• December 6, 2023

Hi Nanna Movie Review : హాయ్ నాన్న.. నటనలో నాని మిన్న

Hi Nanna Movie Review : హాయ్ నాన్న.. నటనలో నాని మిన్న

  Hi Nanna Movie Review in telugu నేచురల్ స్టార్ నాని నటిస్తే.. ప్రేక్షకులు నవ్వుతారు. ఏడుస్తారు. అలాంటి నాని మరోసారి అందరినీ తన నటనతో కదిలించడానికి, ఏడ్పించేందుకు హాయ్ నాన్న అంటూ వచ్చాడు. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాగా.. చిన్నారిగా నటించిన కియారా ఖన్నా కారెక్టర్ మీద అందరి ఫోకస్ పడింది. మరి ఈ సినిమా ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

  కథ
  విరాజ్ (నాని) తన ఆరేళ్ల పాప మహి (కియారా ఖన్నా)తో కలిసి ఉంటుంది. మహికి తాత, నాన్నే ప్రపంచం. మహికి ఆరోగ్యం బాగుండదు. ఎక్కువ కాలం బతకదని తెలిసినా విరాజ్ మాత్రం తన కూతుర్ని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇక మహికి అమ్మ ఎలా ఉంటుందో కూడా తెలీదు. అయితే అమ్మ కథ చెప్పమని పదే పదే మహి అడుగుతుంది. అదే క్రమంలో ఓ సారి యశ్న (మృణాల్ ఠాకూర్) పరిచయం అవుతుంది. మహి, యశ్న మంచి ఫ్రెండ్స్‌లా మారుతారు. ఇక ఈ ఇద్దరూ విరాజ్ ముందు పంతం పడతారు. అమ్మ కథ చెప్పాల్సిందే అని మహి, యశ్నలు పట్టుబడతారు. దీంతో అమ్మ కథను చెప్పేందుకు విరాజ్ సిద్దపడతాడు. కానీ అమ్మగా ఎవరిని ఊహించుకోవాలని మహి అనుకుంటుంంది. నన్ను ఊహించుకో అని యశ్న అంటుంది. అలా ఇక విరాజ్ తన భార్య వర్షతో పరిచయం, ప్రేమ, పాప పుట్టడం వంటివన్నీ చెబుతుంటాడు. ఓ యాక్సిడెంట్‌లో వర్ష చనిపోయిందని యశ్నకి చెబుతాడు. యశ్న, వర్ష ఒక్కరే అని విరాజ్‌కు తెలుస్తుంది? కానీ యశ్నకు మాత్రం ఆ విషయం తెలియదు. యాక్సిడెంట్ అవ్వడంతో గతాన్ని మరిచిపోతుంది. మళ్లీ వర్ష జీవితంలోకి రానని ఆమె తల్లికి విరాజ్ మాటిస్తాడు. మరి చివరకు యశ్నకి గతం గుర్తుకు వస్తుందా? మహి తన సొంత కూతురు, విరాజ్ తన భర్త అని గుర్తుకు వస్తుందా? చివరకు మహికి ఉన్న జబ్బు నయం అవుతుందా? ఈ ముగ్గురి కథ ఎలా ముగుస్తుంది? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

  నటీనటులు
  నానికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. నవరసాలను అవలీలగా పండించగల నటుడు నాని. సహజంగా నటించడంలో నానికి ఈ తరంలో ధీటుగా నిలబడే స్టార్లు ఉండకపోవచ్చు. ఈ సినిమా చూస్తే నాని నటన ఏ రేంజ్‌లో ఉంటుందో మరోసారి అర్థం అవుతుంది. కంటి చూపుతో ఏడిపిస్తాడు. మాట్లాడి ఏడ్పిస్తాడు. మౌనంగా ఉండి ఏడిపిస్తాడు. ఇక మృణాల్ సైతం ప్రేక్షకుల్ని ఏడిపిస్తుంది. అందంతో కట్టి పడేస్తుంది. తనతో ప్రేమలో పడేలా చేసుకుంటుంది. ఇక చిన్న పాపగా నటించిన కియారా ఖన్నా.. వయసుకు మించి నటించేసింది. ఆ పాప సైతం ప్రేక్షకుడి చేత కంటతడిపెట్టిస్తుంది. ఈ ముగ్గురు ప్రేక్షకుడి గుండెను బరువెక్కేలా చేస్తారు. ఈ మూడు పాత్రలతో ఆడియెన్స్ ప్రేమలో పడతారు. ఇక ప్రియదర్శి, జయరాం, హీరోయిన్ తల్లి పాత్ర, స్పెషల్ అప్పియరెన్స్ శ్రుతి హాసన్,విరాజ్ అశ్విన్ ఇలా అందరూ మెప్పిస్తారు. రితికా నాయక్ పాటకే పరిమితమైంది.

