- October 29, 2021
Varudu Kaavalenu Movie Review : ‘వరుడు కావలెను’ రివ్యూ.. రొటీన్ వరుడే కానీ!

వరుడు కావలెను సినిమా మీద నాగ శౌర్య మంచి అంచనాలు పెట్టుకున్నాడు. అసలే అశ్వథ్థామ ఫ్లాపుతో ఉన్నాడు. అలా ఫ్లాప్ అంటే ఆ హీరో ఒప్పుకోడేమో. కానీ అది ఫ్లాపే. ఇక వరుడు కావలెను సినిమా నేడు (అక్టోబర్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.. అందరి ఇంట్లో ఉండే కథ అని ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. ఇక దర్శకురాలిగా లక్ష్మీ సౌజన్య మొదటి ప్రయత్నం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
యాంత్రిక జీవితాన్ని చూసి చూసి విసుగుపుట్టిన ఆకాష్ (నాగ శౌర్య) ఇండియాకు తిరిగి వస్తాడు. కోట్ల రూపాయల ఆర్కిటెక్ట్ కాంట్రాక్ట్‌ను వదిలి మన దేశానికి వస్తాడు. అక్కడ భూమిని చూసి ఆమె కట్టూబొట్టూను చూసి ప్రేమలో పడతాడు. భూమి ఆఫీస్ కోసం ఆకాష్ ఆర్కిటెక్ట్ పని చేస్తాడు. అసలే అందరి అమ్మాయిల్లా కాకుండా కాస్త కోపిష్టి, మొండి, పట్టుదల ఉన్న భూమి ఆ తరువాత ఆకాష్ ప్రేమకు కరుగుతుంది. అయితే ఈ ఇద్దరి మధ్య అడ్డు కట్టగా నిలిచిన సంఘటన ఏంటి? అసలు ఈ ఇద్దరి గతంలో జరిగిన విషయాలు ఏంటి? అన్నది వరుడు కావలెను సినిమాకు సమాధానం.
నటీనటులు
వరుడు కావలెను సినిమాకు యాక్టర్లే బలం. ఆకాష్ పాత్రలో నాగ శౌర్య ఎంతో క్లాసీగా కనిపించాడు నటించాడు. అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించాడు. మరో వైపు భూమి పాత్రను వంద శాతం న్యాయం చేసింది రీతూ వర్మ. సినిమా ఆసాంతం చీరకట్టులో కనిపించి ముచ్చటగొలిపేలా చేసింది. అయితే దిగు దిగు నాగ అనే పాటలోనే రీతూ కాస్త వెరైటీగా అనిపిస్తుంది. ఇక నదియా గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. అత్తారింటికి దారేది నదియాకు వరుడు కావలెను నదియాకు ఎంతో తేడా ఉంది. మురళీ శర్మ ఎప్పటిలానే నటించేశాడు. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరధి మేరకు నటించేశారు.
విశ్లేషణ
ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. మూడు పదులు దాటిని కూడా పెళ్లిళ్లు చేసుకోని అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతో మంది ఉన్నారు. దానికి ఎన్నో రకాల కారణాలుంటాయి. నచ్చిన వాడు దొరకలేదనో, జీవితంలో ఇంకా సెటిల్ అవ్వలేదనో ఇలా ఎన్నో రకాల కారణాలుంటాయి. బిడ్డలకు వయసు వచ్చినా పెళ్లి కావడం లేదని, చేయడం లేదని ఇరుగుపొరుగు ఇలా ఎంతో మంది ఎన్నో రకాల కామెంట్లు చేస్తుంటారు. అయితే ఇలాంటి సమస్య ఇప్పుడు ప్రతీ ఇంట్లో ఉంది. అలాంటి కాన్సెప్ట్‌ను ఎంచుకున్నప్పుడు మరింత బలంగా ఎమోషన్స్‌ను చూపించాల్సి ఉంటుంది.
ఫ్లాష్ బ్యాక్‌లో హీరోను ఇష్టపడుతుంది హీరోయిన్. కానీ ప్రేమను చెప్పేలోపే ఎవరి దారిన వారు వెళ్లాల్సి వస్తుంది. ఇక కొన్నేళ్ల తరువాత కథ రివర్స్ అవుతుంది. ఇప్పుడు హీరోయిన్‌ను హీరో ఇష్టపడుతుంటాడు. తన ప్రేమను చెప్పి ఒప్పించేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే వీరి ప్రేమ సఫలం అయిందా? లేదా? అన్న దాని చుట్టూ సినిమాను తిప్పింది దర్శకురాలు.
పాత్రల్లో గాఢత అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. కాన్సెప్ట్ కొత్తది ఎంచుకున్నంత మాత్రాన సీన్లు కొత్తగా మారిపోవు.. కొత్తదనం రాదు. అలా ఈ చిత్రంలో పాయింట్ కొత్తగా అనిపించినా తెరపై మాత్రం అది ఎక్కడా కనిపించదు. రొటీన్ సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. లక్ష్మీ సౌజన్య ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. డైలాగ్స్ ఆలోచించేలా, మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. ఇక తెర మాత్రం ఎంతో కలర్‌ఫుల్లుగా కనిపించింది. కెమెరామెన్ అద్బుతంగా చూపించారు. ఎడిటర్ ఇంకాస్త పని చేయాల్సింది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.
చివరగా.. బోర్ కొట్టించిన వరుడు