Hanuman Movie Review : హనుమాన్ మూవీ రివ్యూ.. చేతులెత్తి మొక్కాల్సిందే

Hanuman Movie Review : హనుమాన్ మూవీ రివ్యూ.. చేతులెత్తి మొక్కాల్సిందే

  Hanuman Movie Review హనుమాన్ సినిమా మీద మామూలు అంచనాలు లేవు. ఓ చిన్న సినిమా కదా? అని ఎవ్వరూ అనుకోలేదు. టీజర్ రాక ముందు ఈ హనుమాన్ మీద, ప్రశాంత్ వర్మ తేజ సజ్జాల మీద ఎవ్వరికీ అంత హెప్స్ లేవు. ఆదిపురుష్ పడుకోబెట్టేయడంతో అంతా నిరాశలో ఉన్నారు. ఆ టైంలో ప్రశాంత్ వర్మ ఈ హనుమాన్ టీజర్ వదిలి అందరినీలోనూ ఊపిరి పోశాడు. ఇలా కదా? సినిమా తీయాలన్నట్టుగా టీజర్ వదిలాడు. అందులోని విజువల్స్, క్వాలిటీ చూసి అంతా ఫిదా అయ్యారు. దీంతో హనుమాన్ సినిమాను మరింతగా చెక్కాడు ప్రశాంత్ వర్మ. టైం తీసుకుని, అనుకున్నది అనుకున్నట్టుగా తీసి సంక్రాంతి బరిలోకి దించాడు. ఈ మూవీ జనవరి 12న విడుదలైనా కూడా జనవరి 11న ప్రీమియర్లు వేశారు. ప్రీమియర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హనుమాన్ కథ ఎలా ఉందంటే..

  ఈ కథ ఓ క్రూరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి సూపర్ హీరో అవ్వాలనుకోవడం,సూపర్ హీరోకి ఉండే పవర్స్ తనకు రావాలని కలలుకంటూ ఉంటాడు మైఖేల్ (వినయ్ రాయ్). చిన్నతనంలోనే అమ్మానాన్నలు చంపేంత క్రూరుడు. అలాంటి వాడికి సూపర్ పవర్స్ వస్తే ఈ ప్రపంచానికే ప్రమాదం. ఇక ఇతగాడి కథ ఇలా ఉంటే.. అంజనాద్రి అనే చిన్న ఊర్లో హన్మంతు (ప్రశాంత్ వర్మ) ఉంటాడు. పెద్ద పనీ పాట ఏమీ ఉండదు. చిల్లర దొంగతనాలు చేస్తూ జీవితం సాగిస్తుంటాడు. అక్క అంజమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్) గయ్యాల్దీ అని అనుకుంటూ ఉంటాడు. కానీ తమ్ముడి కోసం అక్క ఆరాట పడుతూనే ఉంటుంది. అదే ఊర్లో మీనాక్షి (అమృతా అయ్యర్) ఉంటుంది. చిన్నప్పటి నుంచి హన్మంతుకు మీనాక్షి అంటే ఇష్టం. కానీ చెప్పడు. దూరం నుంచే ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు. ఇక పెద్దయ్యాక డాక్టర్ అవుతుంది మీనాక్షి. ఊరికే వచ్చి సేవ చేస్తూ ఉంటుంది.

  ఆ ఊరు అంతా కూడా పాలెగాడు గజపతి చేతుల్లో ఉంటుంది. ప్రజల సొమ్ముని బంధిపోట్లు పేరు, పన్ను పేర్లు చెప్పి దోచుకుంటూ ఉంటాడు. ఎదురు తిరిగినోడ్ని మల్లయుద్దంలో మట్టి కరిపిస్తుంటాడు. దీంతో జనాలు నోరు విప్పరు. అలాంటి టైంలోనే గజపతికి మీనాక్షి ఎదురెళ్తుంది. ఆ తరువాత మీనాక్షికి ప్రమాదం వస్తుంది. ఆ ప్రమాదానికి హన్మంతు అడ్డుగా వెళ్తాడు. ఈ క్రమంలోనే హన్మంతు తీవ్ర గాయాలతో నదిలో పడతాడు. ఆ తరువాత హన్మంతుకి రుధిర మణి దొరుకుతుంది. దీంతో అతని జీవితం మారిపోతుంది. చిన్నగా దేన్నైనా కదిలిస్తే వేళ్లతో సహా బయటకు రావాల్సింది. గోడను ఇలా టచ్ చేస్తే మొత్తం కూలిపోతుంది. సరదాకు ఎవరైనా టచ్ చేస్తే గాల్లోకి ఎగిరిపోతుంటారు. ఇలా సూపర్ పవర్స్‌తో హన్మంతు ఏం చేశాడు? గ్రామంలో అన్యాయాన్ని అరికట్టాడా? ఈ సూపర్ పవర్స్ హన్మంతు దగ్గర ఉన్నాయని మైఖేల్ ఎలా తెలుసుకుంటాడు? హన్మంతు మైఖేల్ మధ్య ఏం జరుగుతుంది? చివరకు రుధిర మణి ఏం అవుతుంది? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

