• February 5, 2023

NTR 30 అప్డేట్ ఇచ్చిన యంగ్ టైగర్.. ఓపెనింగ్ డేట్, రిలీజ్ డేట్ చెప్పిన ఎన్టీఆర్

NTR 30 అప్డేట్ ఇచ్చిన యంగ్ టైగర్.. ఓపెనింగ్ డేట్, రిలీజ్ డేట్ చెప్పిన ఎన్టీఆర్

    డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ లెవ‌ల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్య‌క్రమానికి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా..

    ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ప్రారంభించి, పూర్తి చేసేలోపు దర్శకుడు రాజేంద్ర తల్లిదండ్రులు కాలం చేశారు. సినిమా మీద ఇంత డెడికేషన్‌ ఉన్నందుకైనా ఈ సినిమా మీకోసం హిట్ అవ్వాలి. ఈ తొలి సక్సెస్‌ను వారి తల్లిదండ్రులు చూస్తూనే ఉంటారు. మైత్రీ వాళ్లను నా నిర్మాతలు అని అనేకంటే.. వారు నా శ్రేయాభిలాషులు, నా కుటుంబ సభ్యులు అని చెప్పుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. నేను, కొరటాల శివ వారి మీద జోకులు వేసుకుంటాం. సుడితో వచ్చారని అనుకుంటాం. సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ చేసి.. రెండు హిట్ కొట్టడం వారికే సాధ్యమైంది. అదే ఊపులో అమిగోస్ హిట్ అయి.. హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటున్నాను. ఆశికకు తెలుగు ఇండస్ట్రీ తరుపున స్వాగతం. ఆమె ఇంకా ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించాలి. ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి కారణమైన సాంకేతిక నిపుణులందరికీ థాంక్స్. కళ్యాణ్‌ రామ్ అన్న బాలగోపాలం సినిమా చేశాడు. నాకంటే ఆయనే సీనియర్. మా కుటుంబంలో ఎంత మంది హీరోలున్నా ప్రయోగాలు చేసింది మాత్రం కళ్యాణ్‌ అన్నే. హీరోగా, నిర్మాతగా ఇలా అన్ని రకాలుగా కొత్త ప్రయోగాలు చేస్తూ వచ్చారు. కమర్షియల్ సినిమాలు ఎప్పుడు చేస్తారని అనుకున్నాను. పటాస్, అతనొక్కడే వంటివి చేశారు. బింబిసారాతో పూర్తిగా ఆకలి తీర్చారు. మూడు పాత్రలను పోషించడం ఎంత కష్టమో నాకు తెలుసు. నేను కూడా జై లవకుశలో మూడు పాత్రలు వేశాను. తెలుగు ప్రేక్షకులు మంచి చిత్రాలను ఆదరిస్తారని అందరికీ తెలిసిందే. సినీ అభిమానుల వల్లే ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. ఆర్ఆర్ఆర్ అనేది జక్కన్న విజయం. ఈ క్రెడిట్ అంతా ఆయనకే దక్కాలి. సినిమా అప్డేట్ కోసం మీ ఆరాటం, తాపత్రయం మాకు అర్థమవుతోంది. మీ వల్ల దర్శక నిర్మాతలకు ఒత్తిడి ఏర్పడుతుంది. దాని వల్ల అందరికీ నష్టం కలుగుతుంది. అప్డేట్ ఉంటే.. ఇంట్లో మా భార్య కంటే మీకే ముందుగా చెబుతాం. ఇప్పుడు మనం ప్రపంచ స్థాయిలో ఉన్నాం. మంచి సినిమా అందించాలని అనుకుంటాం. మంచి సందర్భం కోసం చూశాం. ఫిబ్రవరిలో సినిమా(NTR 30)ను ప్రారంభిస్తాం. మార్చి 20న షూటింగ్ ప్రారంభిస్తాం. 2024 ఏప్రిల్ 5న సినిమాను రిలీజ్ చేస్తాం’ అని అన్నారు.

