పరదా మూవీ రివ్యూ.. థియేటర్లో కష్టమే

పరదా మూవీ రివ్యూ.. థియేటర్లో కష్టమే

    అనుపమ, దర్శన, సంగీత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పరదా’. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్ట్ 22న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఆడియెన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంది? అన్నది చూడాలి.

    కథ
    పడతి అనే గ్రామంలో అమ్మాయిలంతా కూడా పరదా వేసుకునే ఉంటారు. భర్త, తండ్రి, ఇంటి వాళ్లకు మాత్రమే మహిళలు మొహాల్ని చూపించాలి. మిగతా ఎవ్వరికీ కూడా మొహాన్ని చూపించకుండా పరదా వేసుకోవాలి. ఆ నియమాన్ని తప్పి ఆ ఊరి గ్రామ దేవత జ్వాలమ్మకి కోపం వస్తుందని ఆ ఊరి జనాల నమ్మకం. పరదా తీస్తే ఊరికి శాపం తగిలి గ్రామంలో మళ్లీ బిడ్డలు ఎవ్వరూ పుట్టరని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. అలా ఓ సారి సుబ్బు (అనుపమ) మొహాన్ని ఒకరు తెలియకుండా ఫోటో తీసి మ్యాగజైన్‌లో వేస్తారు. దీంతో సుబ్బుని బలి ఇవ్వాలని ఊరు సిద్ద పడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? తాను ఏ తప్పు చేయలేదని, పరదాను తీయలేదని సుబ్బు నిరూపించుకునేందుకు ఏం చేస్తుంది? ఈ ప్రయాణంలో సుబ్బ అత్త రత్న (సంగీత),  అమిష్ట (దర్శన) పాత్ర ఏంటి? చివరకు సుబ్బు ఏం చేస్తుంది? అన్నది కథ.

    విశ్లేషణ
    పరదా మూవీ కథ పూర్తిగా కల్పితమే. అయితే ఆచారాల పేరిట మహిళల్ని ఎలా అణిచి వేస్తుంటారు.. ఎలా హద్దుల్లో పెడుతుంటారు.. సమాజంలో వారి స్వేచ్ఛను ఎలా హరిస్తుంటారు? అనేది ఇందులో చర్చించే ప్రయత్నం చేశారు. పడతి గ్రామంలో మహిళలు పరదాలు వేసుకునే ఉంటారు.. పొరబాటున పరదా తొలిగిపోయినా.. మొహాన్ని ఎవరికైనా చూపించినా కూడా ఆత్మాహుతి అంటూ ప్రాణాలు తీస్తుంటారు.

    అలాంటి ఊరి నుంచి బయటకు వచ్చిన సుబ్బు.. ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది.. పరదానే తనను రక్షిస్తుందనే భ్రమలో ఉన్న సుబ్బుకి ఏం జరుగుతుంది? అసలు బయట సమాజం ఎలా ఉంది? లోకంలో స్త్రీలు ఎంతగా ముందుకు వెళ్తున్నారు..? అసలు స్వేచ్చ అంటే ఏంటి? ఎలా బతకాలి? అన్నది సుబ్బు తెలుసుకునే క్రమం అంతా కూడా సెకండాఫ్‌లో సాగుతుంది.

    సుబ్బు ప్రయాణాన్ని చూసే ఆడియెన్స్‌కి అంత ఇంట్రెస్ట్ కలగకపోవచ్చు.. ఇంత బోరింగ్‌గా, నిదానంగా, ఏదో హిత భోద చేస్తున్నట్టుగా ఉందే అనే ఫీలింగ్ కలగొచ్చు. బలమైన ఎమోషన్, బిగి సడలని కథనం, నెక్ట్స్ ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ రేపేలా కథనం సాగితేనే ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. ఇందులో అవేవీ కూడా కనిపించవు. కల్పిత కథకు.. సరైన ఎమోషన్స్ కలిస్తేనే సక్సెస్ వస్తుంది.

    బాహుబలి కల్పిత కథే.. కానీ ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.. ప్రతీ ఎమోషన్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది.. అలా పరదా చిత్రం ఎమోషనల్ కనెక్టివిటీ లేకుండా ముందుకు సాగుతుంది. స్త్రీ స్వేచ్ఛ, మహిళా సాధికారత గురించి ఇంకాస్త ఎమోషనల్ టచ్‌తో చెప్పాల్సింది. ఇంట్లో భార్య లేకపోతే భర్త నిజంగానే అంత ఇబ్బంది పడతాడా? అని అంటే సమాధానం చెప్పలేం. ప్రతీ ఇంట్లో అలానే ఉంటుందని కూడా చెప్పలేం. క్లైమాక్స్ ఇంకాస్త ఎమోషనల్‌గానూ పెట్టి ఉండొచ్చు.. కానీ దర్శకుడు ఆ దారిని ఎంచుకోలేదనిపిస్తుంది.

    సాంకేతికంగా చూసుకుంటే పరదాకి మంచి బీజీఎం పడింది. పాటలు కూడా బాగానే అనిపిస్తాయి. గోపీ సుందర్ ఈ కథకు న్యాయం చేశాడు. ప్రవీణ్ కాండ్రేగుల తన టీంను బాగానే వాడుకున్నాడు. విజువల్స్ గొప్పగా కనిపిస్తాయి. ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉంటే బాగుండేదనిపిస్తుంది. డైలాగ్స్ కొన్ని చోట్ల ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఇలాంటి చిత్రాలు థియేటర్లో ఆడటం కష్టమే అనిపిస్తుంది. ఓటీటీలోకి వచ్చిన తరువాత పరదా గురించి అందరూ చాలానే మాట్లాడుతారనిపిస్తోంది.

    నటీనటుల విషయానికి వస్తే అనుపమ సుబ్బు పాత్రలో ఆకట్టుకుంది. చాలా చోట్ల మొహం కనిపించకుండానే.. సీన్లను ముందుకు తీసుకెళ్లింది. అనుపమ లుక్స్, అమాయకత్వం, నటన ఇవన్నీ ఈ చిత్రానికి ప్రధాన బలాలే. దర్శన రాజేంద్రన్ ఉన్నంతలో మెప్పించింది. సంగీత పాత్ర బాగుంటుంది. ఆమె పాత్రతో పండించిన కామెడీ బాగుంటుంది. హర్ష వర్దన్ కారెక్టర్ కూడా నవ్విస్తుంది. ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి.

    పరదా.. పర్వాలేదు

    రేటింగ్ 2.5