- November 7, 2021
Chiranjeevi: అప్పటి నుంచీ నన్ను పక్కన పెట్టేశాడు!.. చిరంజీవిపై కోటి కామెంట్స్

Chiranjeevi స్వరాల పుత్రుడు కోటి అందించిన మ్యూజిక్ ఎప్పటికీ నిలిచిపోతుంది. 90వ దశకంలో రాజ్ కోటి ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇళయరాజా వంటి దిగ్గజాన్ని తట్టుకుని నిలబడ్డారు. రాజ్ కోటి ద్వయం అందించిన ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి. మరీ ముఖ్యంగా చిరంజీవి మాస్ చిత్రాలకు రాజ్ కోటి అందించిన సంగీతం ఇప్పటికీ ఫ్రెష్‌గా ఉంటుంది. చిరంజీవి డ్యాన్సులు, రాజ్ కోటి సంగీతం ఎప్పటికీ మరుపురాని కాంబినేషన్‌లా ఉంటుంది.
ఖైదీ నెంబర్ 756, ముఠామేస్త్రీ, హిట్లర్ ఇలా ఎన్నెన్నో చిత్రాలు వీరి కాంబోలో వచ్చాయి. అయితే హిట్లర్ తరువాత చిరంజీవి సినిమాలకు కోటి ఎక్కడా కూడా పని చేయలేదు. హిట్లర్ సినిమా సమయంలోనే ఓ చిన్న పాటి దూరం పెరిగిందని అందరూ అంటుంటారు. అయితే తాజాగా కోటి ఆ విషయాలన్నీ కూడా బయటపెట్టేశాడు. అసలు ఏం జరిగిందనే సంగతిని వివరించాడు. హిట్లర్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఒంగోలులో వంద రోజుల ఫంక్షన్ జరుగుతోంది.
నేను మా అత్తగారి ఊరైన వాకాడలో ఉన్నాను. నెల్లూరి నుంచి ఒంగోలుకు వెళ్లొచ్చు అని అనుకున్నాను. కానీ నాకు విపరీతమైన జ్వరం వచ్చింది. వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అదే విషయాన్ని మేనేజర్‌కు, మోహన్ గారికి చెప్పాను. అయితే దాన్ని ఎవరు ఎలా చెప్పారో తెలీదు. కానీ అక్కడి నుంచి దూరం పెరిగింది. బలిసి రాలేదు అని అనుకున్నారో ఏమో. ఎందుకంటే అప్పటికి చిరంజీవి ఫ్లాపుల్లో ఉన్నాడు. హిట్లర్ సినిమాతోనే మళ్లీ పుంజుకున్నాడు.
వంద రోజుల ఫంక్షన్. అది కూడా మెయిన్ టెక్నీషియన్ అయిన నేను వెళ్లలేదు. దీన్ని వేరేలా అక్కడ చెప్పి ఉంటారు. అందుకే అప్పటి నుంచి నన్ను దూరం పెట్టేశారు. నేను కలిసి జరిగింది చెప్పాలని ప్రయత్నించాను. కానీ చిరంజీవి వినే స్థితిలో లేరు. ఆ తరువాత ఓసారి అల్లు అరవింద్ గారిని కలిశాను. కొత్తగా వేరే వాళ్లను ట్రై చేస్తున్నాం. మాస్టర్ సినిమా కోసం దేవాను తీసుకున్నాం. మళ్లీ ఎప్పుడైనా చూద్దాం అని అన్నారు. ఆ తరువాత ఎప్పుడూ నన్ను పిలవలేదు.
ఆ తరువాత ఓ సారి చిరంజీవిని కలిసేందుకు వెళ్లాను. కానీ అప్పటికే నన్ను పక్కన పెట్టేశారని నాకు అర్థమైంది. ఇక ఒత్తిడి చేయలేదు. నేను అక్కడి నుంచి బయటకు వచ్చాను. అంతే గానీ నాకు చిరంజీవి గారికి మధ్య గొడవలేం లేవు. ఇళయరాజా గారు ఉన్నా కూడా మాకు సినిమాలు ఇచ్చారు.. మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. కాల ప్రభావం చేత నాకు అలా జరిగింది. నా టైం అయిపోయింది అంటూ అసలు సంగతి చెప్పేశాడు కోటి.