    కళ్యాణ్‌ రామ్ మాట్లాడుతూ.. ‘తెలుగులో ద్విపాత్రాభినయం రాముడు భీముడు సినిమాతో మా తాతగారు చేశారు. ఆ తరువాత అదే టైటిల్‌తో బాబాయ్ కూడా చేశారు. చిరంజీవి గారు ముగ్గురు మొనగాళ్లు అనే సినిమాను చేశారు. ఈ అన్నింట్లో ఒకే కామన్ పాయింట్. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల్లా కనిపిస్తారు. కానీ అమిగోస్‌లో మాత్రం.. యూనిక్ పాయింట్‌ను చూడబోతోన్నారు. మనుషులను పోలిన మనుషులు ఉంటారనే యూనిక్ పాయింట్‌తో ఈ సినిమా రాబోతోంది. ఇది కచ్చితంగా మిమ్మల్ని నిరాశపర్చదు. దర్శకుడు రాజేంద్ర ఓ కొత్త పాయింట్‌ను ఎంచుకున్నాడు. బింబిసారా తరువాత మళ్లీ కొత్త కథ చేయాలని అనుకున్నాను. అలాంటి సమయంలోనే అమిగోస్ కథ విన్నాను. కొత్త కథతో వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. బింబిసారా టైంలో చెప్పినట్టుగానే ఇప్పుడు చెబుతూ ఉన్నాను. ఈ సినిమా మిమ్మల్ని కచ్చితంగా డిజప్పాయింట్ చేయదు. కాలర్ ఎగరేసుకుని చెబుతున్నాను. బ్రహ్మాజీ ఈ సినిమాలో అద్భుతమైన పాత్రను పోషించారు. ఆశికకు తెలుగు ఇండస్ట్రీ తరుపున వెల్కమ్ చెబుతున్నాను. నేను వేసిన ప్రతీ అడుగులో నాకు తోడున్న నా తమ్ముడు, నా గుండెకాయ ఎన్టీఆర్‌కు థాంక్స్. ఫిబ్రవరి 10న ఈ సినిమా రాబోతోంది. కచ్చితంగా మీకు కొత్త అనుభూతినిస్తుంది. కొత్త కమర్షియల్ సినిమాను చూడబోతోన్నారు. జోహార్ ఎన్టీఆర్.. జోహార్ హరికృష్ణ.. జై హింద్’ అని అన్నారు.

    నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ‘మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు వచ్చిన ఎన్టీఆర్ గారికి థాంక్స్. కళ్యాణ్‌ రామ్ గారితో ఎప్పటి నుంచో సినిమాను చేయాలని అనుకున్నాం. ఇప్పుడు కుదిరింది. ఈ చిత్రం బింబిసారా కంటే పెద్ద హిట్ అవుతుంది. ఫిబ్రవరి 10న ఈ సినిమాను చూసి మాకు హ్యాట్రిక్ విజయాన్ని ఇవ్వాలని, హ్యాట్రిక్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

    వై రవి శంకర్ మాట్లాడుతూ.. ‘ఇక్కడకు వచ్చిన తారక్ గారికి, ఆయన అభిమానులకు థాంక్స్. బింబిసారా కంటే పెద్ద హిట్ అవుతుంది. ఫిబ్రవరి 10న ఈ సినిమాను థియేటర్లో చూసి అందరం ఎంజాయ్ చేస్తాం. రాజేంద్ర గారు అద్భుతంగా తీశారు. గిబ్రాన్ మ్యూజిక్, సౌందరరాజన్ విజువల్స్ ఇలా అన్నీ అద్భుతంగా ఉంటాయి. అశిక అద్భుతంగా కనిపిస్తుంది. హరి కొసరాజు వల్లే ఈ సినిమా ఇక్కడకు వరకు వచ్చింది. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

    డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను సపోర్ట్ చేసిన హీరో కళ్యాణ్‌ రామ్ సర్, మైత్రి నిర్మాతలకు థాంక్స్. మళ్లీ మళ్లీ కళ్యాణ్‌ రామ్ గారితో సినిమా చేయాలని ఉంది. మా డీఓపీ సౌందరరాజన్ గారు లేకపోతే సినిమా ఇలా వచ్చేది కాదు. జిబ్రాన్‌ గారు ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. తమ్మిరాజు గారు ఈ సినిమా కోసం ఎక్కువగా ట్రావెల్ చేసి పని చేశారు. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్‌ కొల్ల గారు అద్భుతంగా పని చేశారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అమిగోస్ సినిమా ఫిబ్రవరి 10న రాబోతోంది. అందరినీ కచ్చితంగా సర్ ప్రైజ్ చేస్తుంది. కళ్యాణ్‌ రామ్ గారి పర్ఫామెన్స్‌ను అందరూ ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.

