• August 14, 2025

కూలీ రివ్యూ.. ఎలా ఉందంటే?

కూలీ రివ్యూ.. ఎలా ఉందంటే?

    Coolie Telugu Review రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ వంటి భారీ తారాగణంతో లోకేష్ కొనకరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘కూలీ’. ఈ మూవీలో సత్యరాజ్, శోబిన్, శ్రుతి హాసన్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇక ఈ చిత్రం ఇప్పుడు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో కూలీ మూవీ సంగతులు ఓ సారి చూద్దాం? ఈ మూవీ ఆడియెన్స్‌ను ఎంతగా ఆకట్టుకుంటుందో చూద్దాం.

    కథ
    సైమన్ (నాగార్జున) విశాఖ పోర్టుని ఆధీనంలో పెట్టుకుని ఇల్లీగల్ దందా చేస్తుంటాడు. చెన్నైలో దేవా (రజినీకాంత్) తన వారితో కలిసి ఉంటాడు. ఈ క్రమంలో దేవా (రజినీకాంత్) తన స్నేహితుడు రాజ శేఖర్ (సత్య రాజ్) మరణించిన వార్తను తెలుసుకుని వైజాగ్‌కి వస్తాడు. రాజ శేఖర్ పెద్ద కూతురు ప్రీతి (శ్రుతి హాసన్)కు ప్రమాదం ఉందని దేవా తెలుసుకుంటాడు. అసలు రాజ శేఖర్ మరణానికి కారణం ఎవరు? సైమన్ వద్ద ఉండే దయాల్ (షోబిన్) పాత్ర ఏంటి? దేవాకి సైమన్‌కు ఉండే లింక్ ఏంటి? చివరకు దేవా ఏం చేస్తాడు? ఇందులో కాలేశా (ఉపేంద్ర), దాహా (ఆమిర్ ఖాన్) పాత్రలు ఏంటి? అన్నది కథ.

    దేవా పరిచయం, సైమన్ ఇంట్రో ఇలా అన్నీ బాగానే అనిపిస్తాయి. అయితే సత్య రాజ్ మరణం, ఆ తరువాత శ్రుతి హాసన్, రజినీ సీన్లు ఇవేమీ కొత్తగా అనిపించవు. అంత ఎమోషనల్‌గా సాగవు. ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువగా షోబిన్, మోనిక సాంగ్, హాస్టల్ ఫైట్ ఇలా అన్నీ బాగుంటాయి. ఇంటర్వెల్‌కు కథ కాస్త రక్తి కట్టినట్టు అనిపిస్తుంది. అక్కడ ఇచ్చిన ట్విస్ట్ బాగానే అనిపిస్తుంది.

    ఇక సెకండాఫ్ చూస్తే ఎత్తులు పైఎత్తులు అన్నట్టుగా ఆట సాగుతుందని అనుకుంటాం. కానీ అక్కడ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా కనిపించదు. ఇక దేవాకి ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అనుకుంటాం. కానీ ఆ ట్రాక్ కూడా అంతగా సెట్ కాలేదనిపిస్తుంది. 90వ దశకంలో కనిపించినట్టుగా రజినీకాంత్‌ను కొన్ని షాట్స్‌లో లోకేష్ అద్భుతంగా చూపించాడు. కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంత పవర్ ఫుల్‌గా ఏమీ ఉండదు.

    మ్యాన్షన్ హౌస్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ బాగానే అనిపిస్తుంది. ఇక చివర్లో ఏమైనా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లింక్ ఉంటుందేమో అని అనుకుంటే నిరాశ తప్పదు. ఖైదీ, విక్రమ్ రేంజ్ ఎమోషన్స్ పండకపోగా.. జైలర్ రేంజ్‌లో ఇచ్చిన ఎలివేషన్స్ కూడా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. ఇక వెయ్యి కోట్లు అనేది కూలీతో కూడా నెరవేరకపోవచ్చు.

    టెక్నికల్‌గా చూసుకుంటే కూలీ అందరినీ ఆకట్టుకుంటుంది. కూలీ విజువల్స్, ఆర్ఆర్ అందరినీ ఆకట్టుకుంటుంది. అనిరుధ్ ఇచ్చిన బీజీఎం అయితే ఫ్యాన్స్‌కు ట్రీట్ అని చెప్పుకోవచ్చు. రజినీని, నాగ్‌ని లోకేష్ చాలా స్టైలీష్‌గానే చూపించాడు. కానీ చివర్లో మాత్రం ఓ సాధారణ విలన్‌ను ముగించినట్టుగానే సైమన్ పాత్రను ముగించేశాడు లోకి. ఎమోషన్స్‌ను లోకేష్ వదిలేసినట్టుగా అనిపిస్తుంది.

    నటీనటుల విషయానికి వస్తే నాగార్జున ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా అనిపిస్తుంది. నాగ్ విలనిజం కొత్తగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో నాగ్ స్పేస్ తక్కువగా ఉందనిపిస్తుంది. ఇక రజినీకాంత్ స్వాగ్, స్టైల్ ఏ మాత్రం తగ్గలేదని కూలీ మరోసారి నిరూపించింది. షోబిన్ పాత్ర చాలా స్పెషల్‌గా నిలుస్తుంది. రచితా రామ్ పాత్ర అందరినీ మెప్పిస్తుంది. సత్య రాజ్‌కు తగిన స్కోప్ దక్కలేదనిపిస్తుంది. శ్రుతి హాసన్‌కి మంచి కారెక్టర్ దొరికింది. మిగిలిన పాత్రలు పర్వాలేదనిపిస్తాయి.

    కూలీ చిత్రాన్ని చూసిన తరువాత ఓ సంతృప్తి అయితే కలగకపోవచ్చు. లోకేష్ కనకరాజ్ నుంచి ఆశించే మెరుపులు ఈ చిత్రంలో ఉండకపోవచ్చు. ఖైదీ, విక్రమ్ రేంజ్‌లో లోకేష్ మాయ చేయలేకపోతోన్నారు. ఇక ఓ స్ట్రాంగ్ విలన్ మాత్రం ఈ చిత్రంలో లేడనిపిస్తుంది. ఇక ఈ కూలీ చిత్రం ఎల్‌సీయూలో ఎలా ఫిట్ అవుతుంది? ఎలా కనెక్ట్ చేస్తాడు? అన్నది మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. రజినీ ఫ్యాన్స్‌కి మాత్రం కూలీ బాగానే ఎక్కేలా కనిపిస్తోంది. నాగార్జున వల్ల తెలుగులోనూ మరింత ఎక్కువగానే కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇక కమర్షియల్‌గా కూలీ ఏ రేంజ్‌కు వెళ్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

    రేటింగ్ 3