- October 20, 2022
నా భార్య నా కంటే ఎక్కువగా సంపాదిస్తోంది.. మంచు విష్ణు
విష్ణు మంచు టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘జిన్నా’. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు.పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్. దీపావళి సందర్భంగా జిన్నా మూవీని అక్టోబర్ 21న వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మీడియాతో ముచ్చటించారు.
మోహన్ బాబు గారు ఈ సినిమాను ‘ఢీ’తో పోల్చుతున్నారు? మీరేమంటారు?
ఇప్పటి వరకు ఈ సినిమాను రెండు షోలు వేసి ప్రివ్యూ చూపించాం. అందరూ విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఢీ సినిమా చేసేటప్పుడు ప్రతీ క్షణం నవ్వుతూనే ఉన్నాం. విడుదలయ్యాక కల్ట్ సినిమా అయింది. జనాలకు బాగా నచ్చేసింది. అయితే ఈ సినిమా ఢీ రేంజ్‌లో సక్సెస్ అవుతుందా? అనేది తెలియదు. జిన్నా సినిమాలో ఇంటర్వెల్‌కు అందరూ షాక్ అవుతారు. కానీ ఢీ సినిమాలో ఇంటర్వెల్‌కు అంత సర్ ప్రైజ్ అనిపించదు. అదే ఈ రెండు సినిమాలకు తేడా. జిన్నా ఇంటర్వెల్‌కు అందరూ సర్ ప్రైజ్ కాదు షాక్ అవుతారు. హీరో నేనే అయినా.. నాకు చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్ పాత్రలంటే ఇష్టం. సెకండాఫ్ కడుపుబ్బా నవ్వించేస్తాం. నవ్వీ నవ్వీ అందరికీ కడుపునొస్తుంది. మామూలుగా ప్రివ్యూ థియేటర్లో అంతగా ఎవ్వరూ నవ్వరు. కానీ మా అమ్మ గారు, అత్తగారు కూడా చప్పట్లు కొట్టేసి నవ్వుతూ ఎంజాయ్ చేశారు. అప్పుడు వచ్చిన నమ్మకంతోనే ఈ జిన్నా సినిమాను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాను.
మీకు యాక్షన్ కామెడీ జానర్ సెంటిమెంట్‌గా మారిందని అనుకోవచ్చా?
ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే నాకు కూడా హ్యాపీనే. మామూలుగా నాకు యాక్షన్ కామెడీ జానర్ కలిసి వచ్చింది. నాకు వచ్చిన హిట్లన్నీకూడా ఆ జానర్‌లో చేసినవే. మధ్యలో కొన్ని ట్రై చేశాను. అక్కడ తప్పు చేశాను. ఆ తప్పుని సరిద్దిద్దుకోవడమే జిన్నా. భవిష్యత్తులో మళ్లీ ఆ తప్పు చేస్తానో లేదో నాకు తెలీదు. మంచి కథ కుదరడం దైవాధీనం. చేసే ప్రతీ సినిమా బాగుండాలనే ఉద్దేశ్యంతోనే అందరం సినిమా చేస్తాం. ఆ దేవుడి దయవల్ల మాకు మంచి కథ దొరికింది.
జిన్నా టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటి?
ఈ సినిమాలో నా కారెక్టర్ పేరు జీ నాగేశ్వరావు. జీనా అని పిలిస్తే బాగుండదు. అందుకే జిన్నా అని పెట్టాం. గాలి నాగేశ్వరరావు అయితే.. అందరూ గాలి కబుర్లు అని ఏడిపిస్తుంటారు. అయితే జిన్నా అని పిలవడండని చెబుతారు. వీడు అప్పు చేసి టెంట్ హౌస్ పెట్టుకుంటాడు. కానీ ఏ పెళ్లికి వెళ్లి టెంట్ వేసినా కూడా ఆ పెళ్లి ఆగిపోద్ది. ఇక అప్పు ఎలా తీర్చుతాడు. అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను చేశాను. అయితే టైటిల్ విషయంలో కాంట్రవర్సీ అవుతుందని కొంత మంది ముందు చెప్పారు. కానీ మన ఉద్దేశ్యం మంచిది అయినప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొందామని చెప్పి.. టైటిల్ ఫిక్స్ చేశాం.
తిరుపతి కొండల మీద జిన్నా టైటిల్ పెట్టడం ప్రధానంగా విమర్శలకు దారి తీసింది కదా?