    ఆశిక రంగనాథ్ మాట్లాడుతూ.. ‘చాలా రోజుల నుంచి తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు ఎదురుచూశాను. ఇది నా మొదటి తెలుగు సినిమా. ఇంతకు ముందు కన్నడలో చేశాను. తెలుగు ఇండస్ట్రీకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. తారక్ సర్ ఇక్కడకు రావడం, మా ఈవెంట్‌కు ఇలా రావడం ఆనందంగా ఉంది. నాటు నాటు చూసి నాకు షాక్ అనిపించింది. ఆయన అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఫిబ్రవరి 10న అమిగోస్ రిలీజ్ అవుతోంది. నా దర్శకుడు రాజేంద్ర గారికి థాంక్స్. సౌందరరాజన్‌ గారు నన్ను ఎంతో బాగా చూపించారు. మైత్రీ లాంటి పెద్ద సంస్థ ద్వారా నేను పరిచయం అవ్వడం నాకు ఆనందంగా ఉంది. కళ్యాణ్‌ సర్ నా అమిగో. షూటింగ్ సమయంలో నాకు ఎంతో సాయం చేశారు. తెలుగు నేర్పించడంలో సాయపడ్డారు. ఆయన్నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. కన్నడ అభిమానులకు థాంక్స్. ఈ సినిమా మిమ్మల్ని కచ్చితంగా నిరాశపర్చదు. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. సినిమాను చూసి మా అందరినీ ఆశీర్వదించండి’ అని అన్నారు.

    బింబిసారా డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. ‘ఇక్కడకు వస్తే మళ్లీ నా బింబిసారా ఈవెంట్‌ను చూసినట్టుగానే అనిపిస్తోంది. కళ్యాణ్‌ రామ్ గారు కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. డైరెక్టర్ రాజేంద్రకు ఆల్ ది బెస్ట్. మైత్రీ మూవీస్ అమిగోస్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టబోతోన్నారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.

    బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటికే అమిగోస్ సినిమాను మూడు నాలుగు సార్లు చూశాను. నాకు మైఖెల్ పాత్ర చాలా ఇష్టం. కళ్యాణ్‌ రామ్ గారు అద్భుతంగా నటించారు. జనవరి మైత్రీ మూవీస్ వారిదే. ఫిబ్రవరి కూడా వారిదే. ఇలా నెలకొక సినిమా వస్తుంది. ఇండస్ట్రీ అంతా వారిదే’ అని అన్నారు.

    బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ‘ఇంత వరకు ఇండియన్ హిస్టరీలో ఈ పాయింట్‌తో సినిమా రాలేదు. ఇంత మంచి సినిమాలో పాత్రను ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. కళ్యాణ్‌ రామ్ నా స్వీట్ బ్రదర్. ఎన్టీఆర్‌ లాంటి వారు ఒకరే ఉంటారు. మళ్లీ పుట్టరు’ అని అన్నారు.

    రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ‘రాజేంద్ర ఓ మంచి పాయింట్‌తో వచ్చాడు. ఇంత వరకు ఈ పాయింట్‌తో సినిమా రాలేదు. కొత్త సినిమాలను మైత్రీ వారు ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. బింబిసారా నుంచి కళ్యాణ్‌ రామ్ గారి కలర్ మారిపోయింది. ఈ సినిమాలో మూడు పాత్రల్లో కనిపించబోతోన్నారు. బింబిసారాకు మించిన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 10న ప్రేక్షకులతో పాటుగా సినిమా చూడాలని నేను కూడా ఎదురుచూస్తున్నా’నని అన్నారు.