• February 8, 2024

యాత్ర 2 రివ్యూ.. మెప్పించిన మహి వీ రాఘవ్

యాత్ర 2 రివ్యూ.. మెప్పించిన మహి వీ రాఘవ్

  వైఎస్సార్ చేపట్టిన పాదయాత్రను బేస్ చేసుకుని మహి వీ రాఘవ్ యాత్ర చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక ఇప్పుడు వైఎస్ జగన్ పాదయాత్రను ఆధారంగా తీసుకుని యాత్ర 2 తీశాడు. నేడు ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైంది. ఇక ఈ సినిమాని మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

  కథ
  కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో మహి కారెక్టర్ల పేర్లు కూడా మార్చలేదు. వైఎస్సార్ (మమ్ముట్టి), జగన్ (జీవా), చంద్రబాబు (మహేష్ మంజ్రేకర్) అంటూ ఇలా రియల్ కారెక్టర్ల పేర్లనే పెట్టేశాడు. వైఎస్సార్(మమ్ముట్టి) తన కొడుకు జగన్(జీవా)ని 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా నిలబెట్టే సీన్‌తో కథ మొదలవుతుంది. తర్వాత ఏపీలో వైఎస్సార్ గెలవడం, సీఎం అవ్వడం చూపిస్తారు. అనంతరం వైఎస్సార్ మరణం, జగన్ ఓదార్పు యాత్ర, హైకమాండ్ ఓదార్పు యాత్రని ఆపేయమనడంతో జగన్ ప్రత్యేక పార్టీ పెట్టడం, బై ఎలక్షన్స్ లో గెలవడం, జగన్ పై సిబిఐ దాడులు, జగన్ అరెస్ట్ వంటి అంశాలు చూపిస్తారు. ఆ తర్వాత రాష్ట్రాన్ని విభజించడం, చంద్రబాబు(మహేష్ మంజ్రేకర్) సీఎం అవ్వడం, మొదటిసారి జగన్ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష నేతగా ఉండటం, పాదయాత్ర చేయడం చూపిస్తారు. చివర్లో 2019 లో జగన్ సీఎం అవ్వడం అనేది కథాంశం.

  నటీనటులు
  వైఎస్ జగన్‌ పాత్రలో జీవా అద్భుతంగా నటించేశాడు. కొన్ని సార్లు మనం జీవాని చూస్తున్నామా? వైఎస్ జగన్‌ను చూస్తున్నామా? అన్నట్టుగా ఉంటుంది. అంతలా జీవా ప్రభావితం చేస్తాడు. ఎమోషనల్ సీన్స్‌తో ఏడిపిస్తాడు. తెరపై హీరోయిజాన్ని అద్భుతంగా చూపించాడు. మమ్ముట్టి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కనిపించేది కొద్ది సేపే అయినా ప్రభావం మాత్రం గట్టిగా ఉంటుంది. ఇక వైఎస్సార్ భార్య విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి అదరగొట్టారు అని చెప్పొచ్చు. చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్.. మిగిలిన నటీనటులు కూడా మెప్పించారు.

  విశ్లేషణ
  అందరికి తెలిసిన కథే.. దాన్ని ఎలా తెరకెక్కించామన్నది ముఖ్యం అని మహి వీ రాఘవ్ ముందు నుంచీ చెబుతూనే వస్తున్నాడు. యాత్ర 2 కథ ప్రారంభం, ముగింపు అందరికీ తెలిసిందే. కానీ సినిమాను ఎలా డ్రైవ్ చేశాను.. ఎలా చూపించాను అన్నది ముఖ్యం అని చెప్పిన మహి.. ఆడియెన్స్ పల్స్ తెలుసుకోవడంలో సఫలం అయ్యాడు. ఎక్కడ ఎలాంటి ఎమోషన్ సీన్ పెట్టాలి.. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఎలివేషన్స్ సీన్స్ పెట్టాలో తెలుసుకున్నాడు.

  ప్రతీ ఒక్కరూ కథలో లీనం అవుతారు. ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. గుండె భారంగా మారుతుంది. పూర్తిగా పొలిటికల్ సినిమా అయినా తండ్రి కోసం, ఇచ్చిన మాట కోసం నిలబడే కొడుకు కథగా ఎమోషనల్‌గా రన్ చేశాడు. 2009 – 2019 మధ్యకాలంలో జరిగిన రాజకీయాల్లో కొన్ని ముఖ్య ఘట్టాలని తీసుకొని తెరకెక్కించారు. సినిమాలో జగన్, వైఎస్సార్, చంద్రబాబు.. అంటూ క్యారెక్టర్స్ కి అన్ని ఒరిజినల్ పేర్లే వాడటం గమనార్హం. పార్టీల పేర్లు మాత్రం మార్చాడు.

  సినిమాని ఓ పక్క ఎమోషనల్ గా రన్ చేస్తూనే మరో పక్క జగన్ పాత్రకి ఎలివేషన్స్ బాగా ఇచ్చాడు. ఇక వైఎస్సార్ మరణం అప్పుడు రియల్ విజువల్స్, చివర్లో వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేయడం కూడా రియల్ విజువల్స్ చూపించడంతో మరింత సహజంగా అనిపిస్తుంది.

  టెక్నికల్‌గా యాత్ర 2 పై స్థాయిలో ఉంటుంది. మధి విజువల్స్, సినిమాటోగ్రఫీ టాప్ నాచ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయింది. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి బ్యాక్ బోన్‌గా నిలిచాడు. మాటలు ఈ సినిమాకు ప్రాణం పోశాయి. ఎడిటింగ్, ఆర్ట్ ఇలా ప్రతీ ఒక్క అంశంలో యాత్ర 2 హై స్థాయిలో ఉంది.

  రేటింగ్ 3