ప్రస్తుతం నేను ఏం చేసినా, చేయకపోయినా కాంట్రవర్సీ అవుతోంది. ప్రతీ ఒక్కరికి అభిప్రాయాలుంటాయి. అమ్మాయి అలా ఉండాలి.. అబ్బాయి ఇలా ఉండాలి.. అంత సంపాదించాలి అని అందరికీ ఇలా అభిప్రాయాలుంటాయి. ఇవన్నీ చాలా పాత పద్దతులు. నా కంటే నా భార్య విన్ని ఎక్కువగా సంపాదిస్తుంటారు. ఆ విషయంలో నాకు గర్వంగా ఉంటుంది. కాంట్రవర్సీ అయితే అయింది.. అయినా ఇప్పుడు కాంట్రవర్సీ అనేది ఫేమస్. అందుకే ఈ టైటిల్ పెట్టాం. ఏది ఎదురైనా ఎదుర్కొందాం అని అనుకున్నాం.
మీ కారెక్టర్ చేసేందుకు ఏమైనా ప్రిపరేషన్స్ చేస్తారా?
ఇదే విషయంలో మా నాన్న గారిని ఓ సారి అడిగాను. ఆయన ఇచ్చిన సమాధానం విని నేను షాక్ అయ్యాను. పెదరాయుడు, రామన్న చౌదరి ఇలా చేసినప్పుడు ఏమైనా ప్రిపేర్ అయ్యారా? అని అడిగాను. కారెక్టర్ చెబుతారు.. మనం చేయాలి. అంతే అని ఆయన అన్నారు. అది విని షాక్ అయ్యాను. అయితే ఈ చిత్రం కోసం నేను చిత్తూరు యాస మాట్లాడాల్సి వచ్చింది. ఆ యాస కోసం నేను కష్టపడ్డాను.
జి. నాగేశ్వరరెడ్డి గారితో మీది మంచి కాంబినేషన్. కానీ ఈ సినిమాకు సూర్యను డైరెక్టర్‌గా పెట్టుకున్నారు ఎందుకు?
మూల కథ జి. నాగేశ్వరరెడ్డి గారిదే. కానీ కోన వెంకట్ గారు దీన్ని పూర్తిస్థాయిలో రెడీ చేశారు. సన్నీ లియోన్ డేట్స్ లాక్ చేసుకుని నా వద్దకు వచ్చారు. అయితే సన్నీ లియోన్‌కు తెలుగులో అంత పాపులర్ కాదు కదా? అని అనుకున్నా. నాన్న గారు కథ బాగుంది చేయమని అన్నారు. అప్పుడు ఓ మీడియా ఫ్రెండ్‌ను కూడా సలహాను అడిగాను. సన్నీ లియోన్ అయితే బాగుంటుందని అన్నారు. అలా ఈ సినిమాలోకి సన్నీ లియోన్ వచ్చారు. అయితే జీ నాగేశ్వరరెడ్డి గారు ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల శ్రీనువైట్ల అసిస్టెంట్ సూర్యను డైరెక్టర్‌గా తీసుకున్నాం.
జిన్నా చిత్రం హారరా? థ్రిల్లరా?
అది మనం అంతా కలిసి సినిమా చూసి తెలుసుకుందాం (నవ్వులు)
ఈ ప్రాజెక్ట్‌లో కోన వెంకట్ గారి ప్రాధాన్యత ఎంత?
కోన వెంకట్ గారు ఈ సినిమా కోసం ప్రతీ రోజూ పని చేశారు. సెట్‌లో ఉండేవారు. డైలాగ్ వర్షన్ జరిగిన ప్రతీ రోజూ ఆయన ఉండేవారు. ఆయనకు చాలా థాంక్స్. చోటా కే నాయుడు గారితో ఎప్పటి నుంచో చేయాలని అనుకున్నాం. ఇన్నాళ్లకు అది కుదిరింది.
సోషల్ మీడియాలో సన్నీ లియోన్‌తో కలిసి చేసిన ఫన్నీ వీడియోలపై మీ అభిప్రాయం ఏంటి?
మనకు జనాలతో కనెక్షన్ ఉండాలంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉండక తప్పదు. అయితే ఇందులో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సిందే. ట్విట్టర్‌లో పొలిటికల్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇన్‌స్టాగ్రాం అయితే అంత విష పూరితం కాలేదు. ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్లున్న ఉమెన్స్‌లో సన్నీ లియోన్ ముందుంది. ఆమెకు దాదాపు 53 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. నాకు కేవలం ఒక మిలియన్ ఫాలోవర్లే ఉన్నారు. ఇన్‌స్టాలో నేను ముందుకు వెళ్లాలని అనుకున్నాను. ఆమె నాకు అంతా నేర్పించింది.
జిన్నా సినిమాలో మీకు ఎదురైన సవాల్ ఏంటి?
