- July 26, 2024
రాజ్ పురుషోత్తముడు రివ్యూ.. పాత కథే కానీ నవ్వించేశారు!

రాజ్ తరుణ్ గత కొన్ని రోజులుగా వివాదాలతో వార్తల్లో ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు మూవీ థియేటర్లోకి వచ్చింది. ఆయన హీరోగా నటించిన పురుషోత్తముడు సినిమా ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. రామ్ భీమన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్‌కి జోడీగా హాసినీ సుధీర్ హీరోయిన్‌గా నటించింది. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్ పతాకంపై డా రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మించారు. నేడు(జులై 26)న విడుదలైన ఈ సినిమా ఆకట్టుకునేలా ఉందా? లేదా? ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
పురుషోత్తముడు కథ పరంగా చూసుకుంటే.. డబ్బులో పుట్టి పెరిగిన ఓ శ్రీమంతుడు.. తన ఐడెంటీని దాచుకుని ఊర్లోకి వచ్చి, పేద ప్రజల మధ్యన బతకడం అనేదే పాయింట్. మన హీరో విదేశాల నుంచి వచ్చి వారసత్వంగా వస్తున్న కంపెనీ సీఈవో పదవిని చేపట్టాలనుకుంటాడు. కానీ ఆ పదవికి పోటీ ఏర్పడుతుంది. ఆ పోటీలోనెగ్గేందుకు మన హీరో తన ఐడెంటినీ ఓ వంద రోజులు దాచి పెట్టుకోవాల్సి వస్తుంది.. డబ్బుకు దూరంగా బతకడమనే ఈ ఛాలెంజ్‌లో హీరోకి ఎదురైన పరిస్థితులు ఏంటి? సకల సౌకర్యాలు వదిలేసుకుని ఓ మారుమూల గ్రామానికి వెళ్లిన హీరోకి ఎదురైన ఘటనలు, ప్రేమ, పోరాటం, గొడవల కథ ఏంటి? చివరకు హీరో సీఈవోగా మారాడా? అన్నదే కథ.
పురుషోత్తముడు లాంటి కథలు మనకు కొత్తేమీ కాదు. తెలిసిన కథే అయినా ఎంగేజింగ్‌గా, ఎంటర్టైనింగ్‌గా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమాను నడిపించేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చకచకా జరిగినట్టు అనిపిస్తుంది. హీరో విదేశాల నుంచి రావడం, సీఈవో సీటు కోసం పోటీ.. ఆ తరువాత వెంటనే చాలెంజ్‌లో భాగంగా ఊరు, పేరు మారిపోవడం, ఓ గ్రామంలోకి రావడం, అక్కడ ప్రేమతో పాటు కొన్ని సమస్యలు రావడం ఇలా వేగంగా సినిమా కదులుతుంది.
సెకండాఫ్‌లో ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఎక్కడా కొత్తదనం లేకపోయినా కూడా ఆద్యంతం అలరించేలా ఉంది. నటుడు ప్రవీణ్ కామెడీ బాగా ప్లస్ అయింది. ఆర్టిస్టులకు తోడుగా టెక్నీకల్ టీం కుదిరింది. మంచి విజువల్స్.. మంచి ఆర్ఆర్ తోడైంది. నిర్మాణ విలువలు చక్కగా ఉన్నాయి. పెట్టిన డబ్బులకు సరిపడా వినోదాన్ని ఇచ్చే పురుషోత్తముడు.
రిచ్, పూర్ ఇలా రెండు యాంగిల్స్‌లో రాజ్ తరుణ్ మెప్పిస్తాడు. కానీ యాక్షన్ సీక్వెన్స్ కాస్త ఓవర్ అయినట్టుగా కనిపిస్తుంది. నటుడిగా ఎప్పటిలాగే మెప్పించాడు. అమ్ములుగా హాసినీ సుధీర్ ఆకట్టుకుంటుంది. రమ్యకృష్ణ ప్రారంభంలో నెగటివ్ షేడ్ ఉన్న పాత్రగా కనిపించి, చివర్లో పాజిటివ్‌గా కనిపించిన తీరు బాగుంది. రెండు వేరియేషన్లలో మెప్పించింది. మురళీశర్మ తనకు కొట్టొచ్చిన పాత్రలో చేసుకుంటూ వెళ్లిపోయాడు. బ్రహ్మానందం కాసేపు మెరిసి నవ్వించాడు. బ్రహ్మాజీ సైతం అమాయక లాయర్‌గా అలరించారు. రచ్చ రవి పాత్ర ఆకట్టుకుంది. ఇక ప్రవీణ్ కామెడీ చాలా రోజుల తర్వాత బాగా వర్కౌట్ అయ్యింది. బాగా నవ్వించింది. పోలీస్ గా రాజా రవీంద్ర నెగటివ్ షేడ్ పాత్రలో కనిపించి మెప్పించాడు. ముఖేష్ ఖన్నా చివర్లో మెరిశాడు. ప్రకాష్‌రాజ్ పాత్ర కూడా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది.
రేటింగ్ 3