  ప్రశాంత్ వర్మే ఈ సినిమాకు మొదటి హీరో. అసలు ఈ విజన్‌ను ఊహించినందుకు అతడికి చేతులెత్తి మొక్కాలి. స్క్రీన్ మీద ఎన్నో సార్లు మనచేత్తో దండం పెట్టించుకుంటాడు. ఆంజనేయుడి రూపాన్ని థియేటర్లో చూపించిన తీరుకు దండం పెట్టేస్తాం. ఫస్ట్ హాఫ్‌లో మల్లయోధులతో తేజ సజ్జా ఫైట్ చేసిన తరువాత అందరినీ పడుకోబెట్టి.. లంకలో తోకతో  సింహాసాన్ని చేసుకుని కూర్చన్న ఆంజనేయుడి సీన్‌ను గుర్తు చేశాడు. అసలు అలా ఎలా ఊహించగలిగాడో అని దండం పెడతాడు. అందులో మనకు  ఆంజనేయుడు కనిపిస్తాడు. ఆ తరువాత సెకండాఫ్‌లో కొండలాంటి బండను ఒంటి చేత్తో ఎత్తి మరోసారి హన్మంతుడి స్వరూాపాన్ని చూపిస్తాడు. ఇలా సెకండాఫ్‌లో ఎన్నో సార్లు చేతులెత్తి మొక్కేలా చేశాడు ప్రశాంత్ వర్మ.

  బుల్లెట్ల వర్షంతో శ్రీరాముని ప్రతిరూపం కనిపించేలా డిజైన్ చేసిన సీన్‌కు థియేటర్ అంతా గుడిలా మారిపోయిందా? అనేట్టు చేశాడు. ఆ సీన్‌ను ఊహించుకున్నందుకు చేతులెత్తి మొక్కాలి. అసలు సముద్రఖని పాత్రలో చెప్పించే డైలాగ్స్.. హన్మంతుడి గురించి చెప్పే మోనోలాడ్.. తేజ సజ్జాకు ఇచ్చే మోటివేషనల్ స్పీచ్.. అసలు కథను వివరించే సీన్.. అందులో ఇచ్చే ఎలివేషన్, చూపించిన విజువల్స్ అయితే జనాల మైండ్‌లో అలా నిలిచిపోతుంది. ఈ సినిమాకు పెట్టిన డబ్బులకు ఫస్ట్ హాఫ్‌లోనే న్యాయం చేస్తాడు ప్రశాంత్ వర్మ. సెకండాఫ్ అందులోనా ప్రీక్లైమాక్స్ ఒకెత్తు అయితే.. క్లైమాక్స్ నిజంగానే దైవ దర్శనం కలిగినట్టుగా అనిపిస్తుంది.

  ఆంజనేయుడి ఆగమనం చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. అసలు ప్రశాంత్ వర్మ ఇలా ఎలా తీయగలిగాడు? అతగాడికి ఇచ్చిన బడ్జెట్ ఎంత.. ఆయన లిమిట్స్ ఏంటి?.. వచ్చిన అవుట్ పుట్ ఏంటి?అని ఆశ్చర్యపోవాల్సిందే. ప్రశాంత్ వర్మ ఈ హనుమాన్‌ను ఇలా తీశాడంటే.. జై హనుమాన్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అన్నప్పుడే హనుమాన్ సీక్వెల్స్ ఇక వస్తూనే ఉంటాయని అంతా ఊహించుకోవాల్సిందే. అసలు కథ అంతా కూడా నెక్ట్స్ పార్ట్లోనే ఉందనిపిస్తోంది. శ్రీరాముడికి ఆంజనేయుడు ఇచ్చిన మాట ఏంటి? అసలు ఆంజనేయుడికి ఈ హన్మంతుకు ఉన్న లింక్ ఏంటి? ఈ హన్మంతుని చేరమని విభీషణుడికి ఆంజనేయుడు చెప్పడం ఏంటి? అనే లింక్స్ అన్నీ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి.