జిన్నా సినిమా కోసం యాసను నేర్చుకోవడం కష్టంగా అనిపించింది. ఈ సినిమాలోని పాత్ర నా ఒరిజినల్ కారెక్టర్‌గానే ఉంటుంది. పెద్ద తేడా ఉండదు. నా పిల్లలు ఈ సినిమాను చూసినప్పుడు వాళ్లకు ఏ తేడా అనిపించదు. ఎందుకంటే నేను బయట ఎలా ఉంటానో.. ఈ సినిమాలోనూ అలానే ఉంటాను. యాక్షన్ కామెడీ అనేది నాకు ఎంతో ఇష్టమైన జానర్.
ఢీ2 సినిమాను ప్రకటించారు కదా?
శ్రీను వైట్ల గారు, నేను కలిసి చేస్తున్నాం. జనవరి, ఫిబ్రవరిలో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.
అనూప్ రూబెన్స్ సంగీతం, ఆయనతో పని చేయడం ఎలా అనిపించింది?
నా కెరీర్‌లో ది బెస్ట్ ఆల్బమ్ అవుతుంది. పైగా ఇది నాకు జీవితాంతం గుర్తుంటుంది. నా పిల్లలు ఈ సినిమాలో పాట పాడారు. చిన్న పిల్లల పాడుతున్నారు. సరిగ్గా పాడకపోతే నెగెటివ్ వస్తుంది అని అందరూ హెచ్చరించారు. కానీ వారిద్దరూ ట్రైన్డ్ సింగర్స్. వాళ్లు పాట బాగా పాడారు. అందరికీ నచ్చింది.
మీ పిల్లలతో పాట పాడించాలనే ఆలోచన ఎవరిది?
జిన్నా అనేది నలుగురు స్నేహితుల కథ. అందులో చిన్న పిల్లల ట్రాక్ కూడా ఉంది. పిల్లలతో పాడించాలని అన్నాడు. ఫిమేల్ అయితే అరియానా, వివియానా పాడతారు అని అన్నాను. కానీ అనూప్ చివరి వరకు భయంగానే ఉన్నాడు. బాగా లేకపోతే ఏం చెప్పాలని అనుకుంటూ ఉన్నాడు. కానీ పాట విన్నాక అనూప్ సంతోషించాడు. ఇద్దరి గాత్రాల్లోనూ ఎంతో తేడా ఉంది. ఇకపై వాళ్లతో పాటలు పాడిస్తాను. భవిష్యత్తులో మంచి సింగర్లు అవ్వాలని అనుకుంటున్నాను. కానీ ఆర్టిస్ట్‌లు అవ్వాలని ఉంది. నా కొడుకు అయితే స్టేజ్ మీదే డ్యాన్సులు వేస్తున్నాడు. పిల్లలకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అది అవుతారు.
ఓ పక్క హీరోగా, మరో పక్క మా ప్రెసిడెంట్‌గా ఎలా మ్యానేజ్ చేస్తున్నారు?
నా టీంలో అంతా మంచి వాళ్లున్నారు. ఈసీ మెంబర్లుగా వాళ్లు ఎలా పని చేశారో గానీ.. ఇప్పుడు మాత్రం అద్భుతంగా పని చేస్తున్నారు. అంతా వాళ్లే చూసుకుంటున్నారు. ఓ ఆర్టిస్ట్‌కు బాగా లేదని అంటే.. మాదాలా రవి ముందుండి చేశాడు. మా టీం చాలా సపోర్ట్ చేస్తోంది. అందుకే ఇవన్నీ చేయగల్గుతున్నాను.
మా బిల్డింగ్ కోసం రెండు ఆప్షన్లు ఇచ్చారు కదా? ఈ విషయాన్ని చాంబర్ దృష్టికి తీసుకెళ్లారా?
వాళ్లు ఓకే అన్నారు. ముందు ఈ విషయాన్ని ఆది శేషగిరిరావు వద్ద పెట్టాను. ఇది నేను ప్రకటించొచ్చా? అని ఆయన్ను అడిగాను. ఆ తరువాతే అందరికీ చెప్పాను.
ప్రెసిడెంట్‌గా బాగానే చేస్తున్నారు. మళ్లీ పోటీ చేయను అని ఎందుకు అన్నారు?
నా కంటే ఇంకా మంచి ప్రెసిడెంట్ రావొచ్చు కదా?. నాకు ఓ ఉద్యోగం ఇచ్చారు. నా ఉద్యోగం అయిపోతుంది. ఒక వేళ ఇండస్ట్రీ పెద్దలు మళ్లీ నన్ను కమాండ్ చేస్తే.. నేను చేస్తాను. నెక్ట్స్ ఏకగ్రీవంగా అందరూ కలిసి ఎన్నుకుంటే ఇంకా బెటర్. ఇదంతా ఒక ఫ్యామిలీ. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఉమ్మడి కుటుంబం. అందరూ కలిసి ఎవరిని ఎన్నుకున్నా సరే మాకు ఇష్టమే.
సినిమాలోని ఇద్దరి హీరోయిన్ల మధ్య పోటీ ఉంటుందా?
