• October 4, 2024

మిస్టర్ సెలెబ్రిటీ రివ్యూ.. అందరికీ ఓ కనువిప్పు

మిస్టర్ సెలెబ్రిటీ రివ్యూ.. అందరికీ ఓ కనువిప్పు

    పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. చందిన రవి కిషోర్ దర్శకత్వం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీ అక్టోబర్ 4న రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్లు మంచి బజ్‌నే క్రియేట్ చేశాయి. వాటిని చూస్తే ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు పాత్రల ప్రాధాన్యం తెలుస్తుంది. అసలు ఈ సినిమా కథ ఏంటో ఓ సారి చూద్దాం.

    కథ
    లక్కీ (సుదర్శన్) సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. యూట్యూబ్‌లో రకరకాల వీడియోలు చేసి ఫేమస్ అవుతుంటాడు. లలిత (శ్రీ దీక్ష) సోషల్ యాక్టివిస్ట్. అందరికీ సాయం చేసేందుకు ముందుకు వస్తుంటుంది. అయితే లలితకు పదే పదే కలలు వస్తుంటాయి. ఆ కలలో ఆమెపై అత్యాచారం జరిగినట్టుగా అనిపిస్తుంది. గాయం గుర్తులు కూడా ఉంటాయి. కలలో తన మీద అత్యాచారం జరిగిందని పోలీసులకు కంప్లైంట్ చేస్తుంది. ముందుగా ఈ కేసుని ఎస్సై నరహరి (రఘుబాబు) లైట్ తీసుకుంటాడు. కానీ ఈ కేసు వెరైటీగా ఉంది పరిష్కరిస్తే సెలెబ్రిటీ అవ్వొచ్చు అనే ఉద్దేశంలో కేసుని తీసుకుంటాడు. కలలో లలిత ఓ ఫేస్‌ను చూస్తుంది. ఆ పోలికలతో ఓ బొమ్మను గీయిస్తే అది లక్కీ ఫోటోగా వస్తుంది. దీంతో పోలీసులు లక్కీని లాక్కొచ్చి జైల్లో పారేస్తారు. నిద్రలో రేప్? ముట్టుకోకుండా రేప్? ఇదెలా సాధ్యం అంటూ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో లక్కీ, లలిత, ఎస్సై నరహరి పేర్లు ట్రెండ్ అవుతాయి. అలా ఈ ముగ్గురూ సెలెబ్రిటీలు అవుతారు. అసలు లలితకు అలాంటి కలలు ఎందుకు వచ్చాయి? అలా ఎవరు చేయించారు? లక్కీని ఎందుకు ఇరికించారు? ఈ కథలో వరలక్ష్మీ పాత్ర ఏంటి? సైంటిస్ట్ పద్మశ్రీ రామచంద్రయ్య (నాజర్), జానకి (ఆమని)ల కథ ఏంటి? చివరకు ఏం జరిగింది? అన్నది కథ.

    నటీనటులు
    సుదర్శన్ కొత్త వాడే అయినా చక్కగా నటించాడు. మొదటి సినిమా అవ్వడంతో ఆ బెరుకు, భయం కాస్త కనిపిస్తుంది. డ్యాన్సులు, యాక్షన్ సీక్వెన్సు‌లు పర్వాలేదనిపిస్తాయి. శ్రీ దీక్ష తెరపై అందంగా కనిపిస్తుంది. నటిగానూ ఓకే అనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నరహరి పాత్రలో రఘుబాబు నవ్వించే ప్రయత్నం చేస్తాడు. సప్తగిరి అలా మెరిసి మాయం అవుతాడు. నాజర్, ఆమని పాత్రలు ఎమోషనల్‌గా ఉంటాయి. ఈ ఇద్దరూ ఎంతో చక్కగా నటించారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ కొత్త పాత్రలో కనిపించి మెప్పిస్తుంది. మిగిలిన పాత్రలన్నీ ఓకే అనిపిస్తాయి.

    విశ్లేషణ
    మిస్టర్ సెలెబ్రిటీ టీజర్, ట్రైలర్ చూస్తే పాయింట్ ఏంటి? కథ ఎలా ఉండబోతోందన్నది అర్థం అవుతుంది. తెలిసింది మాట్లాడటం స్వేచ్చ.. తెలియంది మాట్లాడటం నేరం అనే లైన‌ను ముందు నుంచీ ప్రమోట్ చేస్తూనే మేకర్లు ఆడియెన్స్ ముందుకు వచ్చారు.ఓ రూమర్, గాలి మాట, పిచ్చి వాగుడు వల్ల ఎదుటి వాళ్ల జీవితాలకు ఎలాంటి నష్టం, ఎంత బాధ కలుగుతుందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ ప్రయత్నంలో డైరెక్టర్ కొంత మేరకు సఫలం అయినట్టుగానే కనిపిస్తుంది.

    ఫస్ట్ హాఫ్ అంతా లక్కీ ఎంట్రీ.. లలితకు వచ్చే కలలు.. పోలీసు స్టేషనల్ కేసు.. మీడియాలో ఈ ముగ్గురే కనిపించడం.. అలా అలా సీన్లు ముందుకు వెళ్తుంటాయి. ఇంట్రవెల్‌కి కథ హైవే మీదకు వెళ్లినట్టుగా అనిపిస్తుంది. ఈ ముగ్గురిని ఆడిస్తున్న ఓ ముసుగు వ్యక్తి ఎంట్రీ ఉంటుంది. అలా ప్రథమార్దం సో సోగా ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంతో దర్శకుడు చేసిన ప్రయత్నం మెప్పిస్తుంది. ముసుగు వ్యక్తిని పట్టుకునేందుకు ఈ ముగ్గురూ బాగానే కష్టపడతారు. కానీ ఆ ముగ్గుర్ని ఫేమస్ చేసి, సెలెబ్రిటీలను చేసి చంపేస్తా అని ముసుగు వ్యక్తి వార్నింగ్ ఇవ్వడం.. ఆ ముగ్గుర్ని ఇరికించే తీరు.. ఫేమస్ చేసే విధానం.. చివరి 40 నిమిషాలు ఎమోషనల్ బ్లాక్‌ను బాగానే రాసుకున్నాడు.

    టెక్నికల్‌గా చూసుకుంటే మిస్టర్ సెలెబ్రిటీ సినిమాకు సంగీతం కంటే ఆర్ఆర్ బాగుంటుందనిపిస్తుంది. పాటలు అలా వచ్చి వెళ్తుంటాయి. వాటిని చాలా రిచ్‌గా తీశారు. ఫైట్స్ బాగుంటాయి. డైలాగ్స్ చాలా చోట్ల మనసుకు హత్తుకునేలా ఉంటాయి. కెమెరా వర్క్ మెప్పిస్తుంది. నిర్మాతలు పెట్టిన ప్రతీ పైసా, వారు పడ్డ కష్టం అంతా కూడా తెర మీద కనిపిస్తుంది. హీరో దర్శక నిర్మాతలు అంతా కొత్త వాళ్లే అయినా మంచి మూవీని తీసేందుకు పడ్డ కష్టం అందరికీ అర్థం అవుతుంది.

    రేటింగ్ 3