- January 9, 2025
90శాతం సక్సెస్ అవుతుండటం సంతోషంగా ఉంది : ప్రముఖ గీత రచయిత కేకే
గీత రచయితగా తన ప్రస్థానం చాలా సంతృప్తికరంగా సాగుతోందని అన్నారు ప్రముఖ లిరిసిస్ట్ కేకే(కృష్ణకాంత్). గతేడాది రాసిన పాటలన్నీ ఛాట్ బస్టర్స్ కావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ డబ్బింగ్ మూవీస్ కు మ్యూజిక్ లవర్స్ ను మెప్పించే పాటలు రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో లిరిసిస్ట్ గా తన అనుభవాలను పాత్రికేయులతో పంచుకున్నారు కేకే.
– గీత రచయితగా చాలా సంతృప్తిగా ఉన్నాను. గతేడాది నాకు అద్భుతంగా గడిచింది. మంచి పాటలు రాసే అవకాశం వచ్చింది. నేను ఉద్యోగం వదులుకుని పాటల రచయితగా పేరు తెచ్చుకోవాలని వచ్చిన లక్ష్యం నేరవేరిందినే సంతృప్తి కలుగుతోంది. నేను లాస్ట్ ఇయర్ రాసిన పాటలు, డబ్బింగ్ సినిమా పాటలతో సహా ఛాట్ బస్టర్స్ అయ్యాయి. మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.
– ఇటీవల పాన్ ఇండియా మూవీస్ కు ఎక్కువగా పాటలు రాస్తున్నాను. పాన్ ఇండియా మూవీస్ కు పాటలు రాయడం నాపై ఒత్తిడి పెంచడం లేదు. సలార్, రాధే శ్యామ్ లాంటి పాన్ ఇండియా మూవీస్ కు పాటలు రాసినప్పుడు తెలుగులో రాసిన పాటను, ఇంగ్లీష్ లోకి ట్రాన్స్ లేట్ చేసి దాన్ని ఇతర భాషల లిరిక్ రైటర్స్ కు పంపాలి. వాళ్లు అది చూసి వాళ్ల వెర్షన్ లో రాస్తారు. పాన్ ఇండియా మూవీస్ వల్ల ఇదొక్కటే అదనపు వర్క్ అవుతోంది.
– ఒక సినిమాకు పాటలు రాయడానికి కథ మొత్తం తెలిస్తే రైటర్ కు అడ్వాంటేజ్ ఉంటుంది. నేను సింగిల్ కార్డ్ రాసిన సినిమాలు పడి పడి లేచె మనసు, సీతారామం(ఐదు పాటలు), సలార్, రాధే శ్యామ్ పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సింగిల్ కార్డ్ రాసిన చిత్రాలన్నీ నాకు లిరిక్ రైటర్ గా మంచి సంతృప్తిని అందించాయి. కేవలం పాట సందర్భం మాత్రమే కాకుండా కథ మొత్తం తెలియడం వల్ల ముందు పాటలో రాసిన పదాలను అవాయిడ్ చేసే అవకాశం లభిస్తుంది.
– గతేడాది నేను రాసిన పాటల్లో హాయ్ నాన్న మూవీలోని అడిగా పాట బాగా సంతృప్తిని ఇచ్చింది. సినిమాతో పాటు వివిధ మ్యూజిక్ కన్సర్ట్స్ ద్వారా ఈ పాట శ్రోతలకు బాగా చేరువయ్యింది. ఓం బీమ్ భుష్ లోని అణువణువు పాట బాగా వైరల్ అయ్యింది. అలాగే డబ్బింగ్ మూవీ ఏఆర్ఎం లోని అంబరాల వీధిలోని పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జనక అయితే గనక సినిమాలో నా ఫేవరేట్టు నా పెళ్లామే పాట కూడా బాగా హిట్టయ్యింది. ఇలా నేను రాసిన పాటల్లో 90శాతం సక్సెస్ అవుతుండటం సంతోషంగా ఉంది. రజినీకాంత్ వేట్టయాన్, శివకార్తికేయన్ అమరన్ సినిమాలకు రాసిన పాటలకు మంచి పేరొచ్చింది.
– స్ట్రైట్ పాట రాసేప్పుడు మనకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుంది. డబ్బింగ్ వెర్షన్ రాసేప్పుడు ఆ భాషలో వాడిన పదాలకు సరిపోయే తెలుగు పదాలను ఎంచుకుని రాయాల్సివస్తుంది. స్ట్రైట్ సాంగ్ తో చూస్తే డబ్బింగ్ సాంగ్ రాయడం కష్టం. న్యూ ఇయర్ లో స్క్రిప్ట్ రైటర్ గా ప్రయత్నిస్తున్నాను. ప్రశాంత్ వర్మ పీవీసీయూలో అధీర అనే మూవీకి డైలాగ్స్ ఇస్తున్నాను. పాటల బిజీలో డైలాగ్స్ వైపు ఇంతకాలం వెళ్లలేదు. ఇప్పుడు పాటలు, మాటలకు టైమ్ కేటాయించుకుంటున్నాను. దర్శకత్వ ఆలోచన ఉంది. కానీ ప్రస్తుతం రైటింగ్ పైనే దృష్టి పెట్టాను.
– ప్రభాస్, హను రాఘవపూడి గారి సినిమా లో రెండు సాంగ్స్ కు వర్క్ స్టార్ట్ చేశాం. హను గారి గత చిత్రాల్లో లవ్ స్టోరీస్ చూశాం. కానీ ప్రభాస్ హను గారి కాంబో మూవీలో హ్యూజ్ యాక్షన్, డ్రామా ఉంటూ ఒక హాలీవుడ్ మూవీ చూసిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ సినిమా ఒక పీరియాడిక్ మూవీ. 1940 దశకంలో సాగే పేట్రియాటిక్ కథతో ఉంటుంది.
– ఇప్పుడు ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ పాటలో హుక్ లైన్ ఉండాలని కోరుకుంటున్నారు. ఆ ఒత్తిడి లిరిక్ రైటర్స్ అందరిపై ఉంది. అయితే హుక్ లైన్ ట్రెండ్ అన్ని పాటలకు సరికాదనేది నా అభిప్రాయం. నేను వర్క్ చేసే ప్రతి టెక్నీషియన్ ఎంతో సపోర్టివ్ గా ఉంటున్నారు.
– సాటి గీత రచయితలు నాతో స్నేహంగా ఉంటారు. నేను మంచి పాట రాసినప్పుడు చంద్రబోస్ గారు ఫోన్ చేసి మాట్లాడుతారు. గతంలో సినిమా కథలు సాధారణ ప్రేక్షకుడు తనతో తాను పోల్చుకునేలా ఉండేవి. అందుకే ఆ సినిమాల్లో పాటలు చిరకాలం గుర్తుండిపోయాయి. ఇప్పుడలాంటి కథలు రావడం లేదు. ఎప్పుడైనా అవకాశం దొరికితే అది నిలుపుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను.
– ప్రభాస్ -హను మూవీ , రాజా సాబ్, రామ్ పోతినేని సినిమా కి , విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి వీడీ 12 తదితర చిత్రాలకు ప్రస్తుతం పాటలు రాస్తున్నాను. మరికొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ జరుగుతున్నాయి.