- August 18, 2022
Thiru Review : తిరు మూవీ రివ్యూ.. ఎమోషనల్ కంటెంట్

Thiru Movie Review ధనుష్ చేసే సినిమాలపై మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఇప్పుడు అతను గ్లోబర్ స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. అయితే వాటికి తగ్గ కథలు మాత్రం ఇప్పుడు ఎంచుకున్నట్టు కనిపించడం లేదు. ఆయన నటించిన చిత్రాలు అంతగా మెప్పించడం లేదు. చివరగా కర్ణన్ సినిమాతోనే ధనుష్ ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు తిరు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఆడియెన్స్ ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.
కథ
తిరు ఏకాంబరం అలియాస్ పండు (ధనుష్) తన తండ్రి(ప్రకాష్ రాజ్)తో పదేళ్లు మాట్లాడకుండా ఎడమొహం పెడమొహంగా ఉంటాడు. తన తల్లి, చెల్లి చావుకు తండ్రే కారణమని ద్వేషిస్తుంటాడు తిరు. సీనియర్ పండు అలియాస్ సీనియర్ తిరు ఏకాంబరం (భారతీ రాజా) ఈ ఇద్దరికీ వారధిలా ఉంటాడు. తన తాత కోసమే తిరు ఇంట్లో ఉంటాడు. ఇక చిన్ననాటి స్నేహితురాలు శోభన (నిత్యా మీనన్) తిరుకు అన్ని విషయాల్లో తోడుంటుంంది. తిరు మధ్యలోనే చదువు మానేయడంతో చిరవకు డెలివరీ బాయ్‌లా సెటిల్ అవుతాడు. చిన్నతనంలో స్కూల్‌లో అనూష (రాశీ ఖన్నా) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. మళ్లీ ఓ సంఘటనతో అనూషను కలుస్తాడు. ఆ తరువాత మెల్లిగా తన ప్రేమ విషయం చెబుతాడు. కానీ అనూష మాత్రం తిరస్కరిస్తుంది. ఆ తరువాత రంజినీ (ప్రియా భవానీ శంకర్)ను తిరు ఇష్టపడుతాడు. కానీ ఆమె కూడా అలాంటి సమాధానమే చెబుతుంది. చివరకు తిరు తన ప్రేమను ఎక్కడ కనుగొన్నాడు? శోభన మనసులో ఏముంది? అసలు చివరకు శోభన తిరుల కథ ఎలా మలుపు తిరుగుతుంది? అనేది కథ.
నటీనటులు
ధనుష్‌కు ఇలాంటి భావోద్వేగాలు పండించడం కొత్తేమీ కాదు. రఘువరన్ బీటెక్ వంటి సినిమాల్లో ధనుష్ ఎంతో ఎమోషనల్‌గా నటించాడు. ఇందులోనూ ధనుష్ కాస్త భయస్థుడు, పక్కింటి కుర్రాడిలా అద్భుతంగా నటించాడు. ఇక ప్రకాష్ రాజ్ బాగానే నటించినా డబ్బింగ్ సెట్ కాలేదు. భారతీ రాజా ఈ చిత్రానికి వెన్నుముకగా నిలిచాడు. శోభన పాత్రలో నిత్యామీనన్ ఆకట్టుకుంటుంది. ఇలాంటి ఫ్రెండు ఉండాలని ప్రతీ ఒక్కరూ అనుకునేలా చేసింది. రాశీ ఖన్నా, ప్రియా భవానీ శంకర్ అందరూ కనిపించినంత సేపు కట్టి పడేశారు.
విశ్లేషణ
ఇదేమీ కొత్త కథ కాదు. ఆహా అనిపించే ట్విస్టులేమీ ఉండవు. విజిల్స్ వేసే యాక్షన్ సీన్స్ ఉండవు. క్లీన్ అండ్ నీట్‌గా సాగుతూ ఉంటుంది. మనం ఏదో మన పక్కింట్లో జరుగుతున్న స్టోరీని చూస్తున్నట్టు అనిపిస్తుంది. కావాలని ఏదో ఇరికించాలని ఎక్కడా కూడా హీరోయిజాన్ని పెట్టలేదు. సాధారణ కథను, ప్రేమను, ఎమోషన్స్‌ను గుండెకు హత్తుకునేలా చేశారు.
తండ్రీ కొడుకులు, తాత మనవడు రిలేషన్‌ను ఎంతో గొప్పగా చూపించారు. కొన్ని సార్లు కుటుంబ బరువు మోయడం సుఖంగా ఉంటే.. ఇంకొన్ని సార్లు కుటుంబానికి భారం కావడం కూడా సుఖంగా ఉంటుందంటూ భారతీ రాజా చెప్పిన డైలాగ్ హృదయాన్ని తాకేలా ఉంటుంది. అలా ఎన్నెన్నో ఎమోషనల్ సీన్స్ ఇందులో ఉన్నాయి. అయితే ప్రేమ కథను కూడా ఎంతో లైటర్ వేలో తీసుకెళ్లాడు.
తన పక్కనే ప్రేమను పెట్టుకుని.. ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికే తిరు.. చివరకు రియలైజ్ అయ్యే సీన్ అద్భుతంగా అనిపిస్తుంది. మాటలు, పాటలు పర్వాలేదనిపిస్తుంది. కానీ రఘువరన్ బీటెక్ బీజీఎం విన్నట్టుగా ఆ మూడ్‌లో ఉంటుంది. అక్కడక్కడా తమిళ వాసన గుప్పుమంటూనే ఉంటుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రపీ, నిర్మాణ విలువలన్నీకూడా బాగానే ఉన్నాయి.
బాటమ్ లైన్ : హృదయాన్ని తాకే ‘చి (తి)రు’ గాలి
రేటింగ్ : 3