• June 14, 2024

Music Shop Murthy Movie Review : మ్యూజిక్ షాప్ మూర్తి రివ్యూ.. ఏడిపించిన దర్శకుడు

Music Shop Murthy Movie Review : మ్యూజిక్ షాప్ మూర్తి రివ్యూ.. ఏడిపించిన దర్శకుడు

    Music Shop Murthy Movie Review అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రముఖ పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఫ్లై హై సినిమాస్‌ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ మూవీని నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ జూన్ 14న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఓ సారి చూద్దాం.

    కథ
    యాభై ఏళ్లు దాటిన మూర్తి (అజయ్ ఘోష్)కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇక పాతతరంలా ఆడియో క్యాసెట్ షాపులను అమ్ముకుంటూ, అదే తన లోకంలా బతికేస్తుంటాడు. మరో వైపు అంజ (చాందినీ చౌదరి) ట్రెండీ గర్ల్‌గా, డీజే అవ్వాలని కలలు కంటుంది. కానీ అంజన తండ్రి (భాను చందర్) మాత్రం కూతురి ఇష్టాన్ని వ్యతిరేకిస్తుంటాడు. ఇక మూర్తి జీవితంలోకి అంజన ప్రవేశిస్తుంది. ఆ తరువాత వీరిద్దరి స్నేహం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది? మూర్తి కుటుంబంలో ఏర్పడ్డ సమస్యలు ఏంటి? మూర్తికి డీజే కావాలన్న కలను ఎలా తీర్చుకుంటాడు? ఈ ప్రయాణంలో అంజన చేసిన సాయం ఏంటి? చివరకు మూర్తి తన లక్ష్యం కోసం చేసిన ప్రయాణంలో సక్సెస్ అయ్యాడా? లేదా? అన్నది కథ.

    నటీనటులు
    అజయ్ ఘోష్ మూర్తి పాత్రలో జీవించేశాడు. నవ్వించే చోట నవ్వించేశాడు. ఏడ్పించే చోట గుండెలు పిండేశాడు. తన కారెక్టర్లో అజయ్ ఘోష్ అలా పరకాయ ప్రవేశం చేశాడు. అంజన పాత్ర ఈ తరంలోని చాలా మంది అమ్మాయిలకు ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది. ఆ కారెక్టర్‌లో చాందినీ చౌదరి అద్భుతంగా నటించింది. ఆమని చాలా రోజులకు ఓ మిడిల్ క్లాస్ భార్యగా మళ్లీ అదరగొట్టేసింది. భానుచందర్ కారెక్టర్ కూడా బాగానే కనెక్ట్ అవుతుంది. మిగిలిన పాత్రలన్నీ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి.

    విశ్లేషణ
    ఓ కల కనడానికి, దాన్ని సాధించడానికి వయసు అనేది అడ్డంకి కాదు.. అవరోధం కాదు అని చెప్పడమే ఈ కథ. ఈ మూవీ సారాంశం కూడా అదే. మనకంటూ ఓ లక్ష్యం ఉంటే.. ఏ వయసులోనైనా దాన్ని సాధించగలం అని చాటి చెప్పే చిత్రమే ఇది. మధ్య తరగతి కుటుంబం, బాధ్యతలు అని వయసు మీద పడినా.. లోపల ఉన్న కోరిక, లక్ష్యం, ఆశ మాత్రం చావదు. అలా నచ్చిన పనిని, కలను సాధించుకోలేక కుమిలిపోయే బతుకులు ఎలా ఉంటాయో చూపించాడు దర్శకుడు.

    కన్న కలల్ని సాధించుకోలేక కుమిలిపోతూ బతకడం ఎంత కష్టంగా ఉంటుందో కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. ఇక ప్రస్తుత సమాజ ధోరణి కూడా చూపించాడు దర్శకుడు. ఓ పాతికేళ్ల అమ్మాయి, యాభై ఏళ్ల వ్యక్తి కలిసి తిరిగితే సమాజం ఎలా అనుకుంటుంది? నోళ్లు ఎలా అష్టవంకరలు తిరుగుతాయి.. నాలుక ఎలాంటి మాటల్ని మాట్లాడిస్తుందో చూపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా అలా సాగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్‌కు ఎమోషనల్ సీన్‌తో ఏడిపించేస్తారు. చాందినీ, భాను చందర్ మధ్య వచ్చే సీన్, పోలీస్ స్టేషన్ సీన్, మూర్తి ఇంట్లోంచి వెళ్లిపోయే సీన్లు బాగుంటాయి.

    సెకండాఫ్ అయితే మరింత ఎమోషనల్‌గా సాగుతుంది. మూర్తి సిటీకి వచ్చి పడే కష్టాలు.. ఎదిగేందుకు చేసే ప్రయత్నాలు ఇలా ప్రతీ ఒక్క ఎపిసోడ్ గుండెను హత్తుకునేలా ఉంటుంది. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మరింత ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ ఎమోషన్‌కు ప్రతీ ఒక్క ఆడియెన్ కనెక్ట్ అవుతాడు. అయితే చివరి పావుగంట కాస్త నిదానంగా, బోరింగ్‌గా అనిపించొచ్చు. కానీ ఎమోషనల్‌గా కట్టి పడేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

    సాంకేతికంగా ఈ చిత్రం ఎంతో హై స్థాయిలో అనిపిస్తుంది. విజువల్స్ ఎంతో రిచ్‌గా, సహజంగా అనిపిస్తాయి. పవన్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం. ఆర్ఆర్‌తో ఏడిపించేశాడు. ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉంది. మాటలు గుండెల్ని హత్తుకుంటాయి. పాటలు ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. నిర్మాతకు ఇది మొదటి సినిమా అంటే నమ్మేలా ఉండదు. నిర్మాణ విలువలు ఎంతో గొప్పగా అనిపిస్తాయి.

    రేటింగ్ : 3.25