- August 3, 2025
యూనియన్లను బాయ్ కాట్ చేయాలి – నిర్మాత అహితేజ

టాలీవుడ్ ప్రస్తుతం ఎలాంటి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోల చిత్రాలకే ఓటీటీ డీల్స్ అవ్వడం లేదు. మిడ్ రేంజ్ హీరోల చిత్రాల్ని కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చిన్న చిత్రాలు కూడా అరకొరగా హిట్ అవుతున్నాయి. అవి హిట్ అయినా కోట్లకు కోట్లు లాభాలు తెచ్చే పరిస్థితి ఉండటం లేదు. అలా తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుతం నత్తనడకన సాగుతోంది.
ఇలాంటి టైంలో టాలీవుడ్ వర్కర్లు, యూనియన్ సంఘాలు వేతనాలు పెంచాలని డిమాండ్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారికి అనుకూలంగా ఎంప్లాయిస్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. ముప్పై శాతం వేతనాలు పెంచి ఇస్తేనే విధులకు హాజరు అవ్వాలని చెప్పింది. అయితే దీనిపై నిర్మాత అహితేజ అభ్యంతరం వ్యక్తం చేశాడు.
మెజారిటీ చిత్రాలకు ఓటీటీ, డిజిటల్, థియేట్రికల్ బిజినెస్ కూడా జరగడం లేదు.. కానీ యూనియన్స్, వర్కర్లకు మాత్రం 30 శాతం హైక్స్ అంట.. పైగా చిన్న, పెద్ద చిత్రాలకు ఒకే రకమైన హైక్ అంట.. ఇక యూనియన్లను నిర్మాతలు బాయ్ కాట్ చేసి, ఫ్రీలాన్సర్లతో పని చేసుకోవాల్సిన టైం ఇది అని అన్నాడు.
పెద్ద సినిమా టికెట్స్ రేట్ల మీద చేసే కాన్సన్‌స్ట్రేషన్, చిన్న నిర్మాతల మీద చేస్తే ఏడాదికి 160 మంది చిన్న నిర్మాతలు బతుకుతారు.. వాళ్లే చాలా మందికి ఉపాధి కల్పిస్తారు అని అహితేజ ట్వీట్ వేశారు. మరి ఈ ట్వీట్‌ను టాలీవుడ్ పట్టించుకుంటుందా? లేదా? అన్నది చూడాలి. ఇక అహితేజ నిర్మించిన శశి వదనే అనే చిత్రం త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే.