• July 1, 2022

10th క్లాస్ డైరీస్ రివ్యూ.. గతాన్ని గుర్తుకు చేస్తుంది

10th క్లాస్ డైరీస్ రివ్యూ.. గతాన్ని గుర్తుకు చేస్తుంది

    10th Class Diaries Review (10th క్లాస్ డైరీస్ మూవీ రివ్యూ) హీరో శ్రీరామ్ చాలా రోజుల తరువాత ఓ ప్రేమకథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 10th క్లాస్ డైరీస్ అంటూ శ్రీరామ్, అవికా గోర్‌లు, గరుడవేగ అంజి తెరకెక్కించిన ఈ చిత్రం నేడు (జూలై 1) విడుదలైంది. అజయ్‌ మైసూర్‌ సమర్పణలో అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.

    కథ
    ఈ కథ రాజమండ్రి చుట్టూ తిరుగుతుంది. 1997వ సంవత్సరంలో జరిగిన ఓ ఘటనతో కథ మలుపు తిరుగుతుంది. పదో తరగతి చదువుతున్న సోమయాజి అలియాస్ సోము (శ్రీరామ్), చాందినీ (అవికా గోర్)లు ప్రేమించుకుంటారు. కానీ వారు విడిపోవాల్సి వస్తుంది. ఆ తరువాత సోము తన జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తాడు. విదేశాల్లో స్థిరపడతాడు.పెళ్లి చేసుకుంటాడు. కానీ ఏ మాత్రం సంతృప్తిగా అనిపించదు. కట్టుకున్న పెళ్లాం కూడా వదిలేసిపోతుంది. అయితే తన జీవితంలోని ఈ అసంతృప్తికి తన చిన్న నాటి ప్రేయసి చాందినీ అని తెలుసుకుంటాడు. ఆమె కోసం ఇండియాకు వస్తాడు. ఆ తరువాత ఏమైంది? అసలు చాందినీ ఏమైంది? చాందినీని సోము కలిశాడా? లేదా? అన్నదే కథ.

    సోము పాత్రలో శ్రీరామ్ పర్వాలేదనిపించాడు. తనకు అలవాటైన ఈ లవర్ బాయ్ కారెక్టర్లను ఈజీగా చేసేశాడు. ఇక అవికా గోర్ మాత్రం డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించింది. అయితే ఈ చిత్రంలో అందరినీ దృష్టి మాత్రం ఓ నటుడు మీద పడుతుంది. గౌరవ్ పాత్రలో కనిపించిన వెన్నెల రామారావు అందిరినీ ఆశ్చర్యపరుస్తాడు. తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. ఈ చిత్రానికి నిర్మాత అయిన వెన్నెల రామారావు.. తనలోని నటుడుని బయటకు తీశాడు. అందరినీ మెప్పించాడు. ఇక శ్రీనివాస్ రెడ్డి తనకు అలవాటైన పాత్రలో దూరిపోయాడు. శివ బాలాజీ, హిమజ, అర్చన, నాజర్ వంటివారు తమ పరిధి మేరకు నటించారు.

    స్కూల్ ఏజ్‌లో లవ్ స్టోరీలు ఎలా ఉంటాయో ఇది వరకే ఎన్నో చిత్రాల్లో చూపించారు. అప్పటి సీన్లు ఇప్పుడు చూస్తే కాస్త సిల్లీగా అనిపించినా.. అవి నాటి జనరేషన్ వాళ్లకు మాత్రం తీపి గుర్తుల్లా అనిపిస్తాయి. ఇక్కడా కూడా అదే అనిపిస్తుంది. దర్శకుడు ఆ సీన్లను బాగా తీశాడు. స్కూల్ ఏజ్ లవ్ స్టోరీలు ఎప్పటికీ బోర్ కొట్టవని మరోసారి నిరూపించాడు.

    అయితే ఈ చిత్రంలో దర్శకుడు ఇరికించిన కామెడీ కూడా బాగానే కనెక్ట్ అవుతుంది. మొత్తానికి కామెడీ ట్రాక్ వర్కవుట్ అయింది. ఇక ఈ చిత్రంలోని ఫీల్ మాత్రం అంతగా జనాలకు ఎక్కినట్టు అనిపించదు. ప్రేమలోని గాఢత ఈ చిత్రంలో కనిపించలేదు. అందుకే తెరపై హీరో హీరోయిన్లు ఎమోషన్లు పండించినా ప్రేక్షకుడు వాటికి కనెక్ట్ అయినట్టు అనిపించదు.

    ఇక తెరపై విజువల్స్ మాత్రం అద్భుతంగా కనిపిస్తాయి. పాటలు అలా ఫ్లోలో వచ్చి వెళ్తుంటాయి. కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్లు తమ బాధ్యతను పూర్తిగా నిర్వర్తించారు. నిర్మాణ విలువలు మాత్రం ఓ లెవెల్‌లో ఉన్నాయి. సెకండాఫ్‌లోని సీన్లు, ఆ నేషర్ విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి తెరపై కనిపిస్తుంది.

    చివరగా.. 10th క్లాస్ డైరీస్.. గతాన్ని గుర్తుకు చేస్తుంది

    రేటింగ్ : 3