- October 15, 2022
Kanatara Telugu Movie Review : కాంతారా మూవీ రివ్యూ.. రిషభ్ శెట్టి నట విశ్వరూపం

రిషభ్ శెట్టి, కాంతారా పేర్లు గత రెండు వారాలుగా దేశంలో బాగానే వినిపిస్తోంది. అసలు నటన అంటే ఎలా ఉండాలి.. ఎలా చేయాలో..రిషభ్ శెట్టిని చూసి నేర్చుకోవాలంటూ రకరకాల కామెంట్లు వినిపించాయి. అయితే కన్నడలో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు అన్ని భాషల్లోకి డబ్ చేసి వదిలేశారు. అయితే ఈ చిత్రం నేడు తెలుగు వారి ముందుకు వచ్చింది. కాంతారా కథ ఏంటో ఓ సారిచూద్దాం.
అనగనగా ఓ రాజు.. అతడికి అన్నీ ఉన్నా.. సంతోషం, మనశ్శాంతి, ప్రశాంతత అనేవి మాత్రం ఉండవు. వాటిని వెతుక్కుంటూ ఊర్లు పట్టుకుని తిరుగుతుంటాడు. అలా ఓ సారి అటవీ ప్రాంతంలోకి వెళ్తాడు. అక్కడ ఓ విగ్రహాన్ని చూడటంతో.. తనలో తెలియని మనశ్శాంతి కలుగుతుంది. దీంతో ఆ దైవాన్ని తనతో తీసుకెళ్లేలాని భావిస్తాడు. కానీ ఆ దైవం ఊరిని కాపాడుతుంటుంది. దైవ సేవలో ఓ క్షేత్ర పాలకుడు కూడా ఉంటాడు. అతను రాజును అడ్డుకుంటాడు. దైవాన్ని తీసుకెళ్తాను.. బదులుగా ఏది కోరినా ఇస్తానని రాజు అంటాడు.
తన అరుపులు ఎక్కడి వరకు వినిపిస్తే.. అక్కడి వరకు ఆ భూమిని తమ గ్రామానికి, తమ ప్రజలకు ఇచ్చేయండని కోరతాడు. దీంతో రాజు అంగీకరిస్తాడు. కానీ తరువాతి కాలంలో రాజు వారసులు ఆ భూమి మీద కన్నేస్తారు. కానీ క్షేత్ర పాలకుడు వారిస్తాడు.కోలం ఆడే క్షేత్ర పాలకుడికి రాజు వారసుడు ఎదురెళ్లి చస్తాడు. అంతకు ముందే ఆ క్షేత్ర పాలకుడు కూడా అదృశ్యం అవుతాడు.
అయితే ఆ తరువాత మళ్లీ ఆ భూములు చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగుతాయి. అందులో ఊరిపెద్ద దేవేంద్ర (అచ్యుత్ కుమార్), ఫారెస్ట్ ఆఫీసర్ మురళీ (కిషోర్) పాత్ర ఏంటి? కోలం ఆడే వంశంలో పుట్టిన శివ (రిషభ్ శెట్టి) ఏం చేస్తాడు. కోలం ఆడే తన తమ్ముడు గురువను చంపింది ఎవరు? చివరకు శివ కోలం ఆడతాడా? తన ఊరి ప్రజలు, భూమిని కాపాడుకుంటాడా? అనేది కాంతారా.
ఈ సినిమాలోని యాక్టర్స్ అంతా ఒకెత్తు.. రిషభ్ శెట్టి ఒకెత్తు. అందులోనూ మరీ ముఖ్యంగా రిషభ్ శెట్టి నటన ప్రథమార్థం, ద్వితీయార్థంలో ఒకెత్తు అయితే.. క్లైమాక్స్‌లో ఇంకో ఎత్తు. అలా ఈ సినిమాలో రిషభ్ మాత్రమే గుర్తుకు వస్తాడు. గుర్తుండిపోతాడు. మిగిలిన పాత్రల్లో అచ్యుత్, కిషోర్ ఇలా అందరూ బాగానే నటించారు. లీలగా సప్తమీ అందంగా కనిపించింది. అక్కడక్కడా నవ్వులు పంచిన శివ మిత్ర బృంధం కూడా బాగానే ఉంది.
కాంతారా సినిమాను కథగా చూస్తే చాలా పాతగానే ఉంటుంది. భూములు దానంగా ఇవ్వడం, ఆ తరువాతి కాలంలో వారసులు ఆ భూముల కోసం ప్రజలను హింసించడం, లాక్కోవడం అనేది కామన్ పాయింట్. ఇంత వరకు ఈ కాన్సెప్ట్ సినిమాలెన్నో చూశాం. కానీ కాంతారాకు మాత్రం పాయింట్ పాతదే అయినా ఎంచుకున్న నేపథ్యం, తెరకెక్కించిన తీరు అబ్బురపరుస్తుంది.
కాంతారాకు కోలం అనే సంప్రదాయాన్ని యాడ్ చేయడంతో స్పాన్ మారిపోయింది. రిషభ్ శెట్టి ప్రారంభంలో కోలం ఆడే తీరు.. క్లైమాక్స్‌లో ఆట ఆడే తీరుకు ఎంతో తేడా ఉంటుంది. వాటిలోనే సినిమా జీవం ఉంటుంది. రిషభ్ శెట్టి నటన ఉచ్ఛస్థాయికి అక్కడే చేరుతుంది. సినిమా చివరకు చేరుకున్న సమయంలో రిషభ్ అందరినీ మంత్ర ముగ్దుల్ని చేస్తాడు. రిషభ్ శెట్టి నటనకు తగ్గట్టుగా సాగే కెమెరా, ఇచ్చిన నేపథ్యసంగీతం అన్నీ కూడా అద్భుతం అనిపిస్తాయి. హోంబలే బ్రాండ్ సరిగ్గా కనిపిస్తుంది.
బాటమ్ లైన్ : కాంతారా.. నీకు సాటిలేదురా
రేటింగ్ : 4