• November 10, 2023

అలా నిన్ను చేరి రివ్యూ.. ఫీల్ గుడ్ లవ్ ఎమోషనల్ డ్రామా

అలా నిన్ను చేరి రివ్యూ.. ఫీల్ గుడ్ లవ్ ఎమోషనల్ డ్రామా

    దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘అలా నిన్ను చేరి. ఈ మూవీని మారేష్ శివన్ తెరకెక్కించగా ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ పాటలు రాశారు.. సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించారు. మంచి ఫీల్ గుడ్ మూవీగా విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పించగా.. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

    కథ
    అనకాపల్లిలో గణేష్ (దినేష్ తేజ్) తన ఫ్రెండ్స్‌తో కలిసి జాలీగా తిరుగుతుంటాడు. డైరెక్టర్ అవ్వాలని లక్ష్యంతో ఉంటాడు. సినిమా పిచ్చితో అలా ఉన్న గణేష్ లైఫ్‌లోకి దివ్య (పాయల్ రాధాకృష్ణ) ఎంట్రీతోఅంతా మారుతుంది. అలా సాఫీగా సాగుతున్న ప్రేమలో కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. ఈ ప్రేమ విషయం దివ్య తల్లి కంచు కనకమ్మ (ఝాన్సీ)కి తెలుస్తుంది. ఆ తరువాత దివ్యకు ఆమె బావ కాళీ (శత్రు)కిపెళ్లి చేయాలని ఫిక్స్ అవుతుంది. ఆ తరువాత గణేష్ ఏం చేశాడు? దివ్య తాను ప్రేమించిన వాడ్ని దక్కించుకుందా? ప్రేమకు, లక్ష్యానికి మధ్య సతమతమైన గణేష్ ఏ నిర్ణయం తీసుకున్నాడు. చివరకు కలలు కన్నట్టుగా దర్శకుడు అయ్యాడా? చివరకు గణేష్ దివ్యల కథ ఏమైంది? అన్నది థియేటర్లో చూడాలి.

    నటీనటులు
    పక్కింటి కుర్రాడిలా దినేష్ తేజ్ గణేష్ పాత్రలో చక్కగా నటించాడు. ఎమోషనల్, యాక్షన్ సీన్స్‌తో మెప్పిస్తాడు. తనలోని అన్ని కోణాలను దినేష్ తేజ్ చూపిస్తాడు. ఇక పాయల్ ప్రథమార్థంలో కనిపిస్తే.. హెబ్బా ద్వితీయార్దంలో ఆకట్టుకుంటుంది. రెండు పాత్రలకు ప్రాధాన్యం ఉంటుంది. పాయల్‌ను హోమ్లీగా చూపిస్తే.. హెబ్బాను బోల్డ్‌గా చూపించారు. ఇద్దరూ చక్కగా నటించారు. మిగిలిన పాత్రల్లో రంగస్థలం మహేష్, బాషా, అనశ్వి, ఝాన్సీ, కల్పలత, శత్రు ఇలా అందరూ చక్కగా నటించారు.

    విశ్లేషణ
    ఈ చిత్రం కోసం ఓ పదిహేనేళ్ల క్రితం నాటి వాతావరణం, పరిస్థితుల్ని ఎంచుకున్నాడు. అప్పుడు ఇంతగా టెక్నాలజీ ఉండేది కాదు. వాట్సప్, ఫేస్ బుక్ వంటివి లేవు. ఫోన్ చేసుకోవాలన్నా ల్యాండ్ లైన్‌కే చేయాలి.. లేదంటే చాలా రేర్‌గా డబ్బా ఫోన్‌లు కనిపిస్తుంటాయి. అలాంటి బ్యాక్ డ్రాప్‌లో రాసుకున్న ఈ కథ.. ఇప్పటి తరానికి కాస్త ఫ్రెష్‌గానే అనిపిస్తుంది. ఎమోషనల్‌గా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ప్రేమలో ఉండే హాయిని, సంతోషాన్ని చూపించారు.

    ప్రేమ అనేది యూనివర్సల్ కాన్సెప్ట్. ప్రేమ లేకుండా జీవితాన్ని గానీ, సినిమాను గానీ ఊహించుకోలేం. అలా నిన్ను చేరి సినిమా అంతా కూడా ప్రేమతోనే నిండిపోయింది. ఫస్ట్ హాఫ్‌లో హీరో హీరోయిన్ల ప్రేమ ఉంటే.. రెండో హాఫ్‌లో వన్ సైడ్‌లా ఇంకో హీరోయిన్ ప్రేమను చూపిస్తారు. ఇక ఈ ప్రేమకు, లక్ష్యానికి మధ్య సంఘర్షణను హీరో పాత్రతో చక్కగా చూపించాడు దర్శకుడు మారేష్ శివన్.

    ద్వితీయార్దంలో లక్ష్యం కోసం పని చేసే కుర్రాడి అంకితభావం, కష్టపడేతత్త్వంను చూపించారు. రెండో భాగంలో హెబ్బా పటేల్‌తో రాసుకున్న ట్రాక్, చెప్పించిన డైలాగ్స్ బాగుంటాయి. ఈ చిత్రంలో మాటలు గుండెలను తాకేలా ఉంటాయి. పాటలు ఓకే అనిపిస్తాయి. ఆర్ఆర్ బాగుంటుంది. సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ఆ నిడివి సమస్యగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు చక్కగా ఉన్నాయి. మొదటి సినిమానే అయినా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా చిత్రాన్ని నిర్మించారు.

    రేటింగ్ 3/5