• May 16, 2026

హరుడు రివ్యూ.. విక్టరీ కొట్టిన వెంకట్

హరుడు రివ్యూ.. విక్టరీ కొట్టిన వెంకట్

Artists : వెంకట్, నటాషా సింగ్, హెబ్బా పటేల్, సలోని, వేద్విక సోనీ, సుమన్,అలీ తదితరులు
Director : రాజ్ తల్లూరి
Producer : డిక్కల లక్ష్మణరావ్, ప్రవీణ్ రెడ్డి వి
Music : మణిజెన్నా
Cinematography : ఆనంద్ మరుకుర్తి
Editor : ఉప్పు మారుతీ
Release Date : 15th మే 2026
Banner : వీ ఆర్ ఎంటర్టైన్మెంట్స్

నటుడు వెంకట్ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడే. అతను ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’, ‘అన్నయ్య’ ‘ఆనందం’ ‘శివరామరాజు’ వంటి హిట్ చిత్రాలతో ఎన్నో హిట్లు సాధించాడు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ ‘ఓజి’ వంటి భారీ ప్రాజెక్టులో కనిపించి మెప్పించారు. ఇక ఇప్పుడు హరుడు అంటూ హీరోగా ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో విజయం సాధించాడా? లేదా? అన్నది చూద్దాం.

డీసీపీ శంకర్ ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. ఎన్కౌంటర్ శంకర్‌గా ఫేమస్ అవుతాడు. ముంబైలోని మాఫియాని శంకర్ గడగడలాడిస్తాడు. అలాంటి శంకర్ హైదరాబాద్ సిటీకి ట్రాన్స్ ఫర్ అవుతాడు. సిటీలో అడుగుపెట్టడంతోనే తన స్టైల్లో క్రిమినల్స్ ఆట కట్టిస్తుంటాడు. అక్కడి లోకల్ ఎమ్మెల్యే వరదరాజులు (శ్రీహరి పైలా) పైకి మంచి వాడిలా నటించి, లోలోపల మాత్రం ఇల్లీగల్ పనులు చేస్తుంటాడు. ఒక గంజాయి కేసులో అరెస్టయిన అమాయక ఆటో డ్రైవర్‌ను విడిపించే క్రమంలో శంకర్, వరదరాజులు మొదటిసారి కలుస్తారు. మరోవైపు నిరుద్యోగులైన కొందరు విద్యార్థులు తమ కలల్ని నిజం చేసుకోవాలని కార్ల ఇంజిన్లను దొంగతనం చేస్తుంటారు. వచ్చిన డబ్బుతో ఒక ‘ఫుడ్ కోర్ట్’ పెట్టుకోవాలని అనుకుంటారు. ఆ కుర్రాళ్లకు, ఎమ్మెల్యేకి ఉన్న లింక్ ఏంటి? ఈ ఎమ్మెల్యేతో శంకర్‌కి ఏర్పడ వైరం ఎలాంటి దారి తీస్తుంది? శంకర్ భార్యని ఎవరు చంపుతారు? అన్నది తెలియాంటే సినిమా చూడాల్సిందే.

హరుడు కోసం తీసుకున్న కథ, కథనం, మేకింగ్ అన్నీ కూడా కాస్త పాతవాటిలానే అనిపిస్తాయి. కానీ ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టకుండా తీయడంలో దర్శకుడు కొంత వరకు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. సినిమాని చూస్తున్న ప్రేక్షకుడు మాత్రం నెక్ట్స్ సీన్ ఏంటి? అన్నది కనిపెట్టేలానే సాగుతుంది. అది సినిమాకి కాస్త మైనస్ అని చెప్పుకోవచ్చు. అయితే దర్శకుడు మాత్రం కమర్షియల్ అంశాల్ని, లెక్కల్ని అన్నీ చూసుకుని పాటలు, ఫైట్స్, కామెడీ సీన్స్ అని రాసుకుంటూ వెళ్లినట్టుగా అనిపిస్తుంది.

మొదటి సీన్ నుంచే ప్రేక్షకుడిని ఓ మూడ్‌లోకి తీసుకెళ్తాడు దర్శకుడు. పక్కా కమర్షియల్ ఫార్మాట్‌తో ఈ మూవీని తెరకెక్కించారని ప్రేక్షకులకు అర్థం అవుతుంది. హీరో ఇంట్రడక్షన్, సిటీలో ఘర్షణలు, స్టూడెంట్స్ తో కార్ ఇంజిన్లు దొంగతనం చేయించే సీన్లు ఇలా అన్నీ చకచకా వస్తుంటాయి. ఇంటర్వెల్‌కి మంచి ట్విస్ట్ ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ కీలకంగా ఉంటుంది. అందులో హీరో, హీరోయిన్ల మధ్య ట్రాక్ బాగుంటుంది. క్లైమాక్స్ అందరి ఊహకు తగ్గట్టుగానే ఉంటుంది. రన్ టైమ్ తక్కువగా ఉండటం కూడా ఈ సినిమాకు పాజిటివ్ పాయింట్ అని చెప్పాలి.

శంకర్ పాత్రలో వెంకట్ బాగా సెట్ అయ్యాడు. ఇప్పటికీ ఫిట్‌గా ఉండటం వల్ల పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరింత పవర్ ఫుల్‌గా కనిపిస్తాడు. డైలాగులు సెటిల్డ్‌గా పలికిన తీరు, అతని లుక్స్ బాగున్నాయి. వెంకట్ సరసన నటాషా సింగ్ చేసింది. ఆమెకు లభించిన స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువే అయినప్పటికీ, తన గ్లామర్‌తో పాస్ మార్కులు వేయించుకుంది. హెబ్బా పటేల్ పాత్ర కూడా మెప్పిస్తుంది. శ్రీహరి పైలా విలనిజం కూడా బాగానే అనిపిస్తుంది. అలీ కామెడీ, ఐటమ్ సాంగ్‌లో కనిపించిన సలోని కూడా తన గ్లామర్‌తో మేజిక్ చేసేశారు. ఇక మిగిలిన పాత్రల్లో షానీ, వేద్విక, రవిందర్ వంటి వారు తమ నటనతో ఆకట్టుకున్నారు. సినిమాలోని ఇతర పాత్రలు కూడా తమ పరిధి మేరకు మెప్పిస్తాయి.

సాంకేతికంగానూ ఈ మూవీ గొప్పగానే అనిపిస్తుంది. విజువల్స్, సంగీతం, పాటలు అన్నీ ఓకే అనిపిస్తాయి.  నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉంటాయి. పోలీస్ బ్యాక్ డ్రాప్ కథతో పుష్కలమైన కమర్షియల్ అంశాలతో వచ్చిన హరుడు ఓ సారి చూసి ఎంజాయ్ చేసేలానే ఉంటుంది.

రేటింగ్ 2.75