• October 29, 2025

రాజమౌళి ఏం సంపాదించలేదా?.. ఇంకా అప్పులు కడుతూనే ఉన్నాడా?

రాజమౌళి ఏం సంపాదించలేదా?.. ఇంకా అప్పులు కడుతూనే ఉన్నాడా?

    బాహుబలి ది ఎపిక్ అంటూ రాజమౌళి మరోసారి అక్టోబర్ 31న అందరినీ ఆశ్చర్యపరిచేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. రెండు పార్టుల్ని కలిపి ఒకే పార్టుగా బాహుబలి ది ఎపిక్ అంటూ రెడీ చేసిన జక్కన్న.. వెరైటీ ప్రమోషన్స్‌తో అందరినీ మెప్పిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్, రానా, రాజమౌళి కలిసి ముచ్చట్లు పెట్టారు. ఈ క్రమంలో ఈ పదేళ్లలో జరిగిన విషయాల్ని, బాహుబలి షూటింగ్ మెమోరీస్‌ను గుర్తు చేసుకున్నారు.

    బాహుబలి మొదటి పార్ట్ రిలీజ్ అయిన రోజు డిజాస్టర్ టాక్, నెగెటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ టైంలో రాజమౌళి తెగ టెన్షన్ పడ్డాడట. తాను దర్శకుడిని కాబట్టి.. తనకు పోయేదేమీ లేదని అనుకున్నాడట. కానీ తనను నమ్మి డబ్బులు పెట్టిన నిర్మాతల గురించి ఆలోచించాడట. వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లకు తిరిగి డబ్బులు ఎలా ఇవ్వాలి? అని ఆలోచించాడట. పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు కూడా లేవు కదా? అని ఇలా రాజమౌళి చెబుతుంటే.. ప్రభాస్ ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పాడు.

    నీ సంగతి నాకు తెలుసు కదా.. నువ్వు ఇప్పటికీ అలానే ఉన్నావ్.. అప్పులు తీర్చేందుకే ఇంకా కష్టపడుతున్నావ్.. అని రాజమౌళి గురించి ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అంటే రాజమౌళి ఇన్నేళ్లలో ఏమీ సంపాదించలేదా? అసలు అప్పులు ఎందుకు తీసుకున్నాడు? వాటిని తిరిగి చెల్లించేందుకు ఇన్నేళ్లు కష్టపడుతూ వచ్చాడా? అని అంతా అనుకుంటున్నారు.