• August 4, 2025

కూలీ ఈవెంట్.. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నా – నాగార్జున

కూలీ ఈవెంట్.. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నా – నాగార్జున

    రజినీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్ హీరోలతో లోకేష్ కనకరాజ్ తీసిన చిత్రం కూలీ. ఈ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన మోనిక పాట, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయ్ అన్న సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో..

    వీడియో బైట్ ద్వారా రజినీకాంత్ సందేశం ఇచ్చారు. ఆ వీడియోలో ఏముందంటే.. ‘తెలుగు సినిమా ప్రేక్షకులకు నమస్కారం.. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అవుతోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ చిత్రం. తమిళంలో లోకీ ఓ రాజమౌళి లాంటి వాడు. ఆయన తీసిన చిత్రాలన్నీ హిట్ అయ్యాయి. ఇందులో భారీ క్యాస్టింగ్ ఉంది. సత్య రాజ్‌ ముఖ్య మైన పాత్రను పోషించారు. శోబిన్ విలన్‌గా నటించారు. ఆమిర్ ఖాన్ తన కెరీర్‌లో మొదటి సారిగా ఓ స్పెషల్ కారెక్టర్‌ను చేశారు. కింగ్ నాగార్జున ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించారు. సైమన్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతోంది. ఆ పాత్రను ఎవరు చేస్తారా? అని అనుకున్నాను. స్టైలీష్ విలన్‌గా ఉండాలని అనుకున్నాం. నాగ్‌తో లోకేష్ ఆరు సార్లు సిట్టింగ్స్ చేశారు. చివరకు సైమన్ పాత్రకు నాగ్ దొరికారు అంటూ నాతో లోకి చెప్పారు. డబ్బు కోసం నాగార్జున యాక్ట్ చేయరు.. ఆ అవసరం ఆయనకు లేదు.. ఎప్పుడూ మంచి వాడిగా చేయడం ఏంటి? అని కొత్తగా ఉంటుందని ఈ పాత్రని చేసి ఉంటారు.. నాగ్ మాత్రం ఇప్పటికీ యంగ్‌గా, ఫిట్‌గా ఉన్నారు.. ఆ సీక్రెట్ ఏంటి? అని అడుగుతుండేవాడిని. మంచి డైట్, ఎక్సర్ సైజ్, జీన్స్, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీగా ఉండటమే నా సీక్రెట్ అని నాగార్జున చెబుతుంటారు. 17 రోజులు నాగార్జునతో కలిసి పని చేశాను. ఆ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేను. సైమన్ పాత్రను చూస్తే నేను కూడా ఇలా చేయగలనా? అని అనుకున్నాను. ఆమిర్, షోబిన్, శ్రుతి ఇలా అందరూ అద్భుతంగా నటించేశారు. బాషా, ఆంటోనీ.. కూలీ, సైమన్ రేంజ్‌లో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం చాలా పెద్ద విజయం సాధిస్తుంది. పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకుల్ని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

    నాగార్జున మాట్లాడుతూ.. ‘నిన్నే పెళ్లాడుతా తరువాత అన్నమయ్య చేశాను. ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. లోకేష్ వచ్చే వరకు నా జర్నీ బాగానే ఉంది. ఓ సారి లోకేష్ ఇంటికి వచ్చి కలిశాడు. విలన్‌గా నటిస్తారా? అని లోకేష్ అడిగారు. ఖైదీ, విక్రమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఖైదీ చూసిన తరువాత లోకేష్‌తో పని చేయాలని నాకు అనిపించింది. నాకు మనసులో ఉన్న ఆ కోరిక వల్లే లోకేష్ నా దగ్గరకు వచ్చి ఉంటాడు. లోకేష్ ఎప్పుడూ కూల్‌గా ఉంటారు. లోకేష్ కథ చెప్పడం స్టార్ట్ చేసిన వెంటనే నాకు చాలా నచ్చింది. రజినీకాంత్ గారికి ఈ కథ నచ్చిందా? అని అనుమానం వచ్చింది. నా పాత్రే అందులో ఎక్కువగా ఉందని నాకు అనిపించింది. సైమన్ పాత్రే హీరోలా అనిపించింది. లోకేష్ అన్ని పాత్రలకు సమాన ప్రాధాన్యం ఇస్తుంటారు. లోకేష్ మీదున్న నమ్మకంతోనే ఈ మూవీకి ఒప్పుకున్నాను. కథ చెబుతుంటూ రికార్డ్ చేసుకుని మళ్లీ మళ్లీ విన్నాను. అందులో నాకు అనిపించినవన్నీ చెప్పాను. నేను చెప్పిన సలహాలు, సూచనలన్నీ తీసుకున్నారు. లోకేష్ నాకు ఆరేడు నెరేషన్స్ ఇచ్చారు. నేను అడిగివన్నీ చేశారు. చివరకు కథ అద్భుతంగా వచ్చింది. వైజాగ్‌లో ఫస్ట్ డే షూట్ చేశాం. ఆ సీన్ లీకైంది. ఆ సీన్ ఏంటో ఇప్పుడు చెప్పలేను. ఆ సీన్‌ను చూసిన తరువాత అంత రాక్షసంగా మనుషులుంటారా? అని లోకేష్‌ను అడిగాను. లోకేష్ ఎంతో హంబుల్‌గా ఉంటారు. సినిమాను ఎంజాయ్ చేస్తూ తీస్తుంటారు. ఇచ్చిన బడ్జెట్‌ కంటే చాలా తక్కువలోపే లోకేష్ ఫినిష్ చేశారు. ఆరు కెమెరాల సెటప్‌తో లోకేష్ ఒకేసారి షూట్ చేస్తుంటారు. దాదాపు అన్నీ ఒకే టేక్‌లో అయిపోయాయి. కానీ స్క్రీన్ మీద చూస్తే మేం ఇంత చేశామా? అని అనిపించేది. లోకేష్‌తో మళ్లీ మళ్లీ పని చేయాలని ఉంది. సత్య రాజ్ గారు అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు. అంతే ఫిట్‌గా ఉన్నారు. శ్రుతితో నాకు ఎక్కువ సీన్లు లేవు. కానీ ఆమె అద్భుతంగా నటించారు. షోబిన్ కారెక్టర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. మోనిక సాంగ్‌లో షోబిన్ అదరగొట్టేశారు. మొదటి రోజు షూటింగ్‌లో.. నేను కేరవ్యాన్‌‌లో ఉంటే రజినీకాంత్ గారు లోపలకి వచ్చిన వెల్కమ్ టు కూలీ అని అన్నారు. రజినీ గారు సెట్‌లో నిత్యం తన సీన్ల గురించి ఆలోచిస్తూ, ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. రజినీ గారు ఎంతో సింపుల్‌గా ఉంటారు. బ్యాంకాక్‌లో 17 రోజులు షూట్ చేశాం. అక్కడ రజినీ గారు అందరినీ పిలిచి ఓ ప్యాకెట్ ఇచ్చారు. ఇంటికి ఏమైనా తీసుకెళ్లండని అందరికీ డబ్బులు ఇచ్చారు. అనిరుధ్ మ్యూజిక్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వరుసగా హిట్లు కొడుతూనే ఉన్నారు. కూలీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉండబోతోంది. కూలీ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ పాత్ర నన్ను పూర్తిగా లిబరేట్ చేసింది. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించినట్టుగా అనిపిస్తుంది. ఆగస్ట్ 14న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

    లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ.. ‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన రజినీ సర్, సన్ పిక్చర్స్‌కు థాంక్స్. నాగార్జున గారికి ఏడు నెరేషన్స్ ఇచ్చిన తరువాత పాత్రను అంగీకరించారు. మా చిత్రంలో నటించిన ఆమిర్ సర్, ఉపేంద్ర సర్, సత్య రాజ్ గారికి, శ్రుతి హాసన్ గారికి థాంక్స్. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా నా సినిమాల్ని ఇక్కడ బ్లాక్ బస్టర్‌లు చేస్తూనే వస్తున్నారు. ఆగస్ట్ 14న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

    సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. ‘‘కూలీ’ టీంకు ఆల్ ది బెస్ట్. రజినీ సర్, నాగార్జున సర్ నటించిన ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.

    దిల్ రాజు మాట్లాడుతూ.. ‘నాగార్జున గారు మొదటి సారిగా ఇలా ఓ నెగెటివ్ పాత్రను పోషించారు. లోకేష్ గారికి ఏ పాత్రను ఎలా డిజైన్ చేయాలో బాగా తెలుసు. నాగార్జున గారు నెగెటివ్ పాత్రను పోషించడం పెద్ద అస్సెట్‌గా మారింది. హీరోల్ని హీరోలుగానే కాకుండా.. కొత్తగా ఏమైనా చేస్తేనే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. బన్నీ గారు పుష్పలా, సూర్య గారు కంగువా అంటూ అలరించారు. రజినీ సర్, నాగార్జున సర్ కాంబోలో రాబోతోన్న ఈ చిత్రం పెద్ద హిట్ కావాలి. ఈ చిత్రంలో మేం భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన సన్ పిక్చర్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

    సత్య రాజ్ మాట్లాడుతూ.. ‘కూలీ చిత్రంలో భాగం అవ్వడం ఆనందంగా ఉంది. ఈ మూవీ పెద్ద హిట్ కాబోతోంది. తమిళంలో ఇది మొదటి వెయ్యి కోట్ల చిత్రం కాబోతోంది’ అని అన్నారు.

    రాంబాబు గోశాల మాట్లాడుతూ.. ‘‘కూలీ’ చిత్రంలో పాట రాసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

    సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘లోకేష్ తీసిన ఖైదీ, విక్రమ్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. నాగార్జున ఇలా కొత్త పాత్రలో కనిపిస్తుండటం ఆనందంగా ఉంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

    శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. ‘కూలీ లాంటి పెద్ద చిత్రంలో పార్ట్ అవ్వడం ఆనందంగా ఉంది. ఇంత మంచి పాత్రను ఇచ్చిన లోకేష్ గారికి థాంక్స్. ఫ్యామిలీతో కలిసి షూటింగ్ చేసినట్టుగా అనిపించింది. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్షన్‌లో పని చేయడం ఆనందంగా ఉంది. రజినీ గారితో పని చేయడం నా అదృష్టం. నాగార్జున గారు ఈ చిత్రంలో అద్భుతం చేశారు. అందరికీ ఆయన పాత్ర నచ్చుతుంది. ఆగస్ట్ 14న రాబోయే మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.