  విశ్లేషణ
  హాయ్ నాన్న కోసం దర్శకుడు మూడు రకాల ఎమోషన్స్‌ను రాసుకున్నాడు. నాన్న కూతురు.. తల్లీ కూతురు.. భార్యాభర్త ఇలా మూడు రకాల ఎమోషన్స్‌ను చూపించాడు. నాని, కియారా ఖన్నా ట్రాక్‌లో నాన్న ప్రేమ, బాధ్యతను చూపించాడు. తల్లి ప్రేమను కూడా గొప్పగానే చూపించాడు. భార్య భర్తల ప్రేమ ఎలా ఉండాలి? అని హీరో హీరోయిన్ల పాత్రతో చెబితే.. ఎలా ఉండకూడదో హీరోయిన్ తల్లిదండ్రుల పాత్రతో చూపించాడు. సంసారం అన్నాక గొడవలు వస్తాయని చెబుతూనే.. వాటిని ఎలా అధిగమించాలో చూపించాడు.

  ఏది ఏమైనా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పాజిటివ్ మైండ్, పాజిటివ్ థింకింగ్‌తో ఉండాలని విరాజ్ పాత్రతో చెప్పించాడు దర్శకుడు. మామూలుగా అయితే ఈ సినిమా కథ కొత్తేమీ కాదు. చాలా చిత్రాల్లో ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ తీసిన విధానం, ప్రేక్షకుడిని ఈ కథను చెప్పిన విధానం, మెల్లిగా హాయ్ నాన్న ప్రపంచంలోకి తీసుకెళ్లిన విధానం గొప్పగా, కొత్తగా ఉంటుంది.

  నాన్న, కూతురు ఎమోషన్.. కూతురికి ఉన్న వ్యాధి.. బతుకుతో పోరాటం చేస్తుందని హింట్ ఇవ్వడం, నాన్న ప్రతీ రోజూ కథలు చెబుతుంటే.. వాటిని ఊహించుకుంటూ ఉంటుందని ఇలా మెల్లిగా కథలోకి తీసుకెళ్తాడు దర్శకుడు. ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలవుతుందో.. కథలో వేగం పుంజుకున్నట్టుగా.. కొత్త ఉత్సాహం, కొత్త జోష్ వచ్చినట్టుగా అనిపిస్తుంది.

  ఆ ఎపిసోడ్స్‌లో మృణాల్‌ను చూసి ప్రేక్షకులు అంతా ఫిదా అవ్వాల్సిందే. అంత అద్భుతంగా చూపించాడు దర్శకుడు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, లవ్ సీన్లు అన్నీ కూడా ఎమోషనల్‌గా ఉంటాయి. విజువల్స్ ఫ్రెష్‌గా అనిపిస్తాయి. కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది. అయితే ఫస్ట్ హాఫ్ ఇంకా అవ్వడం లేదేంటి? ఇంటర్వెల్ కార్డ్ ఎప్పుడు పడుతుందా? అనేట్టుగా సాగుతుంది. కాస్త లెంగ్తీగానే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎప్పుడు అయిపోతుందని అనే భావన జనాలకు కలుగుతుంది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ అద్భుతంగా అనిపిస్తుంది.

  ఇంటర్వెల్ తరువాత గోవాలో ఎపిసోడ్ బాగుంటుంది. కథ మెల్లిమెల్లిగా ఎమోషనల్ పార్ట్లోకి వెళ్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కంటతడి పెట్టించేలా ఉంటుంది. నాని, మృణాల్, కియారా నటన ప్రీ క్లైమాక్స్ నుంచి పీక్స్‌కు వెళ్లినట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్ ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియనట్టుగా కథలోకి, ఆ పాత్రల్లోకి లీనం అవుతాం. అలా హ్యాపి ఎండింగ్ ఇచ్చి ప్రేక్షకుడ్ని సంతోషంతో బయటకు వెళ్లేలా దర్శకుడు రాసుకున్న కథ అద్భుతంగా అనిపిస్తుంది. కథను రాసుకున్న తీరు కంటే.. తెరపై వాటికి రూపం ఇచ్చిన తీరు ఇంకా మెప్పిస్తుంది. తొలి దర్శకుడే ఇలా చేశాడా? అనే అనుమానం మాత్రం కచ్చితంగా వస్తుంది.

  ఈ సినిమా కోసం టెక్నికల్ టీం బాగా కష్టపడింది. ముఖ్యంగా హేషమ్ పాటలు, ఆర్ఆర్ సినిమాకు ప్రాణం పోశాయి. ఆర్ఆర్ అయితే గుండెపై మీటుతున్నట్టుగా అనిపిస్తుంది. హేషమ్ తన ఆర్ఆర్‌తోనే కంట్లోంచి నీరు తెప్పించేస్తాడు. మాటలు గుండెల్ని మెలిపెట్టేలా ఉంటాయి. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటర్ తన పనికి వంద శాతం న్యాయం చేశాడు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

  రేటింగ్ 3.5

  బాటమ్ లైన్ : హాయ్ నాన్న.. ఏడిపించిన నాని, మృణాల్, కియారా