• November 20, 2023

త్రిష కోసం మాట్లాడుతున్నారు.. మణిపూర్ ఘటన, దేశంలోని ఇతర అమ్మాయిల గురించి స్పందించరా?

త్రిష కోసం మాట్లాడుతున్నారు.. మణిపూర్ ఘటన, దేశంలోని ఇతర అమ్మాయిల గురించి స్పందించరా?

    Netizens Different Reactions on Trisha Mansoor Ali Khan Issue

    మన్సూర్ అలీఖాన్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తన సోషల్ మీడియా ద్వారా నటి త్రిష ఖండిస్తూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ రీసెంట్‌గా విడుదలైన లియో చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. మన్సూర్ అలీ ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్రిషతో కలిసి స్క్రీన్‌పై నటించకపోవటంపై నిరాశను వ్యక్తం చేశాడు. అదే సమయంలో ఆమెతో బెడ్ రూమ్‌లో సన్నివేశాన్ని ఆశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

    త్రిష తన మెసేజ్ ద్వారా మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నీచమైన, అసహ్యకరమైన సదరు కామెంట్స్ స్త్రీలపై చులకన భావాన్ని కలుగచేసేలా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఇదే సందర్భంలో లియో సినిమాలోని మన్సూర్‌తో కలిసి కలిసి నటించకపోవటంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయనతో కలిసి భవిష్యత్తులోనూ నటించనని తెలిపారు. మన్సూర్ వంటి వ్యక్తుల వల్ల మానవాళికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

    లియో దర్శకుడు లోకేష్ కనకరాజ్, మాళవికా మోహనన్, సింగర్ చిన్మయి, మంజిమ మోహన్ సహ పలువురు నటీనటులు మన్సూర్ అలీఖాన్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై అగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా హీరో నితిన్ సైతం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మన్సూర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. హీరోయిన్ త్రిషకు తన మద్దతుని తెలియజేశారు.

    త్రిషపై నీచంగా, కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మన్సూర్ ప్రవర్తనను నితిన్ ఖండించారు. ఈ సమాజంలో, సినీ ఇండస్ట్రీలో పురుషాంకారానికి తావు లేదంటూ నితిన్ తెలియజేశారు. స్త్రీలపై ఇలాంటి ఇబ్బందికరమైన, స్త్రీ ద్వేష పూరిత కామెంట్స్ చేసే వారికి వ్యతిరేకంగా సమాజం, సినీ ఇండస్ట్రీ ఉండాలని ఆయన పేర్కొన్నారు.

    ‘‘త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన నీచమైన, కించపరిచే వ్యాఖ్యలను నేను బలంగా ఖండిస్తున్నాను. పురుషాంకారానికి ఈ సమాజంలో తావు లేదు. మన పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న ఇలాంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిలబడాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను’’ అని నితిన్ తన పోస్ట్‌లో కోరుకున్నారు.

    ఇలా సెలెబ్రిటీలు స్పందించడం, త్రిషకు మద్దతుగా నిలబడటం, మహిళా కమిషన్ సభ్యురాలైన కుష్బూ రియాక్ట్ అవ్వడం, వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇలా వెంటవెంటనే వస్తున్న స్పందనలు, ఈ రియాక్షన్లు ఓకే కానీ.. మణిపూర్ ఘటన జరిగినప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్లారు? ఇతర మహిళలకు అన్యాయం జరిగినప్పుడు కూడా ఇలానే స్పందించాలి.. చిన్మయి గత కొన్నేళ్లుగా పోరాడుతోందని, మరి ఆమెకు ఎవ్వరూ మద్దతు తెలపడం లేదు ఎందుకు? అంటూ ఇలా పలు రకాలుగా స్పందిస్తున్నారు.

    మన్సూర్ అలీ ఖాన్ ఓ స్టార్ హీరో కాదు కాబట్టి.. ఇలా రియాక్ట్ అవుతున్నారా? అనుష్కను ప్రభాస్ ఓ సారి గుర్రం అని అన్నాడు.. అది కూడా తప్పే.. ఓ సినిమాలో అజిత్ కూడా ఓ అమ్మాయిని దారుణంగా తిడతాడు.. గతంలో కమల్ హాసన్ గురించి రాధిక కూడా ఇలాంటివే కామెంట్లు చేసిందటూ ఇలా గతంలో జరిగిన విషయాలను తవ్వి తీస్తున్నారు నెటిజన్లు.