  టెక్నికల్‌గా ఈ చిత్రం టాలీవుడ్‌కు ఓ గైడెన్స్‌లా ఉంటుంది. ఇంత తక్కువ బడ్జెట్‌లో అంత అవుట్ పుట్ ఎలా తీసుకొచ్చాడో ప్రశాంత్ వర్మే చెప్పాలి. విజువల్స్ గురించి ఏం చెప్పినా తక్కువే అవుతుంది. ఆంజనేయుడి గురించి పాటలు, హనుమాన్ చాలీసా, ఆర్ఆర్ వింటూ ఉంటే జనాలు వేరే ట్రాన్స్‌లోకి వెళ్తారు. మాటలు బాగున్నాయి. ఆంజనేయుడి గురించి చెప్పే సీన్లో ఎలివేషన్స్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉన్నాయి. ఎడిటింగ్ బాగుంది. ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంది. నిర్మాత పెట్టిన రూపాయికి.. ప్రశాంత్ వర్మ వంద రూపాయల అవుట్ పుట్ ఇచ్చాడనిపిస్తుంది.

  తేజ సజ్జా హన్మంతు పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. ఏమీ చేయలేని వాడు.. వీడి వల్ల ఏం అవుతుందని అనుకునేవాడికే సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుందో తేజ సజ్జా చూపించాడు. తేజ సజ్జా పాత్ర చిన్న పిల్లలకు తెగ నచ్చేస్తుంది. ఇక నుంచి తేజ సజ్జా చిన్న పిల్లల దృష్టిలో సూపర్ హీరో, హనుమాన్‌గా ఉంటాడు. తేజ సజ్జాను హీరోగా ప్రశాంత్ వర్మ తీసుకున్న నిర్ణయం సరైనదే అని సినిమా చూసిన తరువాత అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఈ కథను తేజ మోయలేదు. తేజనే ఈ కథ మోసింది. ఇలాంటి పాత్రకు కండలు తిరిగిన దేహం ఉన్న వ్యక్తి నటించి ఉంటే ఇంత ఎఫెక్ట్ వచ్చి ఉండేది కాదు. తేజ నటన చిన్నతనం నుంచి చూస్తేనే ఉన్నాం. నవ్వించగలడు, ఏడిపించగలడు. ఇందులో అన్నీ చేసేశాడు. మరీ ముఖ్యంగా సూపర్ హీరోగా చేసే విన్యాసాలు, కామెడీ అందరినీ నవ్వించేస్తాయి. మిగిలిన పాత్రల్లో అమృతా అయ్యర్ సగటు తెలుగు కమర్షియల్ హీరోయిన్‌గానే మిగిలింది. వరలక్ష్మీ స్థాయికి తగ్గ పాత్ర కాదనిపించింది. ఒకే ఒక్క సీన్‌లో తన సత్తాను చాటుకుంది. వినయ్ రాయ్ విలనిజం ఇంకా బాగా రాసుకుని, ఇంకా బాగా ఎలివేట్ చేస్తే బాగుండేది. అతనికి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు..ప్రపంచాన్ని ఎలా నాశనం చేద్దామని అనుకుంటున్నాడు.. అసలు అతని ఉద్దేశం ఏంటి అన్నది చూపిస్తే బాగుండేది. వెన్నెల కిషోర్ పాత్ర బాగుంది. కమెడియన్ సత్య, గెటప్ శ్రీనులు తెగ నవ్వించేశారు. రోహిణి సైతం కామెడీతో ఆకట్టుకుంది. ఇలా అన్ని పాత్రలు చక్కగా ఉన్నాయి.

  బాటమ్ లైన్ : పురాణాల్లో అయినా వెండితెరపై అయినా ‘హనుమాన్‌’కు తిరుగుండదు

  రేటింగ్ 4