అవును. ఇద్దరి మధ్య అద్భుతంగా ఉంటుంది. మీ అందరూ చూస్తే మీకే అర్థమవుతుంది.
సన్నీ లియోన్‌కు పూర్తి పాత్ర ఇవ్వడంపై మీ ఆలోచన ఏంటి?
ముందు నేను కూడా భయపడ్డాను. కానీ సన్నీకి ఓ మెసెజ్ పెట్టాను. అది సేవ్ చేసుకోమని చెప్పాను. జిన్నా విడుదలయ్యాక యాక్టర్‌గా నీ కెరీర్ మారుతుందని చెప్పాను. నీ గురించి చాలా కాలం మాట్లాడుకుంటారని అన్నాను. నేను ఈ రోజు చెప్పింది నిజం కాకపోతే.. మీరు ఇకపై నన్ను నమ్మరు. అయినా ఇంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నా. ఈ సినిమాలో నా నంబర్ ఐదో ఆరో ఉంటుంది. మా అమ్మా, పిల్లల్ని సినిమాకు తీసుకెళ్లగలనా? నవ్వించగలనా? అనే ఉద్దేశ్యంతోనే సినిమాలు చేయాలనే ధోరణితో ఉన్నా.
సినిమా కోసం టూర్‌లు వేశారు కదా? మీ అనుభవాలేంటి?
ముందు మా నాన్న గారి అభిమానులకు క్షమాపణలు చెప్పారు. వాళ్లకేం కావాలో తీయకుండా.. నాకు నచ్చింది చేశాను. వాళ్లు నాకు ఎన్నో చాన్సులు ఇచ్చారు. అందుకే ఈసారి వారందరితె ఇంటరాక్ట్ అవ్వాలని అనుకున్నాను. అందుకే టూర్‌లు వేశాను. నాకు ఈ టూర్‌లో ఎంతో సంతోషంగా అనిపించింది.
చాలా సినిమాల రీమేక్ రైట్స్ కొన్నారట?
చాలా సినిమాల రీమేక్ రైట్స్ కొన్నాను. మా ప్రొడక్షన్ కంపెనీలో వేరే హీరోలతోనూ ఆ సినిమాలు చేస్తాను. నవంబర్ చివర్లో ఈ చిత్రాల గురించి ప్రకటిస్తాను.
తెలుగు కథలో లేవని అనుకుంటున్నారా?
మంచి కథ ఎక్కడున్నా చెప్పాలనే ఉద్దేశ్యంతోనే రీమేక్ చేస్తున్నాను. ఆండ్రాయిడ్ కుంజప్పన్ అనే కథను నాన్న గారి కోసం తీసుకున్నాను. కానీ మలయాళంలో తీసిన సినిమాలో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నాం. కథలోని ఆత్మను మాత్రమే తీసుకుంటాం. పూర్తిగా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీస్తాం.
ప్రభుదేవా మాస్టర్ చాలా కష్టపెట్టినట్టున్నాడు?
అందరూ కష్టపెట్టారు. అందరి కంటే ఎక్కువగా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కష్టపెట్టాడు. నా కెరీర్‌లో బెస్ట్ సాంగ్స్, డ్యాన్సులు అవుతాయి. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ డ్యాన్స్ బాగా చేశాడని అనుకుంటారు. ఇంత వరకు నాకు మంచి పాటలు పడలేదు.
ఇకపై అన్నీ యాక్షన్ కామెడీ జానర్‌లోనే చేస్తారా?
ఇప్పుడ అయితే అదే ఆలోచనలో ఉన్నాను. యాక్షన్ కామెడీ జానర్‌లోనే సినిమాను చేయాలని అనుకుంటున్నాను.
డైరెక్టర్ సూర్యతో పని చేయడం ఎలా అనిపించింది?
ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది. ఎంతో కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఎంత పెద్ద విజయం చేకూరుతుందో తెలియదు గానీ.. మనిషిగా ఆయన ఎంతో మంచి వ్యక్తి.
తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి చెప్పండి?
శ్రీనువైట్ల గారితో సినిమా కచ్చితంగా ఉంటుంది. ఇంకో క్రేజీ ప్రాజెక్ట్ ఉంది. నేను ఓ డైరెక్టర్‌తో 15 నుంచి 18 ఏళ్ల నుంచి ప్రయాణం చేస్తున్నాను. అది పూర్తిగా డిఫరెంట్ జానర్. కానీ అందులోనూ కామెడీ ఉంటుంది. ఒక వేళ అది కన్ఫామ్ అయితే నేను ప్రకటిస్తాను. ఆ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. శ్రీను వైట్ల కాన్సెప్ట్ చెప్పినప్పటి నుంచీ అందరూ నవ్వేస్తారు.