• December 25, 2021

RRR, Radhe Shyamలకు పెద్ద దెబ్బ.. సంక్రాంతి సీజన్ కథ కంచికే!

RRR, Radhe Shyamలకు పెద్ద దెబ్బ.. సంక్రాంతి సీజన్ కథ కంచికే!

    RRR, Radhe Shyam ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం మొత్తం కూడా RRR, Radhe Shyamల వైపు చూస్తోంది. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలపై ఉన్న బజ్ అంతా ఇంతా కాదు. ఆర్ఆర్ఆర్ సినిమా అయితే ఏకంగా ప్రీమియర్స్‌తోనే వన్ మిలియన్ మార్క్ దాటేసింది. ఈ రేంజ్ వసూళ్లు ఇండియన్ సినీ హిస్టరీలోనే ఇంత వరకు ఎవ్వరూ చూడలేదు. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ సైతం అంచనాలు మించేలా ఉంది.

    అసలే సంక్రాంతి సీజన్ అంటే తెలుగు వారికి మహా ప్రీతి. సంక్రాంతి సీజన్‌లోకి వచ్చేందుకు పెద్ద సినిమాలంతా కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తుంటాయి. ఈ క్రమంలోనే సంక్రాంతికి చాలా మంది కర్చీప్‌లు వేసుకున్నారు. మొదట అయితే ఎఫ్ 3, సర్కారు వారి పాట, రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, బంగార్రాజు వంటి సినిమాలన్నీ కూడా సంక్రాంతికి వద్దామని ప్రయత్నించాయి.

    ఇందులో ఎఫ్ 3, సర్కారు వారి పాట వాయిదా వేసుకున్నాయి. రాజమౌళితో తదుపరి సినిమా చేస్తున్న కారణంగా.. మహేష్ బాబు మర్యాద పూర్వకంగా తన సినిమాను సమ్మర్‌కు వాయిదా వేసుకున్నాడు. ఇక దిల్ రాజు అయితే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ నైజాం హక్కులను సొంతం చేసుకున్నాడు. అందుకే తన ఎఫ్ 3 సినిమాను రేసు నుంచి తప్పించేశాడు.

    ఇక భీమ్లా నాయక్ మాత్రం పట్టు వీడలేదు. చాలా రోజుల నుంచి ఇండస్ట్రీ పెద్దలంతా కూడా పవన్ కళ్యాణ్, నిర్మాత నాగ వంశీ, త్రివిక్రమ్ వంటి వారితో చర్చలు జరుపుతూ వచ్చారు. భీమ్లా నాయక్‌ను వెనక్కి పంపేది లేదంటూ పవన్ కళ్యాణ్ అండ్ కో పట్టు బట్టి కూర్చుంది. కానీ చివరకు రాజమౌళి, దిల్ రాజు వంటి వారి మధ్య వర్తిత్వంతో అంతా మారిపోయింది.

    భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరికి వెళ్లింది. అలా ఆర్ఆర్ఆర్‌‌కు జనవరి 7న వచ్చేందుకు రూట్ క్లియర్ అయింది. అయితే భీమ్లా నాయక్ నైజాం హక్కుల్ని కూడా దిల్ రాజే సొంతం చేసుకున్నాడు. అందుకే భీమ్లా నాయక్‌ను వాయిదా వేయాలని దిల్ రాజు మరీ మరీ కోరాడట. మొత్తానికి సంక్రాంతి బరిలో ఆర్ఆర్ఆర్ (జనవరి 7), రాధే శ్యామ్ (జనవరి 14) మాత్రమే నిలిచాయి. అంతా సజావుగా సాగుతుందనే సమయంలో అసలు దెబ్బ పడింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. మన దేశంలోనూ వందకు పైగా ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. మరీ ముఖ్యంగా మహా రాష్ట్రలో పరిస్థితి చేజారి దాటిపోయేలా ఉంది. అందుకే అక్కడి ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను విధించింది. థియేటర్లో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనను అమలు పరిచింది. అంటే ఇక రోజుకు రెండు షోలే. అందులోనూ 50శాతం ఆక్యుపెన్సీయే.

    దీంతో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ వంటి వాటికి పెద్ద దెబ్బ పడ్డట్టు అయింది. ఇంత వరకు హిందీ మార్కెట్, అక్కడి ఆధాయం మీద ఈ రెండు చిత్రాలు ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నాయి. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఏం చేయాలో పాలు పోని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే పరిస్థితి గనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడితే, నైట్ కర్ఫ్యూ నిబంధన పెడితే, మళ్లీ యాభై శాతం ఆక్యుపెన్సీ పెడితే అందరూ తడిగుడ్డలు వేసుకుని పడుకునే పరిస్థితి వస్తుంది. మరి ఈ సంక్రాంతి సీజన్ ఎలా ఉంటుందో చూడాలి.

    Leave a Reply