- July 11, 2025
8 వసంతాలు కాదు.. 12 వసంతాలు.. మొత్తం స్క్రిప్ట్ పెడతానన్న ఫణీంద్ర

ఫణీంద్ర నర్సెట్టి తీసిన ‘8 వసంతాలు’ సినిమాకు మంచి పేరు వచ్చింది. ప్రశంసలు అయితే దక్కాయి కానీ కాసులు మాత్రం రాలలేదనిపిస్తోంది. కమర్షియల్‌గా ఈ చిత్రం అంతగా వర్కౌట్ కాలేదని సమాచారం. మరి ఓటీటీ, డిజిటిల్ శాటి రైట్ హక్కులతో ఈ చిత్రానికి అంతో ఇంతో లాభాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పరంగా ఈ మూవీకి హిట్ స్టేటస్ అయితే దక్కినట్టుగా కనిపించడం లేదు.
ఇక 8 వసంతాలు వివాదాలు పక్కన పెడితే.. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్‌లోకి వచ్చింది. తాజాగా దర్శకుడు ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాల్ని పంచుకున్నారు. ‘8 వసంతాలు’ కాకుండా స్క్రిప్ట్ దశలో ఈ మూవీని ‘12 వసంతాలు’ అని మొదలు పెట్టారట. అలా 12 వసంతాలు చివరకు 8 వసంతాలు రూపాంతంరం చెందిందట. 12 వసంతాలు మొత్తం స్క్రిప్ట్‌ని పీడీఎఫ్ రూపంలో పెడతాను అని, టైం ఉన్నప్పుడు అందరూ చదవండని ఫణీంద్ర కోరారు.
12 వసంతాలు స్క్రిప్ట్‌లో ఇంకా ఎన్నో అద్భుతమైన పాత్రలున్నాయని అన్నాడు. వరుణ్ చెల్లి ఇష్టా.. వారణాసి ఎపిసోడ్‌లో ఉమర్, రాము, మమత ఇలా చాలా పాత్రలున్నాయట. శుద్ది అయోధ్య పాత్రను చాలా కట్ చేశానని, ఇంకా సీన్లు ఉన్నాయని, తాజ్ మహల్ సీన్, వారణాసి ఫైట్ సీన్‌లో చాలా మిస్ అయిందని చెప్పుకొచ్చారు.
రాణి మాలిని కథ అయితే కేవలం ‘8 వసంతాలు’ కోసమే రాసుకున్నారట. 12 వసంతాలు స్క్రిప్ట్‌లో ఓ మెయిన్ హైలెట్ పాయింట్ ఉందట. సెకండాఫ్‌లో వరుణ్‌కి శుద్ది అయోధ్య కౌంటర్లు ఇస్తారట. గన్ పాయింట్‌లో పెట్టి తూటాలు పేల్చినట్టుగా మాట్లాడుతుందట. మరి ఈ పూర్తి స్క్రిప్ట్‌ను ఫణీంద్ర ఎప్పుడు షేర్ చేస్తారో చూడాలి.