- February 10, 2023
IPL మూవీ రివ్యూ.. ఆటపై, దేశంపై ప్రేమ
IPL Its Pure Love Telugu Movie Review మన దేశంలో క్రికెట్ ఆటకున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. క్రికెటర్లను దేవుళ్లా ఆరాధిస్తుంటారు. అయితే ఆ క్రికెట్ ఆట చుట్టూ టెర్రరిజం నేపథ్యాన్ని ఎంచుకుంటే.. దానికి ప్రేమ కథను జోడిస్తే ఎలా ఉంటుంది అనేది ఐపీఎల్.. ఇట్స్ ప్యూర్ లవ్. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
ఇమ్రాన్ ఓ టెర్రరిస్ట్. క్రికెట్ ఆటలో ఇండియా నెంబర్ వన్‌గా ఉండటాన్ని సహించలేకపోతాడు. అతను పాకిస్థాన్‌ను నెంబర్ వన్ స్థానంలోకి తీసుకురావాలని అనుకుంటాడు. ఈ క్రమంలో తన తమ్ముడు సలీం చేత ఇండియాలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో జట్లను కొంటాడు. శ్రీరామ్(నితిన్) మంచి క్రికెటర్. తనకున్న ఆవేశం వల్ల సెలెక్ట్ కాలేకపోతాడు. అయితే వరుణ్ (విశ్వ కార్తికేయ) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంటాడు. అక్కడ అతని బాస్ జాన్వీ (అర్చనా గౌతమ్)తో లవ్ ట్రాక్ కూడా ముందుకు సాగుతుంది. ఈ కథలో ఐపీఎల్ మ్యాచ్‌లు ఎలా జరిగాయి? వాటి వల్ల వరుణ్, శ్రీరామ్‌ల లైఫ్‌లో జరిగిన సంఘటనలు ఏంటి? టెర్రరిస్ట్‌లు వేసిన పథకం చివరకు ఎలా ముగిసింది? అనేది థియేటర్లో చూడాల్సిందే.
నటీనటులు
యూత్ ఆడియెన్స్‌ను మెప్పించేలా వరుణ్, శ్రీరామ్ పాత్రలుంటాయి. వాటిని నితిన్, విశ్వ కార్తికేయలు చక్కగా పోషించారు. లవ్ సీన్స్ అయినా ఎమోషనల్ సీన్స్ అయినా యాక్షన్ సీన్స్ అయినా కూడా మెప్పించారు. ఇక హీరోయిన్లుగా కనిపించిన అవంతిక, అర్చనలు అందంగా కనిపించారు. నటనతో మెప్పించారు. కుమార్ సాయి, రచ్చ రవి ఇలా మిగిలిన పాత్రలన్నీ కూడా తమ పరిధి మేరకు నటించాయి.
విశ్లేషణ
ఐపీఎల్ అంటే కొత్త మీనింగ్ ఇచ్చారు మేకర్లు. అసలే ఇండియాలో క్రికెట్‌కు వీరాభిమానులుంటారు. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే క్రికెటర్లను ఆరాధిస్తుంటారు. ఐపీఎల్ అంటూ క్రికెట్ నేపథ్యంలో సినిమా తీయడంతో యూత్ ఆడియెన్స్‌ను కనెక్ట్ చేసేలా ఉంది. ఇక ఇందులో బెట్టింగ్స్ జరిగే తీరు, వాటికి యూత్ ఎలా అడిక్ట్ అయిందనే విషయాన్ని అంతర్లీనంగా చూపించారు.
ప్రథమార్థం కాస్త గందరగోళంగా, కాస్త నీరసంగా సాగుతుంది. ఇక ప్రథమార్థంలో ఐపీఎల్ మ్యాచ్‌ల చుట్టూ కథ తిరగడంతో కాస్త స్పీడందుకున్నట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్‌లు అంత ప్రభావాన్ని చూపించినట్టుగా అనిపించదు. కానీ కొత్త వారితో డైరెక్టర్ చేసిన ప్రయత్నం పర్వాలేదనిపించేలా ఉంటుంది.
క్రికెట్ అనేది ఆట కాదు.. ఎమోషన్.. అదొక మతం.. అంటూ చెప్పించిన డైలాగ్స్ బాగున్నాయి. సందర్భానుసారంగా వచ్చే పాటలు మెప్పిస్తాయి. మాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. ఫ్రేమ్ అంతా కూడా కలర్ ఫుల్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్ విభాగంగా ఇంకాస్త షార్ప్‌గా కట్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంటాయి.
రేటింగ్ 2.75