- July 7, 2023
ఓ సాథియా మూవీ రివ్యూ.. మంచి ప్రేమ కథా చిత్రమ్

ప్రేమ కథా చిత్రాలకు ఆడియెన్స్ నుంచి ఎప్పుడూ మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో ఎక్కువగా లవ్ స్టోరీలే ఉంటాయి. యూత్ ఆడియెన్స్ ఎక్కువగా లవ్ స్టోరీలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఓ సాథియా అనే సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
అర్జున్ (ఆర్యన్ గౌరా) అల్లరిచిల్లరగా తిరిగే ఓ కాలేజ్ కుర్రాడు. అదే కాలేజ్‌కు చెందిన కీర్తి (మిస్తీ చక్రవర్తి)ని తొలిచూపులోనే చూసి ఇష్టపడతాడు. ప్రేమ ప్రయాణం సాఫీగా సాగుతుందనుకునే సమయంలో కీర్తి దూరంగా వెళ్తుంది. కొన్ని రోజులకు కీర్తి హైద్రాబాద్‌లో ఉందని తెలుసుకున్న అర్జున్ ఆమె వద్దకు వెళ్తాడు. అయితే ఆమె రాహుల్ అనే వ్యక్తితో ప్రేమలో పడిందని తెలుసుకుని బాధపడతాడు. అయినా ఆమె ప్రేమ కోసమే పరితపిస్తుంటాడు. ప్రేమ తన దగ్గరకు వచ్చినట్టే వచ్చి వెళ్లిపోతుంటుంది. అయితే అసలు కీర్తి వైజాగ్‌ను వదిలి హైద్రాబాద్‌కు ఎందుకు వెళ్లింది? రాహుల్ ఎవరు? చివరకు అర్జున్ ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది కథ.
నటీనటులు
అర్జున్ పాత్రలో ఆర్యన్ చక్కగా నటించాడు. లవ్ కామెడీ ఎమోషనల్ సీన్స్‌లో మెప్పిస్తాడు. యాక్షన్ సీన్ల జోలికి పోకుండా సహజంగా తెరకెక్కించారు. అర్జున్ పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. నటనతో మెప్పిస్తాడు. చాలా రోజుల తరువాత మిస్తీకి మంచి రోల్ దక్కింది. తన నటన, అందంతో అందరినీ కట్టిపడేస్తుంది. హీరో ఫ్రెండ్స్ పాత్రలు, హీరో నాన్నగా దేవీ ప్రసాద్ నటన బాగుంటుంది. మిగిలిన పాత్రలు తమ పరిధి మేరకు మెప్పిస్తాయి.
విశ్లేషణ
ప్రేమలో ఉండే బాధలు, ప్రేమ కోసం పడే తపన ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ప్రేమలో చిన్న విషయాలకే సంతోషపడతాం, అప్పుడే బాధపడతాం.. ప్రేమించిన వాళ్లు దూరం అవుతున్నారని కన్నీళ్లు పెట్టేసుకుంటాం. అయితే ఈ సినిమాలో ప్రథమార్థం అంతా కూడా హీరో సంతోషపడటం, బాధపడటం మధ్యే జరుగుతుంది. ప్రేమ విషయంలో హీరో విజయం సాధించడంలో ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కు వేసినట్టు అవుతుంటుంది.
ప్రథమార్థం కాస్త నీరసంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక ద్వితీయార్థంలో కథ కాస్త వేగం పుంజుకుంటుంది. అయితే క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. అప్పటి వరకు చూసే సినిమా వేరు అనిపిస్తుంది. హీరోయిన్ పాత్రను చూసే కోణం కూడా మారుతుంది. అలా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది.
సాంకేతికతంగా ఈ సినిమా ఓకే అనిపిస్తుంది. మ్యూజిక్ బాగుంది. పాటలు ఎమోషనల్‌గా సాగుతాయి. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మంచి లొకేషన్స్‌లో పాటలు చిత్రీకరించారు. కొన్ని చోట్ల మాటలు బాగుంటాయి. నిడివి తక్కువే అవ్వడం కలిసి వచ్చే అంశం.
రేటింగ్ 2.75