- October 4, 2023
Devara Two Parts : రెండు పార్టులు అనేది కామన్‌గా మారిందే.. ‘దేవర’పై నిర్ణయం సరైనదేనా?
ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర సినిమాను రెండు భాగాలుగా తీస్తోన్నట్టు కొరటాల శివ పేర్కొన్నాడు. ఇప్పుడు అన్ని భారీ చిత్రాలు ఈ రెండు పార్టులు అనే ఫాంటసీలో ఉన్నాయి. అందుకే కొరటాల కూడా రెండు పార్టులను ఆలోచించాడా? అసలు ఈ ప్లాన్ ఎందుకు మధ్యలోకి వచ్చింది? ఈ నిర్ణయం సరైనదేనా?అనే చర్చలు మొదలయ్యాయి. సలార్ రెండు పార్టులుగా రాబోతోంది. ఇక పవన్ కళ్యాణ్ ఓజీని సైతం రెండు పార్టులుగా ప్లాన్ చేస్తున్నారనే గాసిప్ వచ్చిన సంగతి తెలిసిందే.
కోలీవుడ్‌లో శంకర్ కూడా ఇదే చేస్తున్నాడట. ఇండియన్ 2 సినిమా కథ పెరుగుతూ పోతోందని, మూడో పార్ట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నాడని టాక్. కాంతార హిట్ అవ్వడంతో రెండో పార్ట్ మీద ఫోకస్ పెట్టాడు. ఫస్ట్ పార్ట్ హిట్టయితే రెండో పార్ట్ ప్లాన్ చేయడం పద్దతే. కానీ ఫస్ట్ పార్ట్ ఇంకా పూర్తి కాక ముందే రెండో పార్ట్‌ను కూడా ఇప్పుడు ప్రకటిస్తున్నారు. ఇప్పుడిదే ట్రెండ్‌గా మారింది.
విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ సినిమాను కూడా రెండు పార్టులుగా ప్లాన్ చేశాడని సమాచారం. ఇలా ప్రతీ హీరో తన కథలను ల్యాగ్ చేస్తున్నారో.. దర్శక నిర్మాతలు కావాలనే పెంచుతున్నారో.. వారికి ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారో తెలియడం లేదు కానీ.. ఈ రెండు పార్టులు, మూడు పార్టులు అనే ట్రెండ్ మాత్రం ఎక్కువైంది.
ఈ దేవర గురించి కొరటాల శివ తాజాగా చెప్పిన విషయాలు గమనిస్తే మాత్రం ఒకటి స్పష్టంగా అర్థం అవుతోంది. దేవరలోని ప్రతీ పాత్రకు చాలా ఇంపార్టెంట్ ఉందని, కథ అలా పెరుగుతూ వస్తోందని, అందుకే ఒకే పార్టులో అయితే న్యాయం చేయలేమని అనిపించిందట.. అందుకే రెండు పార్టుల్లో సినిమా వస్తుందని కొరటాల శివ చెప్పుకొచ్చాడు. అంటే ఈ దేవరలోనూ కేజీయఫ్ స్టైల్లోనే ప్లాన్ చేశాడని, అదిరిపోయే ఎలివేషన్లు, యాక్షన్ సీక్వెన్సులు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లతో సినిమాను నింపేలా ఉన్నాడని తెలుస్తోంది.
ఏప్రిల్ 5న మొదటి పార్ట్ వస్తుందని, అదే ఆరంభం అని చెప్పేశాడు కొరటాల శివ. ఇప్పుడు ఈ రెండు పార్టులు అనే ఫ్యాంటసీ మాత్రం ఎక్కువైంది. ఇదిలా ఉంటే.. ఫ్లాప్ అయిన సినిమాలకు కూడా సీక్వెల్స్ తీయడం కూడా కామన్ అయిపోయింది. కన్నడలో ఉపేంద్ర నటించిన కబ్జా సినిమా ఫ్లాప్ అయింది. కానీ దానికి సీక్వెల్ కూడా ఉంది. రీసెంట్‌గా వచ్చిన స్కందకు సైతం సీక్వెల్ ఉంటుందట. ప్రభాస్ ప్రాజెక్ట్ కే సైతం రెండు భాగాలుగా వస్తుందనే రూమర్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.
ఆల్రెడీ పుష్పకు ఈ ఫార్మూలా బాగానే సక్సెస్ అయింది. బాహుబలి సైతం రైటింగ్ స్టేజ్‌లోనే రెండు పార్టులుగా మారింది. కేజీయఫ్‌ను రెండు పార్టులుగా మార్చమని మన రాజమౌళియే సలహా ఇచ్చాడట. నిజంగానే కథలో దమ్ముంటే ఎన్ని భాగాలుగా వచ్చినా జనాలు ఆదరిస్తారు. కానీ డిమాండ్ ఉంది కదా? అని కథను ఊరికే సాగదీస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఇక దేవర విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.