- February 3, 2023
Rebels Of Thupakulagudem Movie Review : రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ.. రియలిస్టిక్‌గా అనిపించే చిత్రం

కొత్త మొహాలతో, కొత్త దర్శకుడు, కొత్త జానర్‌తో సినిమాలు తీస్తే పెద్దగా అంచనాలు ఉండవు. కానీ రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమాకు దర్శక నిర్మాతలు కొత్తవారే. నటీనటులు కూడా కొత్త వారే. ఇలా దాదాపు నలభై మంది కొత్త వారు కలిసి చేసిన ఈ చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.
కథ
తుపాకులగూడెంలో ఈ కథ జరుగుతుంది. నక్సలైట్లు లొంగిపోతే మూడు లక్షల డబ్బు, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని గవర్నమెంట్ ప్రకటిస్తుంది. దీంతో ఓ బ్రోకర్ తుపాకుల గూడెంలోని యువత మీద కన్నేస్తుంది. అక్కడి పెద్ద రాజన్న (ప్రవీణ్ కండెలా) ఈ విషయాన్ని కుమార్ (శ్రీకాంత్ రాథోడ్)కు అప్పగిస్తాడు. సర్కారు ఉద్యోగం ఫ్రీగా ఇవ్వలేని తలా ఒక లక్ష ఇవ్వాలని, వంద మంది దగ్గర ఆ బ్రోకర్ కోటి వసూల్ చేస్తాడు. అయితే ఆ తరువాత బ్రోకర్ కనిపించకుండా పోతాడు. నక్సలైట్ల వేషంలో అడవిలోకి వెళ్లిన ఈ గ్యాంగ్‌కు ఏమైంది? పోలీసులు వారిని ఏం చేశారు? ఈ కథలో రాజన్న, కుమార్‌లు చేసిన పనులేంటి? చివరకు ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించారా? అనేది తెలియాలంటే థియేటర్లో చూడాల్సిందే.
నటీనటులు
ఈ సినిమాలో రాజన్న, కుమార్, శివన్న, క్రాంతి, మమత పాత్రలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. రాజన్నగా ప్రవీణ్ కండెలా ఎంతో ఎమోషనల్‌గా నటించేశాడు. కుమార్ యాక్టింగ్ అందరినీ మెప్పిస్తుంది. అన్ని రకాల సీన్లలో ఈ ఇద్దరూ మెప్పించారు. ఇక మమతగా నటించిన జయేత్రి ఎంతో సహజంగా కనిపిస్తుంది. అందం, నటనలోనూ అందరినీ కట్టి పడేస్తుంది. నరసింహగా శరత్, స్వామిగా వంశీ ఉటుకూరు, చమురుగా వినీత్, గోటియాగా విజయ్, ఎల్ ఐ సీగా వారణాసి కిషోర్, ఆర్ఎంపీ పాత్ర, వడ్డి వాసుగా రాజ శేఖర్, మొగిలిగా మ్యాగీ ఇలా అందరూ తమ పరిధి మేరకు మెప్పించారు.
విశ్లేషణ
రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం సినిమా యథార్థ ఘటనలతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కథకు తెలంగాణ నేటివిటీని అద్దారు. ఇందులో చూపించిన మనుషులు, ప్రాంతాలు, వారు వాడిన భాషను ఎంతో అథాంటిక్‌గా చూపించారు. కుర్రాళ్లతో పలికించిన మాటలు, ఆ యాస పర్ఫెక్ట్గా ఉంది. సహజంగా చూపించే విషయంలో దర్శకుడు జైదీప్ సక్సెస్ అయ్యాడు. కథను అన్ని రకాల ఎమోషన్స్ ఉండేలా రాసుకోవడంతో సంతోష్ సఫలం అయ్యాడు.
ప్రథమార్థం అంతా కూడా సాఫీగా సాగుతుండటం, సరదా సన్ని వేశాలు ఎక్కువగా ఉండటంతో సులభంగా గడిచేస్తుంది. అయితే ద్వితీయార్థంలో ఈ చిత్రం ఎమోషనల్‌గా సాగుతుంది. నిడివి సమస్య కూడా ఈ సినిమా లేకపోవడం ప్లస్సే.
ఇక ఈ చిత్రంలో మణిశర్మ సంగీతం, ఆర్ఆర్ అద్భుతంగా అనిపిస్తుంది. ఆర్ఆర్తో సినిమాలోని సీన్స్ మరింత అద్భుతంగా ఎలివేట్ అయ్యాయి. ఇచ్చిన పరిమితమైన వనరులతోనే కెమెరామెన్ అద్భుతం చేశాడు. కెమెరా పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. శ్రీకాంత్ అరుపుల కెమెరా వర్క్ బాగుంది.
రేటింగ్ : 3