీస్ వద్ద ఫట్టు

    రేటింగ్ : 2