• July 15, 2022

పంచతంత్ర కథలు రివ్యూ.. చక్కని నీతి

పంచతంత్ర కథలు రివ్యూ.. చక్కని నీతి

    నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియ‌, అజ‌య్ వంటి వారితో.. గంగ‌న‌మోని శేఖ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ తెరకెక్కించిన చిత్రం పంచతంత్ర కథలు. మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డి.మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ పంచతంత్ర కథల్లోని సారం ఏంటో ఓ సారి చూద్దాం.

    సినిమా పేరుకు తగ్గట్టుగానే ఇందులో ఐదు కథలుంటాయి. అడ్డ కత్తెర, అహల్య, హ్యాపీ మ్యారిడ్ లైఫ్, నర్తనశాల, అనగనగా అంటూ ఐదు ఎపిసోడ్‌లు సాగుతుంటాయి. ఈ ఐదు ఎపిసోడ్స్‌లో ఒక్కో రకమైన నీతి సందేశాన్ని దర్శకుడు ఇచ్చాడు. దర్శకుడి టేకింగ్‌కు పదునైన మాటలు తోడయ్యాయి. సమాజంలో ఉన్న కొన్ని సమస్యల మీద ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కులాలు, ఆడవారిపై అఘాయిత్యాలు, అక్రమ సంబంధాలు, ప్రేమ, అనుబంధాలు అనే అంశాల మీద దర్శకుడు మంచి సందేశాలను ఇచ్చాడు.

    అలా మొదటి ఎపిసోడ్ అడ్డ కత్తెరలో కులాంతర ప్రేమ మీద పాయింట్ ఎంచుకున్నాడు. ఈ కథలో సత్య, కృష్ణల పాత్రలో కుల సమస్య మీద విమర్శనాస్త్రాలు సంధించారు. ఏ కులం ఎక్కువ.. ఏ కులం తక్కువ కాదు అని చూపించాడు. అందరి కలిసి ఉంటేనే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. ఈ ఎపిసోడ్‌లో నిహాల్, సాదియాలు అద్భుతంగా నటించేశారు. కృష్ణ, సత్య పాత్రలు తెలంగాణ యాసలో అదరగొట్టేశారు.

    రెండో కథలో రాముడు తాకగానే రాయి కాస్త అహల్యగా మారినట్టుగా.. దీంట్లో గౌతమి మారిపోతుంది. గౌతమ్ తన వేశ్య వృత్తిని వదిలి మంచిగా, గౌరవంగా బతుకుదామని అనుకుంటుంది. కానీ సమాజం మాత్రం తన గతాన్ని గుర్తుకు చేస్తూ కాకుల్లా పొడుచుకుతింటారు. ఈ కథలో సమాజం, అది చూసే దృక్ఫథాన్ని ప్రశ్నించినట్టు అనిపిస్తుంది. వేశ్య పాత్రలో ప్రణీత పట్నాయక్ అందరినీ మెప్పిస్తుంది.

    మూడో కథలో ప్రేమ గొప్పదనం చూపించాడు. డబ్బుంటే సంతోషంగా ఉంటామని భ్రమపడేవారికి అదొక కనువిప్పులా ఉంటుంది. సంతోషంగా ఉండాలంటే డబ్బు కాదు ప్రేమ ఉండాలని చూపిస్తారు. ఇక ఇందులో మోడ్రన్ అమ్మాయిగా కృతిక పాత్రలో నందినీ రాయ్ ఆకట్టుకుంటుంది. తన అందం, నటనతో మెప్పిస్తుంది. నోయల్‌కు మరో పాజిటివ్ రోల్ దక్కేసింది.

    నాలుగో కథ కాస్త భిన్నంగా ఉంటుంది. అయితే ఇప్పటి సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రేమకు లింగ బేధం లేదన్నట్టుగా చూపించేశారు. ప్రేమ ఎవరిదైనా ప్రేమే కదా? అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇందులో ఇచ్చిన ట్విస్ట్‌ను అందరూ జీర్ణించుకోలేకపోతారు. ఈ కథలో సాయి రోనక్ తన నటన, లుక్స్‌తో ఆకట్టుకుంటాడు.

    ఇక ఐదో ఎపిసోడ్‌లో వృద్దుల పరిస్థితిని చూపించారు. ఇంట్లో కొడుకులు తమ తల్లిదండ్రులను ఎలా పంచుకుంటారు.. వారిని ఎలా గాలికి వదిలేస్తున్నారు.. ఆ వయసులో వారు పడే బాధ, క్షోభను కమలక్క పాత్రలో గీతా భాస్కర్ అద్బుతంగా చూపించింది. ఇలా ఐదు కథలతో దర్శకుడు ప్రేక్షకులకు మంచి సందేశాలు ఇచ్చారు. మాటల రచయిత రాసిన కొన్ని డైలాగ్స్ అందరినీ హంట్ చేస్తుంటాయి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి.

    రేటింగ్ : 3

    బాటమ్ లైన్ : పంచతంత్ర కథలు.. చెప్పాల్సిన నీతి కథలు